వాల్మీకి రామాయణం 373 వ భాగం, యుద్ధకాండ

రావణా! సీత నాకన్నా గొప్ప కులంలో పుట్టిందా, నాకన్నా గొప్ప రూపవతా,  నాకన్నా గొప్ప దాక్షిణ్యం ఉన్నదా, సీత నాకన్నా ఎందులో గొప్పది? కాని నీ దురదృష్టం, నాకన్నా సీత నీకు గొప్పదిలా కనపడింది. నా తండ్రి దానవ రాజైన మయుడు, నా భర్త లోకములను గెలిచిన రావణుడు, నా కుమారుడు ఇంద్రుడిని జయించిన మేఘనాధుడు, నేనున్నది కాంచన లంకలో అని అహంకరించాను, కాని ఇది నిలబడలేదు, అబద్ధమయిపోయింది. ఇవ్వాళ నాకు కొడుకు లేడు, భర్త లేడు, రాజ్యం లేదు, బంధువులు లేరు, నీకు తలకొరివి పెట్టడానికి ఒక్క కొడుకూ లేడు. నువ్వు మహాపాతకం చెయ్యడం వల్ల 10 రోజులలో నా పరిస్తితి ఇలా అయిపోయింది. మహా పతివ్రత అయిన స్త్రీ ఏ ఇంటికన్నా వచ్చి కన్నీరు పెడితే, ఆ కన్నీరు కిందపడితే, ఆ ఇల్లు నాశనమయిపోతుంది ” అని బాధపడింది. ( ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, పతివ్రత అయిన వేరొకడి భార్య నేను చేసిన పని వల్ల ఏడవడం కాదు, నా భార్య నేను చేసిన పని వల్ల ఏడిచినా, ఆ పాపం వల్ల నేను నశించిపోతాను)

అప్పుడు రాముడు ” ఆవిడ చాలా శోకించింది, ఆవిడని లోపలికి తీసుకువెళ్ళండి. రావణుడి కొడుకులందరూ చనిపోయారు కనుక, ఈ శరీరానికి చెయ్యవలసిన కార్యాన్ని విభీషణ నువ్వు చెయ్యి ” అన్నాడు.

అప్పుడు విభీషణుడు ” రామ! మీరు ఏమైనా చెప్పండి, వీడు బతికున్నంత కాలం వీడి జీవితంలో ధర్మం అన్న మాటే లేదు, బతికున్నంత కాలం పర స్త్రీల వెంట తిరిగాడు, ఇటువంటి వాడికి అంచేష్టి సంస్కారం ఏమిటి? ఆ శరీరాన్ని అలా వదిలేద్దాము ” అన్నాడు.

అప్పుడు రాముడు ” విభీషణ! అవతలివాడు ఏ శరీరంతో ఇన్ని పాపాలు చేశాడో ఆ పాపాలన్నీ ఆ శరీరంతోనె వెళ్ళిపోయాయి. అందుకని ఇంక వైరం పెట్టుకోకూడదు. ఆ శరీరానికి సంస్కారం చెయ్యకపోతే వాడు ఉత్తమ గతులకి వెళ్ళడు. ఒకవేళ నువ్వు ‘ చెయ్యను ‘ అంటె, నువ్వు నాకు స్నేహితుడివి కదా, స్నేహితుడి అన్నయ్య నాకూ అన్నయ్యే కదా, నువ్వు చెయ్యకపోతే ఆయనని అన్నగారిగా భావించి నేను సంస్కారం చేస్తాను ” అన్నాడు.

అప్పుడు విభీషణుడు రావణుడికి అంచేష్టి సంస్కారం చేశాడు. ఆ తరువాత ఆకాశంలో ఉన్న దేవతలందరూ మెల్లగా ఒకరి తరువాత ఒకరు వెళ్ళిపోయారు.