వాల్మీకి రామాయణం 331 వ భాగం, యుద్ధకాండ
Posted by adminNov 27
వాల్మీకి రామాయణం 331 వ భాగం, యుద్ధకాండ
“దుష్టాత్ముడవై మా వదినని అపహరించావు, ఇప్పుడు యుద్ధ భూమిలో కనపడ్డావు కనుక నువ్వు ఇక ఇంటికి వెళ్ళే సమస్య లేదు ” అని చెప్పి లక్ష్మణుడు రావణుడి మీద బాణములను ప్రయోగించాడు. లక్ష్మణుడు వేసిన బాణములను రావణుడు దారిలోనే సంహారం చేసి తాను కొన్ని బాణములను ప్రయోగించాడు. రావణుడు వేసిన బాణములను లక్ష్మణుడు నిగ్రహించాడు. ఇక లక్ష్మణుడిని ఉపేక్షించకూడదని రావణుడు భావించి బ్రహ్మగారు ఇచ్చిన శక్తి(ఈ అస్తం ఎవరిమీదన్నా ప్రయోగిస్తే ఇంక వాళ్ళు మరణించవలసిందే) అనే భయంకరమైన ఆయుధాన్ని అభిమంత్రించి ఆయన మీద వేశాడు. లక్ష్మణుడు దాని మీదకి వేసిన అనేకమైన బాణములను కూడా అది నిగ్రహించుకుంటూ వచ్చి ఆయన వక్షస్థలం మీద పడింది. అప్పుడు లక్ష్మణుడు ‘ నేను విష్ణు అంశ ‘ అని స్మరించాడు. అయినా ఆ బాణము యొక్క దెబ్బకి లక్ష్మణుడు స్పృహ కోల్పోయి నేల మీద పడిపోయాడు.
వెంటనే రావణుడు లక్ష్మణుడిని తన రథంలో లంకకి తీసుకు వెళదామని అనుకొని పరుగు పరుగున వచ్చి తన 20 చేతులతో లక్ష్మణుడిని ఎత్తబోయాడు. ఆ చేతులతో మేరు పర్వతాన్ని, మందర పర్వతాన్ని ఎత్తిన రావణుడు, ఆ చేతులతో హిమవత్ పర్వతాన్ని కదిపిన రావణుడు ఇవ్వాళ ఆ చేతులతో లక్ష్మణుడిని ఎత్తలేకపోయాడు( లక్ష్మణుడు పడిపోయేముందు ‘ నేను విష్ణు అంశని ‘ అని పడిపోయాడు కనుక రావణుడు ఎత్తలేకపోయాడు). ఇంతలో హనుమంతుడు మూర్చనుండి తేరుకుని చూసేసరికి, రావణుడు రథం దిగి లక్ష్మణుడిని పైకెత్తడానికి ప్రయత్నిస్తూ కనపడ్డాడు. అప్పుడు హనుమంతుడికి ఎక్కడలేని కోపం వచ్చి ‘ నీ దిక్కుమాలిన చేతులతో లక్ష్మణుడిని ముట్టుకుని, ఎత్తి తీసుకు పోదామనుకుంటున్నావా ‘ అనుకొని, పరుగు పరుగున వచ్చి తన కుడి చేతితో రావణుడి వక్షస్థలంలో ఒక పోటు పొడిచాడు. ఆ దెబ్బకి రావణుడి చెవుల నుండి, ముక్కు నుండి, కనుగుడ్ల పక్కనుండి కూడా రక్తం కారి, మోకాళ్ళ మీద కిందకి పడిపోయి, మళ్ళి స్పృహలోకి వచ్చి గబగబా తన రథంలోకి వెళ్ళి కూర్చుండిపోయాడు.
అప్పుడు లక్ష్మణుడిని హనుమంతుడు పరమభక్తితో, రక్షించుకోవాలనే భావనతో ముట్టుకునేసరికి ఆయన దూదిపింజలా పైకి లెగిసిపోయాడు. లక్ష్మణుడిని తీసుకెళ్ళి రాముడికి అప్పగించారు. వెంటనే లక్ష్మణుడు స్పృహని పొంది ” బ్రహ్మగారి శక్తిని నా మీదకి ప్రయోగించాడు అన్నయ్యా, అప్పుడు నేను విష్ణు అంశని స్మరించాను. నాకు ఏ ఉపద్రవం లేదు ” అన్నాడు.