వాల్మీకి రామాయణం 348 వ భాగం, యుద్ధకాండ

అప్పుడు రాముడు లక్ష్మణుడితో ” లక్ష్మణా! ఇవ్వాళ మనకి వేరొక దారిలేదు. వాడు బ్రహ్మగారికి చెందిన బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి కొడుతున్నాడు, ఆ బ్రహ్మాస్త్ర బంధనం చేత మొత్తం వానర సైన్యం పడిపోయింది. ఎదురుగా ఉన్న వీరుడైతే మనం కొట్టచ్చు, కాని వాడు మాయా యుద్ధం చేస్తున్నాడు, కనుక మనం వాడిని కొట్టలేము. అందుచేత వాడు కొడుతున్న బాణ పరంపరకి ఓర్చుకున్నంతసేపు ఓర్చుకో, తరువాత స్పృహతప్పినవాడు పడిపోయినట్టు రణభూమిలో పడిపో. అప్పుడు వాడు ఎన్ని బాణములు కొట్టాలో అన్ని బాణములతో మన శరీరాలని కొడతాడు. అలా కొట్టేశాక శత్రువు మరణించాడనుకొని, జయలక్ష్మిని పొందాననుకొని వాడు అంతఃపురంలోకి వెళ్ళిపోతాడు. ఆ తరువాత బతికుంటే చూద్దాము. ముందు వాడిని కొట్టెయ్యని ” అన్నాడు.  

అప్పుడు ఇంద్రజిత్ రామలక్ష్మణులిద్దరినీ బాణాలతో కొట్టేశాడు. ఇద్దరి శరీరాల నిండా బాణాలతొ కొట్టాడు, నెత్తురు వరదలై కారిపోయింది. వాడి బాణ పరంపరని తట్టుకోలేక రామలక్ష్మణులిద్దరూ భూమి మీద పడిపోయారు. అప్పుడు వాడు వికటాట్టహాసం చేసి చూసేసరికి ఆ యుద్ధ భూమిలో నిలబడి ఉన్నవాడు ఎవడూ లేడు, అందరినీ ఒక్కడే కొట్టేశాడు, మొత్తం 67 కోట్ల వానర సైన్యాన్ని ఇంద్రజిత్ ఒక్కడే కొట్టాడు. తరువాత వాడు అంతఃపురానికి వెళ్ళి రావణుడితో ” రామలక్ష్మణులిద్దరినీ బ్రహ్మాస్త్ర బంధనం చేశాను, వాళ్ళు పడిపోయి ఉన్నారు ” అని చెప్పాడు.