వాల్మీకి రామాయణం 325 వ భాగం, యుద్ధకాండ

ఆ ధూమ్రాక్షుడు తన యొక్క బాణములతో వానరులని కొట్టి వాళ్ళ శరీరాలని చీల్చేస్తున్నాడు. అప్పుడు హనుమంతుడు ఒక పెద్ద శిలని పెకలించి పరుగు పరుగున వచ్చి దానిని ధూమ్రాక్షుడి మీదకి విసిరాడు. హనుమ వేసిన శిలని గమనించిన ధూమ్రాక్షుడు ఆ రథం నుంచి బయటకి దూకేశాడు. ఆ రథం తుత్తునియలు అయిపోయింది. తరువాత ఆ ధూమ్రాక్షుడు కొన్ని బాణములతో హనుమంతుడిని కొట్టాడు. వెంటనే హనుమంతుడు ఒక పర్వత శిఖరాన్ని పీకి ఆ ధూమ్రాక్షుడి మీద వేశాడు. నజ్జునజ్జయిపోయి ఆ ధూమ్రాక్షుడు మరణించాడు.

తరువాత రావణుడు వజ్రదంష్ట్రుడు అనే రాక్షసుడిని యుద్ధానికి పంపాడు. అప్పుడాయన సైన్యంతో కలిసి దక్షిణ ద్వారంగుండా బయటకి వచ్చాడు. ఆ వజ్రదంష్ట్రుడు బయటకి రాగానే అరణ్యంలో ఉన్న నక్కలు అరిచాయి, అన్ని మృగాలు ఏడిచాయి. ఆ వజ్రదంష్ట్రుడు ఒకేసారి 7-8 బాణములని ప్రయోగించేవాడు. అన్ని వైపులకి బాణములని ప్రయోగం చేసి వానరములని కొట్టాడు. ఇక వీడిని ఉపేక్షించకూడదని అంగదుడు భావించి, ఒక పెద్ద వృక్షాన్ని పట్టుకొచ్చి వజ్రదంష్ట్రుడిని కొట్టబోయాడు. కాని ఆ వృక్షాన్ని తన బాణముల చేత వజ్రదంష్ట్రుడు నరికేశాడు. తరువాత అంగదుడు ఒక పెద్ద పర్వతాన్ని పట్టుకొచ్చి దానిని విసిరేశాడు. ఆ దెబ్బకి వజ్రదంష్ట్రుడి రథం ముక్కలయిపోయింది. మళ్ళి అంగదుడు ఒక పర్వత శిఖరాన్ని పట్టుకొచ్చి విసిరేసరికి దాని కిందపడి వజ్రదంష్ట్రుడు మరణించాడు.