వాల్మీకి రామాయణం 363 వ భాగం, యుద్ధకాండ
Posted by adminDec 29
వాల్మీకి రామాయణం 363 వ భాగం, యుద్ధకాండ
పోని అప్పుడు కూడా తెలుసుకోలేకపోయాడు అని అనుకుందాము. కాని విభీషణుడు ధర్మబద్ధమైన మాట చెప్పాడు ‘ అన్నయ్యా, నువ్వు రాముడిని నిగ్రహించలేవు, లంక అంతా నాశనమయిపోతుంది. నువ్వు చేసినది పాపపు నడువడితో కూడిన పని. నా మాట విని సీతమ్మని తీసుకెళ్ళి రాముడికి ఇచెయ్యి ‘ అని చెప్పాడు. విభీషణుడి మాటలు కాని రావణుడు విని ఉంటె ఇవ్వాళ లంకా పట్టణానికి ఇంతటి చేటుకాలం దాపురించేది కాదు. తోడపుట్టినవాడైన కుంభకర్ణుడు రాముడి చేతిలో చనిపోయాడు, తన కుమారులైన నరాంతకుడు, అతికాయుడు మొదలైన వారందరూ మరణించారు, మహోదర, మహాపార్షులు మొదలైనవారు మరణించారు, ఆఖరికి ఇంద్రజిత్ కూడా లక్ష్మణుడి చేతిలో మరణించాడు. ఇంతమంది చనిపోయాక కూడా వచ్చినవాడు సామాన్య నరుడు కాదన్న ఆలోచన రావణుడికి రావట్లేదే?
ఒకానొకసారి దేవతలందరూ కూడా రావణుడు చేస్తున్న ఆగడములను భరించలేక అందరూ కలిసి బ్రహ్మగారి దెగ్గరికి వెళ్ళి ‘ అయ్యా! రావణుడు చేస్తున్న ఆగడాలు మేము భరించలేకపోతున్నాము, నరవానరముల చేతిలో తప్ప వాడికి ఎవరి చేతిలో చావు లేదు. ఇవ్వాళ వాడి ముందుకెళ్ళి నిలబడగలిగే ధైర్యం ఎవరికీ లేదు. సముద్రం కూడా కెరటాలతో వాడి ముందు నిలబడడానికి భయపడుతుంది, సూర్యుడు గట్టిగా ప్రకాశించడం లేదు, అలా దిక్పాలకులని కూడా శాసించగలిగే స్థితిలో ఉన్నాడు. వాడి చేతిలో లోకములన్నీ పీడింపబడుతున్నాయి, మేము ఎలా జీవించాలి ‘ అని అడిగారు. అప్పుడు బ్రహ్మగారు ‘ నేను ఇవ్వాల్టి నుంచి ఒక కట్టుబాటు చేస్తున్నాను. ఈ రాక్షసులు మూడు లోకములలోనూ తిరుగుతూ ఉంటారు, ఒక చోట ఉండరు, దానివల్ల మీకు కొంత ఉపశాంతి కలుగుతుంది ‘ అని అన్నారు.
దానివల్ల ఆ దేవతలు పూర్తి ఉపశాంతిని పొందకపోవడం చేత శివుడి కోసం తపస్సు చేశారు. త్రిపురములను తన కంటి మంట చేత నశింపచేసినవాడైన పరమశివుడు ఆ దేవతలయందు ప్రీతి చెంది, వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యి ‘ ఇంత తపస్సు కలిగిన రావణుడు మరణించడానికి కావలసిన విధంగా, సీత అన్న పేరుతో అమ్మవారు ఉదయించబోతోంది ‘ అని ఆరోజున శివుడు దేవతలకి వరం ఇచ్చాడు. అందుచేత రావణుడు అపహరించి తీసుకొచ్చిన ఆ మైథిలి సాక్షాత్తుగా రావణుడి ప్రాణములను తీసుకోడానికి, ఈ లంకా పట్టణాన్ని సర్వనాశనం చెయ్యడానికి, రాక్షసులందరినీ పరిమార్చడానికి కాళ రాత్రిలా వచ్చింది. ఈ విషయాన్ని రావణుడు తెలుసుకోలేక రాముడి మీదకి యుద్ధానికి వెళుతున్నాడు ” అని ఆ లంకా పట్టణంలోని ప్రజలు చెప్పుకుంటున్నారు.