వాల్మీకి రామాయణం 58 వ భాగం, అయోధ్య కాండ

యే త్వయా కీర్తితా దోషా వనే వస్తవ్యతాం ప్రతి |
గుణాన్ ఇతి ఏవ తాన్ విద్ధి తవ స్నేహ పురః కృతాన్ ||
అప్పుడు సీతమ్మ ” నువ్వు చెప్పినవన్నీ నిజమే అయ్యుండచ్చు, కాని రామ, నువ్వు పక్కన కూర్చొని సీతా! అని ప్రీతిగా మాట్లాడితే, ఇవన్నీ నాకు సుఖాలు అవుతాయి, అదే నువ్వు పెడముఖంతో ఉంటె మాత్రం, నేను ఎన్ని భోగభాగ్యాల మధ్య ఉన్నా, అవన్నీ నాకు విషం అవుతాయి. నాకు కూడా మా తండ్రిగారు వివాహ సమయంలో ఒక ధర్మం చెప్పారు, నేను నీ వెంట నీడలా వస్తానని. నువ్వు పెద్దల మాటలకు కట్టుబడి అడవులకు వెళుతున్నావు, మరి నేనూ పెద్దల మాటలకు కట్టుబడి నీ వెంట అడవులకు రావాలి కదా. చిన్నప్పుడు నా జాతకాన్ని చూసిన జ్యోతిష్యులు నేను కొంత కాలం వనవాసం చేస్తానని చెప్పారు. అంతఃపురంలో ఉండు, ఇక్కడ నిన్ను అందరూ రక్షిస్తారు, అడవులకు వస్తే పులులు, సింహాలు ఉంటాయి అంటావు, నువ్వు నన్ను రక్షించలేవా, అసలు నిన్ను చూస్తే అవన్నీ పారిపోవా, అలాంటిది ఇవ్వాళ ఇలా చేతకానివాడిలా మాట్లాడుతున్నావు. నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నువ్వు పురుష రూపంలో ఉన్న స్త్రీవని తెలియక, నన్ను మా నాన్న నీకిచ్చి కన్యాదానం చేశాడు. నీతోపాటు ఇంత తేనె తాగినా, ఒక పండు తిన్నా, నా కడుపు నిండిపోతుంది రామ, ఒకవేళ ఆ రోజూ ఏమి దొరకకపోతే, నీతో మాట్లాడుతూ ఉండడం వల్ల నేను ఆ కష్టం మరిచిపోతాను. నేను ముందు నడిచి దర్భలను తోక్కుక్కుంటూ వెళతాను, కాబట్టి అవి మెత్తగా అవుతాయి, అప్పుడు నువ్వు నా వెనకాల హాయిగా రా, నేను నిన్ను ఎన్నడూ కష్టపెట్టను, నన్ను నమ్మితే నీతోపాటు తీసుకెళ్ళు, లేకపోతే నా ప్రాణాలు విడిచిపెట్టడానికి అనుమతినివ్వు ” అని రాముడిని గట్టిగా కౌగలించుకొని, ఆయన గుండెల మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది.


అప్పుడు రాముడు ” సీతా! నిన్ను విడిచి నేను ఉండగలనా. పధ్నాలుగు సంవత్సరాలు నీకు దూరంగా నేను ఉండలేను. కాని, భర్త ఎన్నడూ అది కష్టమని తెలిసి భార్యని నాతో రా అని శాసించకూడదు. ఇంత కష్టానికి వెళదాము అని నేను అనకూడదు, ప్రయత్నపూర్వకంగా భర్త భార్యని కష్టపెట్టకూడదు, భార్య ఉండలేక తనని అనుసరించి వస్తే తీసుకెళ్ళాలి. ఆ అభిప్రాయం నీ నోటవెంట వచ్చాక నిన్ను తీసుకెళ్లడం నా ధర్మం, అందుకని వద్దు అన్నాను. నీవంటి భార్యని పొంది నేను అదృష్టవంతుడినయ్యాను. కనుక నువ్వు ఇక్కడున్నటువంటి వాటన్నిటిని దానం చేసెయ్యి ” అన్నాడు.