వాల్మీకి రామాయణం 354 వ భాగం, యుద్ధకాండ

తరువాత వాళ్ళు రాముడి ముఖం మీద కొన్ని నీళ్ళు పోసి ఆయనని లేపారు.

అప్పుడు లక్ష్మణుడు అన్నాడు ” అన్నయ్యా! నువ్వు ధర్మము ధర్మము ధర్మము అని ఇన్నాళ్ళు పట్టుకు తిరిగావు. ఆ ధర్మం నీకు ఏ ఫలితాన్ని ఇచ్చింది. నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల రాజ్య భ్రష్ట్రుడివి అయ్యావు, నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల తండ్రిగారు మరణించారు, నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల సీతమ్మ అపహరింపబడింది, నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల జటాయువు మరణించాడు, నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల 14 సంవత్సరాలుగా అరణ్యాలలో తిరుగుతున్నావు. ధర్మాన్ని విడిచిపెట్టిన రావణుడు అంతఃపురంలో కులుకుతున్నాడు, సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడు. అధర్మంతో ఉన్నవాడు అంత సంతోషంగా ఉన్నాడు, ధర్మంతో ఉన్న నువ్వు ఇంత కష్టంలో ఉన్నావు. ఇంకా ధర్మము ధర్మము అని ఎందుకంటావు అన్నయ్యా, ఆ ధర్మాన్ని విడిచిపెట్టు. మనం కూడా అధర్మాన్నే స్వీకరిద్దాము ” అన్నాడు.

వెంటనే విభీషణుడు పరుగు పరుగున వచ్చి ” ఎంతమాటన్నావు లక్ష్మణా, సీతమ్మని ఇంద్రజిత్ సంహరిస్తే రావణుడు ఊరుకుంటాడనుకున్నావ? ఎంతోమంది చెప్పినా సీతమ్మని విడిచిపెట్టనివాడు ఇంద్రజిత్ సీతమ్మని చంపితే ఊరుకుంటాడ. ఆ ఇంద్రజిత్ మహా మాయావి, మీరు అంతలోనే వాడి మాయ మరిచిపోయారు. వాడు మాయా సీతని సంహరించి తీసుకుపోయాడు. వాడు ఇప్పుడు ఏం చేస్తుంటాడో తెలుసా. పెద్ద ఊడలు దిగిపోయిన మర్రి చెట్టు ఒకటి ఉంది, దాని చుట్టూ చాలా చీకటిగా ఉంటుంది. వాడు అక్కడికి వెళ్ళి నికుంభిలా హోమం చేస్తాడు. అక్కడ వాడు నికుంభిలా దేవతని ఉద్దేశించి హోమాన్ని పూర్తి చేసి, వాడి గుర్రాల మీద, ఆయుధముల మీద ఆ అక్షతలని చల్లుకొని యుద్ధ రంగంలోకి వస్తే దేవేంద్రుడు కూడా వాడితో యుద్ధం చెయ్యలేడు. సీతమ్మ చనిపోయింది అనుకుని మీరు ఇక్కడ ఏడుస్తున్నారు, కాని వాడు అక్కడ హోమం చేస్తుంటాడు. రామ! నన్ను అనుగ్రహించు, నాతో లక్ష్మణుడిని తీసుకెళ్ళి ఆ హోమం పూర్తవకుండానే వాడిని సంహరిస్తాను ” అన్నాడు.

అప్పుడు రాముడు లక్ష్మణుడిని ఆశీర్వదించి, హనుమ మొదలైన వీరుల్ని సాయంగా పంపారు.