వాల్మీకి రామాయణం 392 వ భాగం, యుద్ధకాండ

శత్రుఘ్నుడు అక్కడికి వచ్చి ” అన్నయ్య! క్షుర కర్మ చేసేవారిని తీసుకొచ్చాను, నీ జుట్టు జటలు పట్టేసింది కదా అందుకని క్షుర కర్మ చేయించుకో ” అన్నాడు.

అప్పుడు రాముడు ” నేను తండ్రిమాట నిలబెట్టడం కోసమని నా అంత నేనుగా అరణ్యవాసానికి వెళ్ళాను. కాని, తండ్రి ఆజ్ఞాపించకపోయినా, నాయందున్న ప్రేమ చేత స్వచ్ఛందంగా తనంత తాను దీక్ష స్వీకరించి, నా పాదుకలని తీసుకెళ్ళి సింహాసనంలో పెట్టి, 14 సంవత్సరములు రాజ్యమునందు మమకారము లేకుండా పరిపాలించిన భరతుడు ముందు దీక్ష విరమించి స్నానం చేస్తే తప్ప నేను దీక్షని విరమించను ” అన్నాడు.

భరతుడు, శత్రుఘ్నుడు, సుగ్రీవుడు, విభీషణుడు క్షుర కర్మ చేయించుకుని మంగళస్నానం చేశాక రాముడు క్షుర కర్మ చేయించుకుని మంగళ స్నానం చేశాడు. తరువాత రాముడు అందమైన పట్టుపుట్టములను ధరించి, మంచి అంగరాగములను పూసుకొని, దివ్యాభరణములను ధరించి బయటకి వచ్చాడు.

తన కొడుకు ఇన్నాళ్ళకి తిరిగొచ్చాడని పొంగిపోయిన కౌసల్యా దేవి సీతమ్మకి అభ్యంగన స్నానం చేయించి, మంచి పట్టుపుట్టం కట్టి చక్కగా అలంకరించింది. కౌసల్య, సుమిత్ర, కైకేయల చేత అలంకరింపబడ్డ వానర కాంతలు 9000 ఏనుగుల్ని ఎక్కారు. దశరథుడు ఎక్కే శత్రుంజయం అనే ఏనుగుని తీసుకొచ్చి దానిమీద సుగ్రీవుడిని ఎక్కించారు. వానరులందరూ కూడా సంతోషంగా అయోధ్యకి బయలుదేరారు. సూర్యమండల సన్నిభమైన రథాన్ని రాముడు ఎక్కాడు, ఆ రథం యొక్క పగ్గములను భరతుడు పట్టుకొని నడిపించాడు. లక్ష్మణుడు నూరు తీగలు కలిగిన తెల్లటి గొడుగుని పట్టాడు. ఒకపక్క శత్రుఘ్నుడు మరొకపక్క విభీషణుడు వింద్యామర వేస్తున్నారు. అలా రథంలో అయోధ్యకి వెళుతున్న రాముడు కనపడ్డ వాళ్ళందరినీ పలకరించుకుంటూ వెళ్ళాడు.