వాల్మీకి రామాయణం 57 వ భాగం, అయోధ్య కాండ

అప్పుడు సీతమ్మ ” మీరు చెప్పినవన్నీ నాకు బాగానే వినబడ్డాయి కాని ఒకమాటే అర్థం కాలేదు, నువ్వు ఉండు నేను వెళతాను అన్నట్టు మాట్లాడుతున్నారేంటి, మనం వెళతాము అని అనాలి కదా మీరు. మీరు మీ నాన్నగారిని ధర్మమునందు నిలబెట్టడానికి వెళతాను అంటున్నారు కదా, నాకు కూడా ఒక ధర్మం తెలుసు, చెప్తాను వినండి…….
ఒకే ఇంట్లో తల్లి, తండ్రి, కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు, అల్లుళ్ళు ఉంటారు. ఇంటి యజమాని తీసుకొచ్చిన భాగ్యాన్ని మిగిలినవారందరూ పంచుకుంటారు. కాని, భర్తతో సుఖం కాని, కష్టం కాని పంచుకోడానికి అన్నికాలములయందు భర్త కన్నా వేరుగా చూడబడలేని రీతిలో ఉన్నది భార్య ఒక్కత్తే. అందుకని నేను కూడా మీతో పాటు అరణ్యాలకి వచ్చేస్తాను.

న పితా న ఆత్మజో న ఆత్మా న మాతా న సఖీ జనః |
ఇహ ప్రేత్య చ నారీణాం పతిర్ ఏకో గతిః సదా ||
తల్లి కాని, తండ్రి కాని, అన్నదమ్ములు కాని, అక్కచెల్లెళ్ళు కాని, కడుపున పుట్టిన బిడ్డలు కాని, రాజ్యం కాని, సంపద కాని, ఇవి ఏవి స్త్రీకి గతి కావు. సుఖమైనా కష్టమైనా స్త్రీ పొందవలసిన గమ్య స్థానము భర్త. నీతో పాటు వచ్చేసిన తరువాత, అక్కడ హంసలు మొదలైన పక్షులు స్నానం చేస్తూ ఆడుకునేటటువంటి సరోవరాలలో స్నానం చేస్తూ నీతో పాటు క్రీడించడంలో ఇష్టాన్ని పొందుతాను, నీతో కలిసి నడుస్తూ, నీ పక్కన కూర్చున్నప్పుడు పొందే సుఖం ముందు, మూడు లోకాలని తీసుకొచ్చి నాకు ధారపోసినా, నీ పక్కన కూర్చున్న సుఖం రాదు. అందుకని నేను నీతోనే వస్తాను ” అని సీతమ్మ అనింది.

అప్పుడు రాముడు ” సీతా! నీకు తెలియదు. నా వెంట వస్తానంటున్నావు. నేను వెళుతున్నది అరణ్యాలకి. అరణ్యంలో నదిలో స్నానం చేద్దామని లోపలికి వెళితే మొసళ్ళు పట్టుకుంటాయి. రాత్రి పూట దోమలు కుడతాయి. చీమలు, పాములు ఉంటాయి. రాలిపోయిన ఆకుల మీద పడుకోవాలి. క్రూరమృగాలు సంచరిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మహానుభావులు వస్తారు, అప్పుడు వాళ్ళకి అరణ్యంలో ఉన్న సపర్యలన్నీ చెయ్యవలసి ఉంటుంది. కొన్ని సార్లు ఆహారం దొరకదు, అలా ఆహారం లేకుండానే తిరగవలసి ఉంటుంది, నీళ్ళు దొరకకపోతే అలా దాహంతోనే తిరగాలి. అడవులలో ముళ్ళు గుచ్చుకుంటాయి. ఇన్ని కష్టాలు పడుతూ అరణ్యవాసం చెయ్యాలి, అందుకు తగిన జీవితం నీది కాదు. అందుకని నువ్వు ఇక్కడే ఉండు, నేను పధ్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేసి తిరిగోస్తాను ” అన్నాడు.