వాల్మీకి రామాయణం 379 వ భాగం, యుద్ధకాండ
Posted by adminJan 14
వాల్మీకి రామాయణం 379 వ భాగం, యుద్ధకాండ
అప్పుడు రాముడు ” శత్రువుని జయించాను, నిన్ను పొందాను. ఏ దైవము యొక్క అనుగ్రహము లేకపోవడము చేత, ఏ దైవము యొక్క శాసనము చేత నువ్వు అపహరింపబడ్డావో దానిని పురుష ప్రయత్నం చేత దిద్దాను. రావణుడిని సంహరించి నిన్ను తెచ్చుకున్నాను. అపారమైన పౌరుషము, పరాక్రమము ఉన్నవాడికి ఏదన్నా అపవాదు వస్తే, వాడు తన ప్రయత్నంతో ఆ అపవాదుని తుడిచిపెట్టుకోకపోతే, వాడు చేతకానివాడు అని ప్రపంచం అంటుంది. అందుకని నా ప్రయత్నంతో వచ్చిన అపవాదుని తుడిచిపెట్టడానికి, రాముడి భార్యని రావణుడు అపహరిస్తే, రావణుడిని రాముడు ఏమి చెయ్యలేదు అని అనకుండా ఉండడం కోసం రావణుడిని సంహరించాను. 100 యోజనముల సముద్రాన్ని గడిచి లంకా పట్టణాన్ని చేరి, హనుమ చేసిన ఈ లంకా భీభత్సం అంతా నేటితో సార్ధక్యాన్ని పొందింది. నేను ఇదంతా కష్టపడి చేసింది నా పేరు ప్రఖ్యాతులు నిలబెట్టుకోడానికి. ఇక్ష్వాకు వంశంలో జన్మించాను కాబట్టి, రాముడు చేతకానివాడు అన్న అపవాదు నా మీద పడకూడదు కాబట్టి ఇదంతా చేశాను. రాముడు సీతని తిరిగి తెచ్చుకోలేకపోయాడు అన్న కళంకం మా వంశంలో ఉండిపోకూడదు, అందుకని నిన్ను గెలిచి తెచ్చుకున్నాను.
సీత! ఇవ్వాళ నీ చారిత్రము శంకింపబడింది. నువ్వు చాలాకాలం రాక్షసుని గృహంలో ఉన్నావు. నువ్వు అలా ఉన్న కారణం చేత నిన్ను చూస్తున్నప్పుడు నాకు ఎలా ఉందో తెలుసా, కంటియందు జబ్బు ఉన్నవాడు దీపాన్ని ఎలా చూడలేడో, అలా నేను నీ వంక చూడలేకపోతున్నాను. నీకు తెలుసు నాకు తెలుసు, నువ్వు అపార సౌందర్యరాశివి, నిన్ను చూసినవాడు చపలచిత్తుడైతే వెంటనే నీ యందు మనస్సు పెట్టుకుంటాడు. పరమ చపలచిత్తుడైన రావణుడు నిన్ను చూడకూడని చూపు చూశాడు, బలవంతంగా నీ జుట్టు పట్టి ఈడ్చాడు, తన తొడ మీద కుర్చోపెట్టుకున్నాడు, గుండెల మీద వేసుకున్నాడు, అశోకవనంలో పెట్టాడు, 10 నెలలు నిన్ను చూశాడు. నువ్వూ మహా అందగత్తెవి, వయస్సులో ఉన్నదానివి. అటువంటి నువ్వు ఖచ్చితమైన నడువడితో ఉన్నావని నేను ఎలా నమ్మను. అందుకని ఇప్పుడు నీ ఇష్టం, నీకు ఎవరు నచ్చితే వాళ్ళతో వెళ్ళిపో. లక్ష్మణుడితో కాని, భరతుడితో కాని, విభీషణుడితో కాని, సుగ్రీవుడితో కాని నువ్వు వెళ్ళిపోవచ్చు, వీళ్ళు కాదు ఈ పది దిక్కులలో నీకు ఎవరు నచ్చినా వాళ్ళతో వెళ్ళిపోవచ్చు. నేను నీకు అనుమతి ఇస్తున్నాను, నువ్వు వెళ్ళిపోవచ్చు. నీతో నాకు మాత్రం ఏవిధమైన అవసరం లేదు ” అన్నాడు.