వాల్మీకి రామాయణం 372 వ భాగం, యుద్ధకాండ

రాముడిని చూడగానే మండోదరి అనింది ” ఈయన మనుష్యుడు కాదు, సనాతనమైన పరమాత్మ. నిన్ను నిగ్రహించడానికి వచ్చిన శ్రీ మహావిష్ణువు. దేవతలందరినీ వానర రూపాలు ధరింప చేసి, వాళ్ళని వెంట బెట్టుకుని, శంఖ చక్ర గదా పద్మములను పట్టుకున్న శ్రీ మహావిష్ణువు వచ్చాడు. రాముడిని ఇన్ని సార్లు చూసినా నీకు వచ్చింది విష్ణువు అని ఎందుకు అర్ధం కాలేదు రావణా!. నువ్వు రాముడి చేత సంహరింపబడ్డావని లోకం అనుకుంటుంది, నువ్వు ఎందువల్ల చనిపోయావో నాకు తెలుసు. ఒకప్పుడు నువ్వు తపస్సు చెయ్యాలనుకొని నీ ఇంద్రియాలని బలవంతంగా తొక్కి పెట్టావు. అప్పుడు నీ ఇంద్రియాలు నీ మీద పగబట్టాయి. అందుకని నిన్ను చంపింది రాముడు కాదు, నీ ఇంద్రియాలే నిన్ను చంపాయి.

ఒక్కసారి కామం పుట్టింది అనడానికి నీ విషయంలో ఆస్కారం లేదు. మహా సౌందర్యరాసులైన భార్యలు నీకు కొన్ని వేల మంది ఉన్నారు, వారితో నువ్వు ఎవరితో క్రీడించినా నీ కామము అదుపులో ఉంటుంది. ఎక్కడో అరణ్యంలో ఉన్న సీతమ్మయందు కామం పుట్టి ఆవిడని నువ్వు అనుభవించడం కాదు, నువ్వు, నీ రాజ్యము, నీ వారు భ్రష్టమవ్వడం కోసం నీకు ఆ కోరిక పుట్టింది. దుర్మతి! నీకు సీతమ్మ ఎవరో అర్ధం కాలేదు, ఆవిడ రోహిణి కన్నా, అరుంధతి కన్నా గొప్పది. తన భర్తని అనుగమించి వచ్చిన ఇల్లాలిని ఒంటరిగా ఉన్నప్పుడు ఎత్తుకొచ్చావు, ఆ తల్లి తేజస్సు నిన్ను కాల్చింది. నీకు ఎన్నోసార్లు చెప్పాను, ఆ తల్లిని తేవడం వల్ల నువ్వు పొందే సుఖం ఏమి లేదు, నాశనం అయిపోతావని చెప్పాను. నువ్వు చేసుకున్న పూర్వ పుణ్యముల వల్ల కాంచన లంకని అనుభవించావు, ఎన్నో సుఖాలు పొందావు, కాని సీతమ్మని తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం వల్ల ఆ పాపాన్ని అనుభవించాల్సి వచ్చి ఈనాడు పడిపోయావు. విభీషణుడు పుణ్యాలు చేశాడు, సీతమ్మ ఎవరో తెలుసుకున్నాడు, ఆ పుణ్య ఫలం ఇవ్వాళ విభీషణుడికి అనుభవంలోకి వచ్చింది, బతికిపోయాడు.