వాల్మీకి రామాయణం 359 వ భాగం, యుద్ధకాండ
Posted by adminDec 25
వాల్మీకి రామాయణం 359 వ భాగం, యుద్ధకాండ
“తన ఇంటి గుట్టుని రాముడికి చెప్పి ఇంతమంది రాక్షసుల మరణానికి కారణమైనవాడు ఆ విభీషణుడు ‘ అనుకొని, రావణుడు శక్తి అనే అస్త్రాన్ని విభీషణుడి మీదకి ప్రయోగించబోతుండగా, లక్ష్మణుడు బాణములతో ఆయన చేతిని కొట్టాడు. ఆగ్రహించిన రావణుడు ఆ శక్తిని లక్ష్మణుడి మీద ప్రయోగించాడు, అప్పుడా శక్తి లక్ష్మణుడి వక్షస్థలం నుండి దూసుకుపోయింది. వెంటనే ఆయన మూర్చపోయి కిందపడిపోయాడు. అప్పుడు హనుమంతుడు లక్ష్మణుడిని ఎత్తి తీసుకెళ్ళి రాముడి దెగ్గర పెట్టాడు.
అప్పుడు రాముడన్నాడు ” నా చేతిలోనుంచి ధనుస్సు జారిపోతోంది, మంత్రములు జ్ఞాపకానికి రావడం లేదు. ఏ దేశానికి వెళ్ళినా భార్య దొరుకుతుంది, ఏ దేశానికి వెళ్ళినా బంధువులు దొరుకుతారు, కాని తోడపుట్టినవాడు మాత్రం జీవితంలో ఒక్కసారే వస్తాడు ” అని బాధపడ్డాడు.
అప్పుడు హనుమంతుడు ” రామ! నువ్వు బెంగపెట్టుకోకు, లక్ష్మణుడిని ఎలా బతికించుకోవాలో నాకు తెలుసు ” అని మళ్ళి ఆకాశంలోకి ఎగిరి, హిమాలయ పర్వతాలని చేరుకొని అక్కడున్న ఓషధ పర్వతాన్ని తీసుకొచ్చాడు. అప్పుడు సుషేణుడు ఆ ఓషదులని లక్ష్మణుడి ముక్కులో పిండాడు, ఆ ఓషదుల వాసన తగలగానే లక్ష్మణుడు మళ్ళి పైకి లేచాడు.