వాల్మీకి రామాయణం 66 వ భాగం, అయోధ్య కాండ

రాముడు ఆ తమసా నదిని దాటాక, ఒక్కక్కరోజు వేదశృతి, గోమతి మొదలైన నగరాలని దాటి, కోసలరాజ్య సరిహద్దుకి చేరుకున్నారు. అక్కడికి వచ్చాక ఆ అయోధ్యా నగరానికి రథం దిగి ఒకసారి నమస్కారం చేసి ఇలా అన్నాడు….
ఆపృచ్ఛే త్వాం పురీశ్రేష్ఠే కాకుత్స్థపరిపాలితే |
దైవతాని చ యాని త్వాం పాలయంత్యావసంతి చ ||
” ఓ అయోధ్యా! పూర్వం మా కాకుత్స వంశంలోని ఎందరో రాజులు నిన్ను పరిపాలించారు. ఇటువంటి అయోధ్యా నగరాన్ని విడిచి, ధర్మానికి కట్టుబడి 14 సంవత్సరాలు అరణ్యాలకి వెళుతున్నాను. తిరిగి నేను ఈ అయోధ్య నగరంలో ప్రవేశించి, మా తల్లిదండ్రుల పాదములకు నమస్కరించే అదృష్టాన్ని నాకు ప్రసాదించు ” అని వేడుకున్నాడు.

తరువాత వాళ్ళు ఆ కోసల దేశ సరిహద్దుల్ని దాటి గంగా నదీ తీరాన్ని చేరుకున్నారు. అక్కడ ఒక ఇంగుదీ(గార) వృక్షం యొక్క నీడలో అందరూ కూర్చున్నారు.

తత్ర రాజా గుహో నామ రామస్య ఆత్మ సమః సఖా |
నిషాద జాత్యో బలవాన్ స్థపతిః చ ఇతి విశ్రుతః ||
రాముడు అక్కడికి వచ్చాడని తెలుసుకొని ఆ ప్రాంతంలో( ఆ ప్రాంతాన్ని శృంగిబేరపురము అని పిలుస్తారు, ఆ ప్రాంతానికి నిషాదుడైన గుహుడు అధిపతి) ఉంటున్న, రాముడికి ఆత్మతో సమానమైన స్నేహితుడైన( తమ ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ రాముడికి ఆత్మతో సమానమైన స్నేహితులే) గుహుడు పరుగు పరుగున వచ్చి, రాముడిని గట్టిగా కౌగలించుకొని ఇలా అన్నాడు……
” రామా! ఇది కూడా నీ రాజ్యమే, ఇది కూడా నీ అయోధ్య అనే అనుకో. నీకోసమని రకరకాల పదార్ధాలు, అన్నరాసులు తీసుకొచ్చాను, తీసుకో రామా ” అన్నాడు.

గుహం ఏవ బ్రువాణం తం రాఘవః ప్రత్యువాచ హ |
అర్చితాః చైవ హృష్టాః చ భవతా సర్వథా వయం |
పద్భ్యాం అభిగమాచ్ చైవ స్నేహ సందర్శనేన చ ||

అప్పుడు రాముడు ” గుహా! మా అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం నేను ఇవన్నీ తినకూడదు. కాని నువ్వు నాకోసం పరిగెత్తుకుంటూ వచ్చి, ప్రేమతో ఈ రాజ్యం కూడా అయోధ్యే అన్నావు కదా, అప్పుడే నా కడుపు నిండిపోయింది. మా నాన్నగారికి ఈ గుర్రాలంటే చాలా ప్రీతి, అవి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చి అలసిపోయాయి, వాటికి కావలసిన గడ్డి, మొదలైనవి ఇవ్వు ” అన్నాడు.

ఆ రోజున గుర్రాలు సేద తీరాక, ఆ ఇంగుదీ వృక్షం కింద సీతారాములు పడుకున్నారు. అప్పుడు గుహుడు లక్ష్మణుడిని కూడా పడుకోమనగా….
కథం దాశరథౌ భూమౌ శయానే సహ సీతయా |
శక్యా నిద్రా మయా లబ్ధుం జీవితం వా సుఖాని వా ||
యో న దేవ అసురైః సర్వైః శక్యః ప్రసహితుం యుధి |
తం పశ్య సుఖ సంవిష్టం తృణేషు సహ సీతయా ||
” నాకు నిద్ర వస్తుందని ఎలా అనుకున్నావు, రాముడు నేల మీద పడుకొని ఉండగా నా జీవితానికి ఇక సుఖం లేదు. దేవతలు, రాక్షసులు కలిసి యుద్ధానికి వస్తే, వాళ్ళని నిగ్రహించగల మొనగాడు మా అన్నగారు, అలాంటి మా అన్నయ్య, సీతమ్మతో కలిసి ఇలా పడుకొని ఉంటె నేనెలా పడుకోగలను ” అన్నాడు లక్ష్మణుడు.