వాల్మీకి రామాయణం 349 వ భాగం, యుద్ధకాండ
Posted by adminDec 15
వాల్మీకి రామాయణం 349 వ భాగం, యుద్ధకాండ
ఇంద్రజిత్ బాణములు ప్రయోగించకముందే విభీషణుడు యుద్ధ భూమినుంచి పారిపోయాడు. హనుమంతుడికి ఉన్న వరం వలన ఆయనని ఏ అస్త్రము బంధించలేదు. ఆ విభీషణుడు హనుమంతుడు కలుసుకొని ” అసలు మన సైన్యంలో ఉన్న పెద్ద పెద్ద వీరులు ప్రాణాలతో ఉన్నారా, ప్రాణాలు విదిచిపెట్టేశార? ” అని ఒక కాగడా పట్టుకొని ఆ యుద్ధ భూమిలో వెతికారు.( ఇంద్రజిత్ అందరినీ కనురెప్పలు కూడా తెరవడానికి వీలులేకుండా బాణాలతో కొట్టాడు)
అలా వెతుకుతుండగా వాళ్ళకి జాంబవంతుడు కనిపించాడు, అప్పుడు విభీషణుడు ” జాంబవంత! నీకు స్పృహ ఉందా, మేము మాట్లాడుతుంది నీకు అర్ధం అవుతుందా ” అని అడిగాడు.
అప్పుడు జాంబవంతుడు మెల్లగా కనురెప్పలు పైకి ఎత్తి అన్నాడు ” నాయనా, నీ కంఠం చేత గుర్తుపట్టానయ్య, నువ్వు విభీషణుడివి కదా. హనుమంతుడు ప్రాణాలతో ఉన్నాడా? ” అని అడిగాడు.
విభీషణుడు అన్నాడు ” నువ్వు పెద్దవాడివి, వానర యోధులకందరికి కూడా నువ్వు తాతవంటి వాడివి. అటువంటి నువ్వు రామలక్ష్మణులు బతికి ఉన్నారా అని అడగకుండా హనుమంతుడు జీవించి ఉన్నాడా అని ఎందుకు అడిగారు ” అన్నాడు.
అప్పుడు జాంబవంతుడు అన్నాడు ” మొత్తం వానర సైన్యం అంతా మరణించని, హనుమంతుడు ఒక్కడు బతికుంటే మళ్ళి వీళ్ళందరూ బతుకుతారు. మొత్తం వానర సైన్యం బతికి ఉండని, హనుమంతుడు ఒక్కడు చనిపోతే అందరూ చనిపోయినట్టే. హనుమ శక్తి ఏమిటో నాకు తెలుసు, హనుమ ఉన్నాడా? ” అని అడిగాడు.
వెంటనే హనుమంతుడు జాంబవంతుడి పాదాలు పట్టుకొని ” తాత! హనుమ నీకు నమస్కరించుచున్నాడు ” అన్నాడు.