వాల్మీకి రామాయణం 321 వ భాగం, యుద్ధకాండ
Posted by adminNov 17
వాల్మీకి రామాయణం 321 వ భాగం, యుద్ధకాండ
రామ! రావణుడు నన్ను అపహరించాక దండకారణ్యం అంతా వెతికావు, హనుమని పంపించావు, నాకోసం సముద్రానికి సేతువుని కట్టి, దాటి వచ్చావు, చివరికి యుద్ధంలో ఇంద్రజిత్ మాయ వల్ల మరణించావు, ఎంత ఆశ్చర్యం రామ, నీకు బ్రహ్మాస్త్రం తెలుసు, బ్రహ్మశిరోనామకాస్త్రం తెలుసు, వారుణాస్త్రం తెలుసు, ఆగ్నేయాస్త్రం తెలుసు, ఇన్ని అస్త్రములు తెలిసిన నిన్ను ఒకడు కేవలం మాయతో కనపడకుండా కొట్టిన బాణములకు శరీరం వదిలేశావు. నువ్వు మరణించావన్న వార్త విని కౌసల్యాదులు బతుకుతార, అయోధ్య అయోధ్యలా ఉంటుందా. నువ్వు ఇన్ని కష్టాలు పడడానికి, అర్ధాంతరంగా శరీరం విడిచెయ్యడానికి నన్ను పెళ్ళి చేసుకున్నావ. నువ్వు నన్ను చేసుకోకపోతేనె బాగుండేదేమో ” అని సీతమ్మ ఏడుస్తుంటే పుష్పకంలో ఉన్న త్రిజట చూడలేకపోయింది. అప్పుడు త్రిజట ” ఏడవకు సీతమ్మ. రామలక్ష్మణులు మరణించలేదు, వాళ్ళిద్దరూ సజీవంగా ఉన్నారు. నేను నిన్ను ఓదార్చడానికి ఈ మాటలు చెబుతున్నానని అనుకుంటున్నావ, కాని నేను నీకు రామలక్ష్మణులు బతికున్నారని చెప్పడానికి ఒక బలవత్తరమైన కారణాన్ని చెబుతాను. భర్త మరణించిన స్త్రీ కాని ఈ పుష్పక విమానం ఎక్కితే ఇది పైకి ఎగరదు, నువ్వు పుష్పకంలోకి ఎక్కగా ఇది ఆకాశంలో నిలబడిందంటే, నువ్వు సౌభాగ్యవతిగా ఉన్నావు అని అర్ధం. యోధుడైనవాడు నిజంగా శరీరాన్ని విడిచిపెడితే సైన్యాలు ఇలా నిలబడవు, ఎవరి మానాన వాళ్ళు పారిపోతుంటారు. రామలక్ష్మణుల ముఖాల్లో కాంతి ఏ మాత్రం తగ్గలేదు. కొద్దిసేపు మూర్చపోయారు అంతే. కొద్దికాలంలో రావణుడి పది తలలు పడిపోయి ఇదే పుష్పకంలో రాముడితో కలిసి నువ్వు అయోధ్యకి వెళ్ళిపోతావు. ఏ రాక్షస స్త్రీకి నామీద లేని ప్రేమ నీ ఒక్కదానికే నా మీద ఎందుకు అంటావేమో, నిన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పటినుంచి నీ ప్రవర్తన చూస్తున్నాను. నీ ప్రవర్తన చేత, నీకు భర్త అంటె ఉన్న ప్రేమ చేత, నాకు నువ్వంటే విపరీతమైన ప్రేమ ఏర్పడింది. అందుకని నీకెప్పుడూ మంచి చెయ్యాలనే చూస్తుంటాను. అమ్మ! ఇంతకముందెన్నడూ నేను అబద్ధాలు చెప్పలేదు, ఇక ముందు కూడా ఎన్నడూ అబద్ధాలు చెప్పను. రామలక్ష్మణులు జీవించి ఉన్నారని నేను చెప్పినది పరమ సత్యం, నువ్వు బెంగ పెట్టుకోకు తల్లీ ” అని చెప్పింది.
తరువాత ఆ పుష్పక విమానాన్ని అశోకవనానికి తీసుకెళ్ళి దింపేశారు.