వాల్మీకి రామాయణం 345 వ భాగం, యుద్ధకాండ

కుంభకర్ణుడు చనిపోయాడన్న వార్త విన్న రావణుడు ఏడుస్తూ ” అయ్యయ్యో, నిద్రపోతున్నవాడిని లేపి నిష్కారణంగా యుద్ధానికి పంపాను. ఎవడు యముడిని, ఇంద్రుడిని ఓడించాడో అటువంటి నా తమ్ముడు ఇవ్వాళ రాముడి చేతిలో నిహతుడయిపోయాడు. నేను కుంభకర్ణుడిని పంపకపోయినా బాగుండేది. రాముడి ముందు నువ్వు కాదు, కుంభకర్ణుడు కాదు, మహోదర, మహాపార్ష, ప్రహస్తులు ఎవ్వరూ నిలబడలేరని నా తమ్ముడు విభీషణుడు చెప్పాడు. ధర్మాత్ముడైన విభీషణుడిని అవమానించి వెళ్ళగొట్టాను. ఇప్పుడు కుంభకర్ణుడు మరణించాడు, నా కుడి భుజం ఇవ్వాళ విరిగిపోయింది ” అని కిందపడి ఏడుస్తుంటే, రావణుడి యొక్క కుమారులు, కుంభకర్ణుడి యొక్క కుమారులు అక్కడికి వచ్చారు.

వాళ్ళన్నారు ” నాన్నగారు! మీరు అంత బాధ పడకండి. మేము యుద్ధంలోకి వెళ్ళి మీరు కోరుకున్నట్టుగా రామలక్ష్మణులని నిగ్రహించి వస్తాము ” అన్నారు.

అప్పుడు రావణుడు ” ఇప్పటికయినా నా కోరిక తీర్చండి ” అన్నాడు.

అప్పుడు యుద్ధరంగంలోకి రావణుడి కుమారుడైన నరాంతకుడు వచ్చి చాలా భయంకరమైన యుద్ధం చేశాడు. అంగదుడు తన పిడికిలిని బిగించి ఆ నరాంతకుడి తల మీద ఒక దెబ్బ కొట్టేసరికి, వాడు తల పగిలి చనిపోయాడు. తదనంతరం మహోదరుడిని నీలుడు సంహరించాడు. దేవాంతకుడిని, త్రిశిరుడిని (మూడు తలకాయలతో ఉంటాడు) హనుమంతుడు సంహరించాడు. ఉన్మత్తుడిని గవాక్షుడు సంహరించాడు.