వాల్మీకి రామాయణం 329 వ భాగం, యుద్ధకాండ

అప్పుడు రాముడు రావణుడిని చూసి ” ఏమి తేజస్సు, ఏమి కాంతి, ఏమి స్వరూపం, ఏమి పరాక్రమం, మిట్ట మధ్యానం సూర్యుడిలా ప్రకాశిస్తున్నాడు. ఇప్పటివరకూ నేను దేవతలలో కాని, యక్షులలో కాని, గంధర్వులలో కాని ఇంత తేజస్సు కలిగినవాడిని చూడలేదు. కాని ఇన్నాళ్ళకి రావణుడిని చూసే అదృష్టం కలిగింది, ఇక వీడు తిరిగి ఇంటికి వెళ్ళడు. ఎవరితో యుద్ధం చెయ్యాలని చూస్తున్నానో అటువంటివాడు ఇవ్వాళ యుద్ధ భూమిలోకి వచ్చాడు ” అని సంతోషంగా ధనుస్సుని చేతితో పట్టుకొని టంకారం చేశాడు.

రావణుడిని చూడగానే సుగ్రీవుడు ఒక పెద్ద పర్వత శిఖరాన్ని పెకలించి గబగబా వెళ్ళి రావణుడి మీద పడేశాడు. తన మీదకి వస్తున్న ఆ పర్వత శిఖరాన్ని రావణుడు అర్థచంద్రాకార బాణాలతో తుత్తునియలు చేసి, బంగారు కొనలు కలిగిన బాణాలతో సుగ్రీవుడి గుండెల్లో కొట్టాడు. ఆ దెబ్బకి భూమిలో నుంచి జలం పైకొచ్చినట్టు సుగ్రీవుడి గుండెల్లోనుంచి రక్తం పైకి వచ్చింది. అంతటి సుగ్రీవుడు కూడా గట్టిగా అరుస్తూ కిందపడి మూర్చపోయాడు. తదనంతరం గవాక్షుడు, గవయుడు, సుషేణుడు, ఋషభుడు, నలుడు మొదలైన వానర వీరులందరి మీద 4, 6, 8, 12 బాణములను ఏకాకాలమునందు విడిచిపెట్టి వాళ్ళ మర్మస్థానముల మీద కొట్టాడు. వాళ్ళందరూ కింద పడిపోయారు.

వానర వీరులందరినీ రావణుడు కొట్టేస్తున్నాడని హనుమంతుడు గబగబా వచ్చి రావణుడి రథం ముందు నిలబడి కుడి చెయ్యి బిగించి ” రావణా! నీకు బ్రహ్మగారి వరాలు ఉన్నాయని మిడిసిపడ్డావు, సీతమ్మని అపహరించావు, నా పిడికిలి గుద్దు చేత నీలోని జీవాత్మని పైకి పంపించేస్తాను రా ” అన్నాడు.

అప్పుడు రావణుడు ” నువ్వంత మొనగాడివైతే అది చాలా గొప్ప విషయమే, నన్ను గుద్దు చూస్తాను ” అన్నాడు.

హనుమంతుడు తన పిడికిలిని బిగించి రావణుడి శిరస్సు మీద ఒక గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకి రావణుడు స్పృహ తప్పినట్టయ్యి అటు ఇటూ తూలి ” ఆహా! ఏమి గుద్దు గుద్దావురా, చేస్తే నీలాంటి వాడితో యుద్ధం చెయ్యాలి ” అన్నాడు.

అప్పుడు హనుమంతుడు ” ఛి దురాత్ముడా, ఇన్నాళ్ళకి నా పిడికిలి పోటు మీద నాకు అసహ్యం వేసింది. దీనితో గుద్దాక నువ్వు బతికి ఉన్నావు, ఎంత ఆశ్చర్యం. నేను ఇంక నిన్ను కొట్టను, నువ్వు నా వక్షస్థలం మీద గుద్దు, నా శక్తి ఏమిటో నువ్వు చూద్దువు కాని. అప్పుడు నేను నిన్ను మళ్ళి తిరిగి గుద్దుతాను ” అన్నాడు.

అప్పుడు రావణుడు తన కుడి చేతిని బిగించి హనుమ యొక్క వక్షస్థలం మీద ఒక గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకి హనుమంతుడు గిరగిరా తిరిగి నెత్తురు కక్కుతూ నేల మీద పడిపోయాడు.