వాల్మీకి రామాయణం 366 వ భాగం, యుద్ధకాండ

రావణుడు యుద్ధ భూమిలోకి వచ్చి నిలబడుతున్న సమయంలో ఆకాశం నుండి రక్త వర్షం కురిసింది, అదే సమయంలో మండలాకారంలో గాలులు తిరిగాయి, ఆకాశంలో గ్రద్దలు తిరుగుతూ వచ్చి ఆయన ధ్వజం మీద వాలాయి, నిష్కారణంగా అక్కడున్న భూమి కదిలింది, ఆకాశంలో మేఘాలు లేకుండానే రాక్షస సైన్యం వైపు పిడుగులు పడ్డాయి, ఆకాశం నుండి ఒక తోకచుక్క రావణుడి రథం మీద పడింది, రాక్షసులు తమ ఆయుధములను ప్రయోగిద్దామని చేతులు పైకి ఎత్తుతుంటే ఎవరో వచ్చి పట్టుకున్నట్టు చేతులు ఆగిపోయాయి, లంకా పట్టణం అంతా కాలిపోతున్నట్టు ఎర్రటి కాంతిని పొందింది, ఇళ్ళల్లో ఉన్న గోరువంకల మీద రాబందులు వచ్చి దాడి చేశాయి, సూర్యమండలం నుంచి ఎర్రటి, తెల్లటి, పసుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన కిరణాలు రావణుడి మీద పడ్డాయి, నిష్కారణంగా గుర్రాలు ఏడిచాయి, నక్కలు పెద్ద పెద్ద కూతలు కూశాయి, క్రూరమైన మృగాలు రావణుడి ముఖాన్ని చూస్తూ పెద్దగా అరిచాయి.

రామ-రావణ యుద్ధం ప్రారంభం అవ్వగానే అప్పటిదాకా కొట్టుకున్న వానరులు, రాక్షసులు ఒకరి పక్కన ఒకరు నిలబడి అలా చూస్తుండిపోయారు. రాముడు, రావణుడు ప్రయోగించిన బాణాలకి ఆకాశం అంతా చీకటి అయిపోయి, ఆకాశంలో గుద్దుకుంటున్న బాణముల మెరుపులే కనపడుతున్నాయి. అప్పుడు రావణుడు కొన్ని బాణములని రాముడి రథం యొక్క ధ్వజం మీదకి ప్రయోగించాడు. ఆ రథం యొక్క శక్తి చేత రావణుడు వేసిన బాణములు నిర్వీర్యం అయిపోయాయి. తరువాత రాముడు వేసిన బాణములకి రావణుడి ధ్వజం విరిగిపోయి నేలమీద పడిపోయింది. ఆ తరువాత రావణుడు బాణములతో రాముడి రథాన్ని లాగుతున్న గుర్రాలని కొట్టాడు. కాని ఆ గుర్రాలు రావణుడి బాణాలు తగిలినా కనీసం కదలను కూడా కదలలేదు. రావణుడు వేస్తున్న మాయతో కూడిన బాణముల నుంచి కొన్ని వేల రోకళ్ళు, పర్వతములు, వృక్షాలు, రోళ్ళు, చిత్ర విచిత్రమైనవన్నీ పుట్టి రాముడి రథం మీద పడిపోతున్నాయి. రావణుడి అన్ని బాణములకు సమాధానంగా రాముడు బాణ ప్రయోగం చేసి రావణుడి సారధిని, గుర్రాలని, ధ్వజాన్ని కొట్టాడు.