వాల్మీకి రామాయణం 381 వ భాగం, యుద్ధకాండ

అప్పుడు సీతమ్మ ” నా మనస్సు రాముడియందే ఉన్నదైతే, సర్వకాలములయందు రాముడిని ధ్యానము చేసిన దాననైతే, పృధ్వీ, ఆకాశము, అష్ట దిక్పాలకులు, అంతరాత్మ, అగ్ని సాక్షిగా ఉండి, ఒక్క క్షణం కూడా నా మనస్సు రాముడిని విడిచిపెట్టనిది నిజమే అయితే ఈ అగ్నిహోత్రుడు నన్ను రక్షించుగాక ” అని చెప్పి అగ్నిలో దూకింది.

అలా సీతమ్మ అగ్నిలో దూకగానే బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, దేవతలు మొదలైనవారందరూ అక్కడికి వచ్చారు. వాళ్ళకి నమస్కారం చేస్తున్న రాముడిని చూసి వాళ్ళు అన్నారు ” అదేమిటయ్యా రామ అంత పని చేశావు. నువ్వు సాక్షాత్తుగా శ్రీ మహా విష్ణువువి. నువ్వు లోకములను సృష్టించగలిగినవాడివి, లయం చెయ్యగలిగినవాడివి, పరబ్రహ్మానివి. సీతమ్మని అగ్నిలో ప్రవేశించమని ఎలా చెప్పగలిగావయ్య ” అన్నారు.

అప్పుడు రాముడు ” మీరందరూ నేను చాలా గొప్పవాడిని అని అంటున్నారు, నేను పరబ్రహ్మాన్ని అంటున్నారు, కాని నేను అలా అనుకోవడం లేదు. నేను దశరథ మహారాజు యొక్క కుమారుడిని, రాముడిని, నరుడిని అని అనుకుంటున్నాను. నేను యదార్ధముగా ఎవరినో మీరు చెప్పండి ” అన్నాడు.

అప్పుడు బ్రహ్మ ” సృష్టికి ముందు ఉన్నవాడివి నువ్వు, స్థితికారుడివి నువ్వు, లయకారుడివి నువ్వు, వరాహమూర్తివి నువ్వు, భూమిని ఉద్ధరించినవాడివి నువ్వు, ఆరోగ్యం నువ్వు, కోపం నువ్వు, రాత్రి నువ్వు, నీ రోమకూపాల్లో దేవతలు ఉంటారు, సమస్తము నీయందే ఉంది, అంత్యమునందు ఉండిపోయేవాడివి నువ్వు, నువ్వు కన్ను ముస్తే రాత్రి, కన్ను తెరిస్తే పగలు ” అని రాముడిని స్తోత్రం చేశారు.