వాల్మీకి రామాయణం 63 వ భాగం, అయోధ్య కాండ
Posted by adminMar 4
వాల్మీకి రామాయణం 63 వ భాగం, అయోధ్య కాండ
ఈ మాటలు విన్న రాముడు ” నేను తపస్వినై జీవించడానికి అరణ్యాలకి వెళుతుంటే నా వెనకాల చతురంగ బలాలు, రథాలు, ఏనుగులు ఎందుకు. నాకు ఇవేమీ వద్దు. నాకు నారచీరలు పట్టుకొచ్చి ఇవ్వండి. వాటిని కట్టుకొని నేను వెళ్ళిపోతాను ” అన్నాడు.
ఈ మాటలు వినగానే, కైకేయ సంతోషంతో గబగబా లోపలికి వెళ్ళి మూడు జతల నారచీరలు పట్టుకొని వచ్చి రాముడికి ఇచ్చింది. అప్పుడు, రాముడు లక్ష్మణుడు ఇద్దరూ లోపలికి వెళ్ళి మునులు ఎలా కట్టుకుంటారో, అలా ఆ నారచీరలని కట్టుకొని వచ్చారు. అప్పుడా కైకేయ, పక్కనే పట్టుచీర కట్టుకొని ఉన్న సీతమ్మ చేతిలో ఆ నార చీర పెట్టింది.
ఇది చూసిన వశిష్ఠుడు ” పాపివైన కైకేయ, నువ్వు శృతి తప్పుతున్నావు. ఊరుకున్న కొద్దీ అవధి మించి ప్రవర్తిస్తున్నావు.
ఆత్మా హి దారాః సర్వేషాం దారసంగ్రహవర్తినాం |
ఆత్మేయమితి రామస్య పాలయిష్యతి మేదినీం ||
ఇదే ముహూర్తానికి రాముడి ఆత్మ అయిన సీతమ్మకి నేను పట్టాభిషేకం చేస్తాను. రాముడు తిరిగి వచ్చే వరకు సీతమ్మ రాజ్యాన్ని ఏలుతుంది. ఎవరు అడ్డు చెప్తారో, ఎవరు నాతో ధర్మాన్ని వాదిస్తారో మీ ఇష్టం. సీతమ్మకి నారచీరలు ఇవ్వడానికి నీకున్న అధికారమేమిటి. నువ్వు రాముడిని 14 సంవత్సరాలు అరణ్యాలకి వెళ్ళమని అడిగావు, దశరథుడు ఆ కోరికని అంగీకరించాడు, కాని రాముని వెనకాల సీతమ్మ పత్నిధర్మంతో వెళుతుంది. అటువంటి సీతమ్మకి నారచీరలు ఇచ్చి నువ్వు ఘోరమైన దోషం చేశావు.
యద్యపి త్వం క్షితితలాద్గగనం చోత్పతిష్యసి |
పితుర్వంశచరిత్రజ్ఞః సోన్యథా న కరిష్యతి ||
నువ్వు ఆకాశానికి ఎగిరిపోయి అక్కడినుంచి కింద పడిపో, భూమి మీద అడ్డంగా పడిపో, ఎగిరి గంతులు వెయ్యి, కాని తన వంశమేమిటో, తన వంశంలో పుట్టిన రాజుల చరిత్ర ఏమిటో భరతుడికి క్షుణ్ణంగా తెలుసు, అందుకని భరతుడు రేపు రాజ్యాన్ని తీసుకోడు. అప్పుడా అప్రతిష్ట అంతా నీ మీద పడుతుంది ” అని వశిష్ఠుడు అన్నాడు.
సీతమ్మ నారచీరలు కట్టుకుందామని వెళ్ళి, ఆ నారచీరలని కట్టుకోవడం చేతగాక, కన్నుల నీరు పెట్టుకుని నిలబడింది. అప్పుడు రాముడు, సీతమ్మ వంటి మీద ఉన్న చీర మీదనే నారచీర ఎలా కట్టుకోవాలో కట్టి చూపించాడు. ఈ కైకేయ దురాగతాన్ని ఆపేవాడు ఎవరూలేరా అని దశరథుడి 300 మంది భార్యలు గుండెలు బాదుకొని ఏడిచారు.
అప్పుడు దశరథుడు ” కైక! ఆమె జనకుని కూతురు, నాకు కోడలిగా వచ్చింది. సీతమ్మని అరణ్యాలకి పంపమని నేను నీకు ఎన్నడూ వరం ఇవ్వలేదు. పతిని అనుగమించి ఆమె తన పాతివ్రత్యాన్ని చాటుకుంది ” అని, తన కోశాధికారిని పిలిచి, 14 సంవత్సరాల పాటు సీతమ్మ కట్టుకున్న చీర కట్టకుండా ఉండడానికి ఎన్ని చీరలు కావాలో, అన్ని చీరలు తెప్పించాడు, అలాగే సీతమ్మ రోజూ పెట్టుకోడానికి నగలూ, రత్నములతో కూడిన ఆభరణములని తీసుకొచ్చి సీతమ్మకి ఇమ్మన్నాడు దశరథుడు.
రామ! సీతమ్మకి ఆ నారచీర కట్టమాకు, ఆమె పట్టుచీర తోనే వస్తుందని వశిష్ఠుడు అన్నాడు.