వాల్మీకి రామాయణం 383 వ భాగం, యుద్ధకాండ

దేవతలందరితో పాటుగా అక్కడికి వచ్చిన శివుడు అన్నాడు ” నాయన రామ! నీ తమ్ముడైన భరతుడు అయోధ్యలో దీనంగా ఉన్నాడు, ఆయనని ఓదార్చు. నీ తల్లి అయిన కౌసల్యని ఊరడించు. కైకేయి, సుమిత్రలకి నమస్కరించు. లక్ష్మణుడిని ఊరడించు. ఇక్ష్వాకు వంశీయులు ఇంతకాలం నుంచి పరంపరాగతంగా పరిపాలిస్తున్న రాజ్యాన్ని నువ్వు పరిపాలించి, నీవారిని సంతోషపెట్టు. ఏ వంశంలో నువ్వు జన్మించావో ఆ వంశాన్ని పెంచు. యాగాలు చెయ్యి, బ్రాహ్మణులకు భూరి దానాలు చేసి పరమ సంతృప్తిని పొందు. తదనంతరం స్వర్గానికి చేరుకుందువుగాని. అదిగో, ఆ విమానంలో మీ తండ్రిగారైన దశరథ మహారాజు ఉన్నారు, వెళ్ళి చూడు ” అన్నాడు.

తండ్రిని చూడగానే లక్ష్మణుడితో కలిసి రాముడు నమస్కారం చేశాడు. అప్పుడు దశరథుడు రాముడిని ఒకసారి ఆనందంతో గట్టిగా కౌగలించుకొని తన తొడ మీద కూర్చోబెట్టుకుని ” రామ! నేను స్వర్గలోకంలో విహరించానురా, ఇంద్రలోకంలో తిరిగానురా, కాని నువ్వు లేకపోతె అది కూడా నాకు పెద్ద సుఖంగా అనిపించలేదురా. ఆనాడు నీకు పట్టాభిషేకాన్ని చేద్దాము అనుకోవడం, నేను ఎంతో ఆనందాన్ని పొందడం, రాత్రి కైక దెగ్గరికి వెళ్ళడం, కైక వరాలు కోరడం, నీ పట్టాభిషేకం భగ్నం అవ్వడం, ఆనాడు నేను ఏడ్చి ఏడ్చి నా శరీరాన్ని వదిలిపెట్టడం నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. నేను ఇప్పుడు తెలుసుకున్నదేంటంటే, ఆ పట్టాభిషేకం భగ్నం అవ్వడానికి కారణం దేవతలు. రావణ సంహారం జెరగాలి కనుక దేవతలు ఆనాడు నీ పట్టాభిషేకాన్ని భగ్నం చేశారు ” అన్నాడు.