వాల్మీకి రామాయణం 362 వ భాగం, యుద్ధకాండ

అప్పుడు రావణుడు ” నేను నిన్ను ఎన్ని మాటలు అన్ననురా సారధి. నువ్వు ఉత్తమ సేవకుడివి ” అని చెప్పి, తన చేతికున్న స్వర్ణ కంకణాన్ని తీసి సారధికి ఇచ్చాడు.

ఈ సమయంలోనే లంకా పట్టణంలో ఉన్న ప్రజలు ఒకరితో ఒకరు ” ఆ శూర్పణఖ జుట్టు తెల్లబడిపోయి వృద్ధురాలు అయిపోయింది, ఒళ్ళు ముడతలు పడిపోయింది, భయంకరమైన, వికృతమైన స్వరూపంతో ఉంటుంది, జారిపోయిన కడుపు ఉన్నది, కఠినమైన మాట కలిగినటువంటిది. అటువంటి శూర్పణఖ మన్మదుడితో సమానమైన ఆకృతి కలిగినవాడిని, అంత మధురముగా మాట్లాడగలిగినవాడిని, అటువంటి సౌందర్య రాశిని, చక్కటి నడువడి కలిగినవాడిని, సర్వకాలములయందు ధర్మమును అనుష్టించేవాడు అయిన రాముడిని ఏ ముఖం పెట్టుకొని కామించింది? రాముడిని పొందాలన్న కోరిక ఎలా కలిగింది? ఆ రాముడు వైముఖ్యాన్ని ప్రదర్శిస్తే, కడుపులో కక్ష పెంచుకుని సీతాపహరణానికి దారితీసేటట్టుగా రావణుడి మనస్సు వ్యగ్రత పొందేటట్టుగా ఎలా మాట్లడగలిగింది?  రావణుడు ఎంత మూర్ఖుడు, రాముడు అరణ్యంలో 14,000 మంది రాక్షసులని, ఖర-దూషణులని సంహరించాడు. అలాంటివాడితో సంధి చేసుకుందాము అన్న ఆలోచన లేకుండా శూర్పణఖ మాటలు విని సీతని అపహరించడానికి వెళ్ళాడు.

పోని అప్పటికి రాముడు అంత పరాక్రమము ఉన్నవాడని రావణుడు తెలుసుకోలేకపోయాడు అని అనుకుందాము. కాని రాజ్యభ్రష్టుడై అన్నగారి చేత తరమబడి, ఋష్యమూక పర్వత శిఖరముల మీద కూర్చున్న సుగ్రీవుడిని రక్షించడం కోసమని ఆయనతో స్నేహాన్ని చేసుకొని, వాలిని ఒక్క బాణంతో సంహరించి, చేసుకున్న స్నేహానికి, ఒప్పందానికి నిలబడి సుగ్రీవుడిని రాజ్యమునందు ప్రతిష్టించినప్పుడైనా రావణుడి కళ్ళుతెరుచుకోలేదా.