వాల్మీకి రామాయణం 360 వ భాగం, యుద్ధకాండ
Posted by adminDec 26
వాల్మీకి రామాయణం 360 వ భాగం, యుద్ధకాండ
“ఇంక నేను యుద్ధం చేస్తాను ఈ రావణుడితో ” అని రాముడు ముందుకి బయలుదేరాడు. ఆ సమయంలో ఆ యుద్ధాన్ని ఆకాశంలో నుండి చూస్తున్న దేవతలు ‘ దుర్మార్గుడు, దుష్టుడు అయిన రావణుడు రథంలో ఉండి యుద్ధం చేస్తున్నాడు, మహానుభావుడైన రాముడు భూమి మీద నుండి యుద్ధం చేస్తున్నాడు ‘ అని అనుకున్నారు. అప్పుడు ఇంద్రుడు తన సారధి అయిన మాతలిని రాముడికి సహాయం చెయ్యమని చెప్పి తన రథం ఇచ్చి పంపించాడు.
అప్పుడా మాతలి రాముడితో అన్నాడు ” రామ! ఇంద్రుడు ఈ రథాన్ని పంపించాడు. దీనికి ఆకుపచ్చని గుర్రాలు కట్టి ఉంటాయి. పూర్తిగా కాల్చిన బంగారంతో ఈ రథం నిర్మింపబడినది. ఇందులో అక్షయబాణ తూణీరాలు, ఇంద్రుడు పట్టుకునే గొప్ప ధనుస్సు ఉన్నాయి. మీరు ఈ రథాన్ని ఎక్కండి, నేను మీకు సారధ్యం చేస్తాను. శ్రీ మహావిష్ణువుని గరుడుడు వహించినట్టు నేను మీకు సారధ్యం చేస్తాను. మీకు ఇవ్వమని చెప్పి ఇంద్రుడు ఈ శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చాడు, మీరు దీన్ని స్వీకరించండి ” అన్నాడు.
రాముడు ఆ రథానికి నమస్కరించి దానిలోకి ఎక్కాడు. అప్పుడు రాముడికి రావణుడికి చండప్రచండమైన యుద్ధం జెరిగింది. రాముడి బాణాల వేగాన్ని తట్టుకోలేక ఆ రావణుడు వెనక్కి వెళ్ళాడు. వాళ్ళిద్దరికీ యుద్ధం జెరుగుతుండగా ఆకాశం అంతా చీకటిగా అయిపోయింది. పగటి వేళలో వాళ్ళిద్దరి బాణ పరంపర ఆకాశాన్ని కప్పేసింది. అప్పుడు రాముడన్నాడు ” ఇంక మీరెవ్వరు యుద్ధం చెయ్యకండి, అలా నిలబడి చూడండి. రావణుడో రాముడో తేలిపోవాలి ” అన్నాడు.