వాల్మీకి రామాయణం 335 వ భాగం, యుద్ధకాండ
Posted by adminDec 1
వాల్మీకి రామాయణం 335 వ భాగం, యుద్ధకాండ
రావణుడి ఆజ్ఞ మేరకు నిద్రపోతున్న కుంభకర్ణుడిని నిద్రలేపడానికి ఎందరో సైనికులు ఆయన యొక్క శయనాగారంలోకి ప్రవేశించారు. లోపల కుంభకర్ణుడు వింధ్య పర్వతం, మేరు పర్వతం పడుకున్నట్టు పడుకున్నాడు. ఆయన ముక్కు యొక్క రంధ్రములు పెద్ద పర్వత గుహలలా ఉన్నాయి, ఆయన ఊరిపి తీసేసరికి తలుపులు తీసిన వాళ్ళందరూ ఆయన ముక్కులోకి దూరిపోయారు. మళ్ళి ఆయన ఊపిరి విడిచేసరికి లోపలికి వెళ్ళిన వాళ్ళు అక్కడున్న గోడలకి, తలుపులకి కొట్టుకొని కిందపడిపోయారు. ఆయనని ఎలా నిద్రలేపాలి అని వాళ్ళు బాగా ఆలోచించి ” ఈయనకి తినడం అంటె బాగా ఇష్టం. అందుకని ఈయనకి ఇష్టమైన పదార్ధాలని తీసుకొచ్చి పెడదాము. ఎంత నిద్రపోతున్నవాడైనా వాసన పీల్చడం అనేది తప్పదు కదా, మనం పెట్టిన పదార్ధాల వాసనకి నిద్ర లేస్తాడు ” అని అనుకొని ఆయనకి ఇష్టమైన దున్నపోతులని, జింకలని మొదలైన అనేక మృగాలని చంపి, వాటితో మంచి వాసనలు వచ్చే కూరలు వండారు. వండినవాటిని పెద్ద పెద్ద పాత్రలలోకి సర్దారు. తరువాత ఆ పాత్రలని తీసుకొచ్చి ఆయన పడుకున్న శయనాగారంలో సర్దారు. కొన్ని వేల కుంభములతొ మద్యాన్ని తీసుకొచ్చి పెట్టారు. అన్ని ఆహార పదార్ధాలు తీసుకొచ్చి పెట్టినా కుంభకర్ణుడికి తెలివి రాలేదు.
అప్పుడు వాళ్ళు తెల్లటి శంఖాలను పట్టుకొచ్చి మోగించారు, భేరీలు, మృదంగాలు మోగించారు. పెద్ద పెద్ద శూలాలు, పరిఘలు, తోమరాలు పట్టుకొచ్చి ఆయనని పొడిచారు. ఆ కుంభకర్ణుడి చేతులని కొన్ని వందల మంది రాక్షసులు ఎత్తి కిందపడేశారు. తరువాత వాళ్ళు ఏనుగుల్ని, కంచర గాడిదలని, ఎద్దులని, ఒంటెలని తెచ్చి ఆయన శరీరం మీదకి తోలారు. అవి ఆయన శరీరం మీదకి ఒక వైపు నుండి ఎక్కి మళ్ళి ఇంకొక వైపు నుండి దిగుతున్నాయి. వాళ్ళు అన్ని చేసినా కుంభకర్ణుడు మాత్రం చెలించకుండా అలానే నిద్రపోతున్నాడు.
తరువాత వాళ్ళు బాగా చల్లగా ఉన్న నీటి కడవలని తీసుకొచ్చి, ఆ నీటిని ఆయన చెవులలో పోసేశారు. ఇంక లాభం లేదనుకొని ఆ రాక్షసులు ఆయన చెవులని కొరికెయ్యడం మొదలుపెట్టారు. తరువాత పర్వతాలంత ఎత్తు, బరువు ఉన్న 1000 ఏనుగుల్ని తీసుకొచ్చి ఆయన శరీరం మీదకి ఎక్కించారు. అ ఏనుగులు తన శరీరం మీద తిరుగుతుంటే కుంభకర్ణుడికి కొంచెం తెలివొచ్చినట్టనిపించింది. ఈయన మళ్ళి కునుకులోకి వెళ్ళిపోతాడేమో అని అక్కడున్న రాక్షసులు వెంటనే భేరీలు, మృదంగాలు, శంఖాలు మ్రోగించారు. కొంతమంది పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు, కొంతమంది పెద్ద పెద్ద కర్రలతో, శూలాలతొ ఆయనని పొడుస్తున్నారు. అక్కడున్న రాక్షసులందరూ కలిసి ఒకేసారి గట్టిగా అరిచారు. అప్పుడా కుంభకర్ణుడు మెల్లగా కన్నులు తెరిచి, రెండు చేతులని కలిపి ఒళ్ళు విరుచుకొని, పెద్దగా ఆవలించాడు. ఆయన నిద్రలేస్తూనే అక్కడున్న పాత్రలలో ఉన్న మాంసాహారాన్ని అంతా తినేశాడు. ఆ పక్కన ఉన్న కల్లుని కూడా తాగేసాడు.