వాల్మీకి రామాయణం 64 వ భాగం, అయోధ్య కాండ
Posted by adminMar 5
వాల్మీకి రామాయణం 64 వ భాగం, అయోధ్య కాండ
తరువాత వాళ్ళు దశరథుడికి, కౌసల్యకి నమస్కారములు చేసి వెళ్ళిపోతుండగా, “రామా” అని పిలిచి, మళ్ళి ఆ దశరథ మహారాజు మూర్చపోయాడు. కొంతసేపటికి దశరథుడు తేరుకొని ” సుమంత్ర! రాజ్య సరిహద్దులు దాటే వరకు రాముడిని రథం మీద తీసుకువెళ్ళు ” అని అన్నాడు. తరువాత కోశాధికారిని పిలిచి సీతమ్మ కట్టుకునే చీరలని, ఆభరణాలని రథంలో పెట్టమన్నాడు.
అప్పుడు కౌసల్య సీతమ్మని కౌగలించుకొని ఇలా అనింది ” అమ్మ సీతా, నీకు తెలియనటువంటివి కావు, అత్తగారిని కనుక ఆర్తితో చెప్తున్నాను. ఇవ్వాళ రాముడు యువరాజ పట్టాభిషేకం పొందవలసినవాడు, కాని నారచీర కట్టుకొని అరణ్యవాసానికి వెళుతున్నాడు. ఇలాంటి స్థితిని పొందాడు కదా అని రాముడిని తక్కువగా చూడమాకు. అలాగే కుల స్త్రీకి స్వర్గం కన్నా, ధనం కన్నా, ధాన్యం కన్నా పరమోత్కృష్టమైనవాడు భర్త ఒక్కడె “.
అప్పుడు సీతమ్మ ” మీరు చెప్పిన విషయాలన్నీ నేను పుట్టింట్లో తెలుసుకునే అత్తవారింటికి వచ్చాను. నేను మీ అబ్బాయిని ఎన్నడూ కష్టపెట్టను. అరణ్యవాస క్లేశం తెలియకుండా, ఆయనని ఆదమరపింపచేసి, ఆనందింపచేయడానికే నేను వారితో వెళుతున్నాను.
న అతంత్రీ వాద్యతే వీణా న అచక్రః వర్తతే రథః |
న అపతిః సుఖం ఏధతే యా స్యాత్ అపి శత ఆత్మజా ||
వీణలొ ఉండే తీగలు లేకపోతే అసలు వీణే లేదు, చక్రం లేకపోతే అసలు రథమే లేదు, నూరుగురు కుమారులు ఇచ్చే సుఖం కన్నా, భార్య భర్త దెగ్గర పొందే సుఖం ముందు ఈ సుఖాలు సరిపోవు ” అనింది.
తరువాత లక్ష్మణుడు సుమిత్రకి ప్రదక్షిణ చేసి నమస్కారం చెయ్యగా, ఆవిడ ఇలా అనింది ” నువ్వు అరణ్యవాసానికే జన్మించావు లక్ష్మణా, రాముడిని ప్రేమించేవాళ్ళు ఇంత మంది ఉన్నా, తమ తమ సంసారాలని వదిలి ఎవరూ రాలేదు. రాముడి కైంకర్యం చేసుకునే అదృష్టం నీకే దక్కింది. నువ్వు ఏమరపాటు లేకుండా సర్వకాలములయందు సీతారాములని రక్షిస్తూ ఉండు.
రామం దశరథం విద్ధి మాం విద్ధి జనక ఆత్మజాం |
అయోధ్యాం అటవీం విద్ధి గచ్చ తాత యథా సుఖం ||
లక్ష్మణా! నువ్వు రాముడిని నీ తండ్రి అనుకో, సీతమ్మని నీ తల్లి అనుకో, వాళ్ళిద్దరూ ఉన్న అడవి అయోధ్య అనుకొని సుఖంగా వెళ్ళిపో ” అనింది.
రాముడు సీతమ్మతో, లక్ష్మణుడితో కలిసి ఆ రథాన్ని ఎక్కాడు. రాముడు వెళ్ళిపోతున్నాడని ఆ అయోధ్యా నగర వాసులందరూ ఏడుస్తున్నారు. యజ్ఞాలు చేస్తున్న వాళ్ళు ఆ యజ్ఞాన్ని మధ్యలోనే ఆపి వచ్చేసారు. ఆడవారు, పిలలు, వృద్ధులు ‘ రామా! రామా! ‘ అంటూ అరుస్తూ బాధపడుతున్నారు. ఏడుస్తున్న తమ పిల్లలకి పక్షులు ఆహారం తేవడం మరిచి, తమ గూళ్ళల్లో కన్నుల నీరు కారుస్తూ నిలబడ్డాయి. ఆశ్వశాలలోని గుర్రాలు, గజశాలలోని ఏనుగులు కన్నులెమ్మట వేడి నీరు కారుతుండగా, సకిలిస్తూ, గర్జన చేస్తూ అటూ ఇటూ ఉన్మాదంతో తిరిగాయి. సమస్త భూతములు ఒకరకమైన సంక్షోభానికి గురయ్యాయి. అలా ఆ రథం వెళుతుండగా, వెనకనుంచి కౌసల్యా దేవి గాలిలోకి చేతులూపుతూ, పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ, తన పవిటకొంగు జారిపోయినా పట్టించుకోకుండా, ఆమెని ఆపుదామని వచ్చిన వారిని తోసేస్తూ, ఆ రథం వెనుక పరుగుతీసింది. మరొకపక్క దశరథుడు ఆగు ఆగు అంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. తన తల్లిదండ్రులని అలా చూడలేక, రథం నడుపుతున్న సుమంత్రుడిని రాముడు తొందరగా నడపమన్నాడు.
” నేను చక్రవర్తిని ఆజ్ఞాపిస్తున్నాను, సుమంత్రా ఆపు, ఆ రథం నడపకు ” అన్నాడు దశరథుడు. రెండు చక్రముల మధ్యలో పడ్డ ప్రాణి పరిస్తితి ఎలా ఉంటుందో, సుమంత్రుడి పరిస్తితి కూడా అలానే ఉంది.
అప్పుడు రాముడు ” సుమంత్రా! రేపు పొద్దున్న నువ్వు తిరిగొచ్చాక, రథం ఎందుకు ఆపలేదని దశరథుడు అడిగితే, నాకు చక్రాల సవ్వడిలో మీ మాటలు వినపడలేదని చెప్పు. కావున రథాన్ని కదుపు ” అన్నాడు. అలా ఆ రథం ముందుకి సాగిపోయింది.