వాల్మీకి రామాయణం 322 వ భాగం, యుద్ధకాండ

ఇంతలో రాముడు మెల్లగా తేరుకుని ఎదురుగా మూర్చపోయి పడిఉన్న లక్ష్మణుడిని చూసి ” ఒకవేళ లక్ష్మణుడి ప్రాణములు దక్కకపోతే, నేనొక్కడినే బతికితే, సీత నాకు దక్కినా ఆ బ్రతుకు నాకెందుకు. ఎలోకంలోనైనా వెతికితే సీతలాంటి భార్య దొరకచ్చు, కాని లక్ష్మణుడిలాంటి తమ్ముడు దొరకడు. కార్తవీర్యార్జునుడు( ఈయన ఒకసారి రావణుడిని ఓడించి చెరసాలలో బంధించాడు. ఈయనకి 1000 చేతులు ఉండేవి) ఒకేసారి 500 బాణములను ప్రయోగం చేసేవాడు, అంతకన్నా ఎక్కువ బాణములను ప్రయోగం చెయ్యగలిగే శక్తి లక్ష్మణుడికి ఉంది. నాకోసమని యుద్ధానికి వచ్చి లక్ష్మణుడు ఇలా పడిపోతే నాకు ఇంక సీత ఎందుకు. నాకు ఈ జీవితం అక్కరలేదు ” అని రాముడు బాధపడ్డాడు.

అప్పుడాయన సుగ్రీవుడిని పిలిచి ” సుగ్రీవ! ఇప్పటివరకూ నువ్వు నాకు చేసిన ఉపకారం చాలు, లక్ష్మణుడిని ఇలా చూస్తూ నేను బ్రతకను. నేను శరీరాన్ని వదిలేస్తాను. ఇది తెలిశాక రావణుడు నిన్ను విడిచిపెట్టడు, అందుకని నువ్వు నీ సైన్యాన్ని తీసుకొని సేతువు దాటి వెనక్కి వెళ్ళిపో. జాంబవంత, హనుమ, అంగద, మీరందరూ నాకు మహోపకారం చేశారు, మీరందరూ వెళ్ళిపొండి. నేను ఒక్క విషయానికే సిగ్గుపడుతున్నాను, విభీషణుడికి లంకా రాజ్యం ఇస్తానని ప్రతిజ్ఞ చేశాను, ఇప్పుడది అసత్య వాక్కు అయ్యింది. అసత్య వాక్యం నా నోటి నుండి దొర్లిందని నేను బాధపడుతున్నాను ” అన్నాడు.

అప్పుడు సుగ్రీవుడు ” విభీషణ! నువ్వు వానరాలని తీసుకొని కిష్కిందకి వెళ్ళు, నేను రావణుడిని సంహరించి సీతమ్మని తీసుకొస్తాను. సుషేణ! వీళ్ళు మూర్చపోయి ఉన్నారు, ఇంకా వీళ్ళ ప్రాణములు పోలేదు, తొందరగా వీళ్ళని కిష్కిందకి తీసుకుపో ” అన్నాడు.