వాల్మీకి రామాయణం 328 వ భాగం, యుద్ధకాండ
Posted by adminNov 24
వాల్మీకి రామాయణం 328 వ భాగం, యుద్ధకాండ
రాముడంతటివాడు కూడా యుద్ధ భూమిలోకి వస్తున్న రావణుడిని చూసి ‘ మిట్ట మధ్యానం వేళ సూర్యుడిని చూస్తే స్పష్టంగా కనపడకుండా ఆయన తేజస్సు చేత కళ్ళు అదిరినట్టు, ఈయనని చూస్తే కూడా కళ్ళు అదురుతున్నాయి. ఎవరీ వస్తున్నవాడు ‘ అని ఆశ్చర్యపోయి, వస్తున్నవాడు ఎవరని విభీషణుడిని అడిగాడు.
విభీషణుడు అన్నాడు ” రామ! ఆ ఏనుగు మీద వస్తున్నవాడు అకంపనుడు( ఇందాక చనిపోయినవాడు కూడా అకంపనుడే, కాని వీడు ఇంకొక అకంపనుడు), వాడిది సామాన్యమైన యుద్ధం కాదు, వాడిని కనీసం పర్వత శిఖరాలతో కొట్టాలి, లేకపోతె వాడికి ఇష్టం ఉండదు. ఆయన పక్కన రథంలో వస్తున్నవాడు ఇంద్రజిత్. వాడి రథం యజ్ఞాగ్నిలో నుంచి బయటకి వస్తుంది, సింహములు పూన్చిన రథం మీద వస్తాడు. ఈ పక్కన, మహేంద్ర పర్వతం, వింధ్య పర్వతం ఎంత శరీరాలతో ఉంటాయో, ఎంత ధైర్యంతో ఉంటాయో, అంతటి ధైర్యము, శరీరము ఉన్న అతికాయుడు వస్తున్నాడు. పర్వత శిఖరం కదిలొస్తోందా అన్నట్టుగా ఉన్న ఆ ఏనుగు మీద వస్తున్నవాడు మహోదరుడు. అక్కడ ఒక గుర్రము ఎక్కి పాశము పట్టుకొని వస్తున్నవాడు పిశాచుడు, వాడు అరవీరభయంకరుడు. అటుపక్క వృషభం ఎక్కి చేతిలో శూలం పట్టుకొని వస్తున్నవాడు త్రిశిరస్కుడు, వాడు మహా ఘోరమైన యుద్ధం చేస్తాడు. అటుపక్క తన ధ్వజానికి సర్పాన్ని గుర్తుగా పెట్టుకొని, ధనుస్సు పట్టుకొని వస్తున్నవాడు కుంభుడు. అలాగే పర్వతాలని గులకరాళ్ళగా విసరగల బాహుపరాక్రమము కలిగినవాడు ఆ పక్కన వస్తున్నాడు, వాడి పేరు నరాంతకుడు. భోజనం చెయ్యడం అందరికీ ఎంత సంతోషమో, యుద్ధం చెయ్యడం అంత సంతోషంగా ఉండేవాడు నికుంభుడు.
అదుగో అక్కడ పది తలకాయలతో, ఇరవై చేతులతో, కిరీటాలు వేసుకొని, కుండలాలు తొడుక్కొని, బ్రహ్మాండమైన పర్వతంవంటి భీమకాయం కలిగినవాడు, మహేంద్రుడు, యముడు, దేవతలు మొదలైనవారిని యుద్ధరంగంలో పరుగులు తీయించినవాడు, అందరినీ శాసించగలిగినవాడు, ఎవడి పేరు చెబితే లోకాలు ఏడుస్తాయో అటువంటి రావణుడు ఆ ఏనుగు మీద వస్తున్నాడు.