వాల్మీకి రామాయణం 369 వ భాగం, యుద్ధకాండ

రాముడు ఆ బాణాన్ని చేతితో పట్టుకుని దానిమీద వేదప్రోక్తంగా బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించాడు. ఆయనలా బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించేసరికి భూమి అంతా కంపించింది. అప్పుడాయన ఆ బాణాన్ని వింటినారికి తగిలించి, చెవి వరకూ లాగి, పరమాత్మని స్తోత్రం చేస్తూ, శత్రువు నిగ్రహింపబడాలని కోరుకుంటూ విడిచిపెట్టాడు. ఆ బాణం ఒక్క క్షణంలో భయంకరమైన ధ్వనిని చేస్తూ, లోకాలన్నిటినీ క్షోభింప చేస్తూ, ఇంతకాలం ఏ రావణుడు లోకములన్నిటినీ పీడించాడొ, ఆ రావణుడి గుండెల్ని బద్దలు చేస్తూ ఆయన వక్షస్థలం నుండి దూసుకు వెళ్ళింది.

రావణుడి చేతిలో ఉన్న ధనుస్సు, ఆయుధములు కింద పడిపోయాయి, ప్రాణాలు విడిచిపెట్టేసి ఆ శరీరంతో కింద పడిపోయాడు.

రావణాసురుడు మరణించాడు.

రావణుడు మరణించగానే ఆకాశంలో దేవదుందుభిలు మ్రోగాయి. వెంటనే సుగ్రీవుడు, లక్ష్మణుడు, అంగదుడు, ఋషభుడు, వేగదర్శి, నీలుడు, సుషేణుడు, గందమాధనుడు, మైందుడు, జాంబవంతుడు, కొన్ని కోట్ల వానరములు అందరూ పరమానందంతో రాముడి దెగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అందరూ రాముడి పాదాల మీద పడిపోయి, ఆనందంతో పూజలు చేసి, ” రామ రామ ” అంటూ ఆయన ఒళ్ళు ముట్టుకుని పరవశించిపోయారు. హనుమంతుడు ఆనందంతో నాట్యం చేశాడు.

రావణుడు రథం మీద నుంచి కింద పడిపోయేసరికి అక్కడున్న రాక్షసులు పరుగులు తీశారు. వానరాలన్నీ కనపడ్డ రాక్షసుడిని వెంట తరిమి సంహరించారు.