వాల్మీకి రామాయణం 334 వ భాగం, యుద్ధకాండ

ఒకనాడు బ్రహ్మగారు నాతో ‘ నువ్వు మనుష్యుల చేతిలో నశించిపోతావు ‘ అన్నారు. ఆయన మాట యదార్ధమవుతోంది. ఆ బ్రహ్మగారి గురించి తపస్సు చేసినప్పుడు దేవ, దానవ, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషుల చేతుల్లో మరణించకూడదని కోరుకున్నాను, కాని మనుష్యుల చేతిలో, వానరుల చేతిలో మరణించకూడదన్న వరాన్ని నేను అడగలేదు. నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తోంది, ఇక్ష్వాకు వంశంలో అనరణ్యుడు( రావణుడు అనరణ్యుడిని యుద్ధంలో సంహరించాడు) అని ఒక రాజు ఉండేవాడు. ఆయన నన్ను ఒకనాడు ‘ ఒరేయ్ రాక్షసుడా, మా ఇక్ష్వాకు వంశంలో ఒకనాడు రాముడన్నవాడు జన్మిస్తాడు, ఆయన నిన్ను సంహరిస్తాడు ‘ అని శపించాడు. బహుశా ఆయనే ఇవ్వాళ ఇక్ష్వాకు వంశంలో రాముడిగా వచ్చి ఉంటాడు. ఒకనాడు పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న వేదవతిని అనుభవించాలని ప్రయత్నించాను. ఆ వేదవతి ‘ స్త్రీ కారణంగా నువ్వు నశించిపోతావు ‘ అని శపించింది. బహుశా ఆ వేదవాతే జనక మహారాజుకి కూతురిగా సీతగా పుట్టిందిరా, నేను సీతని నా మృత్యువు కోసమే తెచ్చిపెట్టుకున్నాను. ఒకనాడు కైలాశ పర్వతం మీద పార్వతీదేవి నన్ను శపించింది, నందీశ్వరుడు శపించాడు( నందీశ్వరుడిని చూసి రావణుడు ‘ కోతి ముఖంవాడ ‘ అని హేళన చేశాడు. ‘ ఆ వానరాలే నీ కొంప ముంచుతాయిరా ‘ అని నంది అన్నాడు). నలకూభరుడి భార్య  అయిన రంభ శాపం ఫలిస్తోంది, వరుణుడి కుమార్తె అయిన పుంజకస్థల శాపం ఫలిస్తోంది. ఇవ్వన్నీ నిజం చెయ్యడం కోసమని రాముడొచ్చాడని నేను అనుకుంటున్నాను.

అయినా నేను దేవ దానవులని ఓడించినవాడిని, నేను ఎవరికీ భయపడను, సీతని ఇవ్వను. మీరందరూ జాగ్రత్తగ కోట బురుజులు ఎక్కండి, ప్రాసాదాలు ఎక్కండి. నేను ఎవరిని పిలిస్తే వాళ్ళు రావాలి, యుద్ధానికి వెళ్ళాలి. ఇంక మామూలు వాళ్ళు యుద్ధానికి పనికిరారు. నా తమ్ముడైన కుంభకర్ణుడు ఉన్నాడు, వాడి యుద్ధానికి ఇంద్రుడు మొదలైన వాళ్ళే హడలిపోయారు. వాడు మొన్ననే సభకి వచ్చాడు, ఇప్పుడు నిద్రపోతున్నాడు. వాడిని లేపడమే కష్టం, వాడు లెగిస్తే రాముడు ఎంత. వెంటనే వెళ్ళి కుంభకర్ణుడిని లేపి తీసుకురండి ” అన్నాడు.