వాల్మీకి రామాయణం 56 వ భాగం, అయోధ్య కాండ
Posted by adminFeb 25
వాల్మీకి రామాయణం 56 వ భాగం, అయోధ్య కాండ
అప్పుడు కౌసల్య తెల్లటి ఆవాలు, పెరుగు, తెల్లటి పూలతో ఉన్న దండలు తెప్పించి వేదం బాగా చదువుకున్నటువంటి ఆచార్యుడిని పిలిచి, హోమం చేయించి, ఆ అక్షతలని రాముడి శిరస్సు మీద ఉంచి ” నాయనా, నిన్ను సూర్యుడు, చంద్రుడు, అశ్విని దేవతలు, భూమి, ఆకాశం, నీరు, అగ్ని, వాయువు, దిక్కులు, గృహదేవతలు, రాక్షసులు, విషక్రిములు, చెట్లు, నదులు, ఋతువులు, నక్షత్రములు అన్నీ నిను రక్షించాలి. ఆ వృత్తాసురిడిని చంపినప్పుడు దేవేంద్రుడికి ఎటువంటి మంగళం జెరిగిందో, నీకు అటువంటి మంగళం జెరుగుగాక, గరుగ్మంతుడు అమృతాన్ని అపహరించి తెచ్చినప్పుడు ఎటువంటి మంగళం జెరిగిందో, నీకు అటువంటి మంగళం జెరుగుగాక, క్షీరసాగర మధనంలో రాక్షసులని సంహరించిన ఇంద్రుడికి అదితి నుంచి ఎటువంటి మంగళం లభించిందో, నీకు అటువంటి మంగళం కలుగుగాక, పాదముల చేత ఈ లోకములనన్నిటిని కొలిచిన ఆ త్రివిక్రమావతారానికి ఎటువంటి మంగళం లభించిందో, అటువంటి మంగళం నీకు లభించుగాక ” అని ఆశీర్వదించింది.
కౌసల్య దెగ్గర ఆశీసులు తీసుకున్నాక రాముడు సీతమ్మ దెగ్గరికి బయలుదేరాడు. తన తల్లి దెగ్గర ఎంత గంభీరంగా ఉన్నా, సీతమ్మ దెగ్గరికి వచ్చేసరికి రాముడి ముఖం వివర్ణం అయిపోయింది. సీతమ్మ రాముడికి ఎదురుగా వచ్చి ” ఎప్పుడూ కాంతితో మెరిసిపోయే మీ ముఖం ఏదో ఒక నల్లటి రంగుతో కూడి ఉంది. ఏదో తప్పు చేసినవారిలా మీ కనురెప్పలు కిందకి వంగి ఉన్నాయి, నూరు ఊచలు కలిగిన తెల్లటి గొడుగుని మీకు పట్టాలి కదా, మీకు ఎదురుగా భద్రగజం నడవాలి కదా, మీ వెనకాల చతురంగ బలాలు నడిచి రావాలి కదా, ఇవన్నీ ఎందుకు జెరగలేదు ” అని రాముడిని అడిగింది.
అప్పుడు రాముడు తలదించుకొని ” సీత! మా తండ్రిగారిని కైకేయ రాత్రి రెండు వరాలు అడిగింది. పధ్నాలుగు సంవత్సరాలు నన్ను అరణ్యవాసం చెయ్యమని అడిగింది. సత్యమునకు ధర్మమునకు బద్ధుడైన నా తండ్రి నన్ను అరణ్యవాసం చెయ్యమని శాసించారు. అందుకని నేను అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాను. అలాగే భరతుడికి పట్టాభిషేకం చెయ్యమని అడిగింది. భరతుడికి పట్టాభిషేకం చేశాక, భరతుడు ఈ రాజ్యానికి రాజు అవుతాడు. నేను వదినని అవుతాను కదా అని గబుక్కున చొరవగా మాట్లాడతావేమో, ఇప్పుడు నువ్వు భరతుడి చేత రక్షింపబడుతున్న స్త్రీవి, అందుకని అంత చొరవగా మాట్లాడమాకు. ఆయనని ప్రభువుగా గౌరవించడం నేర్చుకో, నా తల్లి అయిన కౌసల్యకి సపర్య చెయ్యి. కౌసల్య, సుమిత్ర, కైకేయ మరియు దశరథుడి ఇతర భార్యలని సేవించు. నేను వెళ్ళిపోయాక మా అమ్మ అన్నం తినకుండా ఏడుస్తూ ఉంటుంది, కావున మా అమ్మ కన్నీరు తుడిచి, మంచి మాటలు చెప్పి ఆమెని సేవించు ” అని అన్నాడు.