వాల్మీకి రామాయణం 67 వ భాగం, అయోధ్య కాండ
Posted by adminMar 8
వాల్మీకి రామాయణం 67 వ భాగం, అయోధ్య కాండ
మరునాడు ఉదయం గుహుడు తీసుకొచ్చిన పడవ ఎక్కి సీతారామలక్ష్మణులు గంగని దాటడానికి సిద్ధపడుతున్నారు. అప్పుడు సుమంత్రుడు రాముడిని పిలిచి, ‘ నేను ఏమి చెయ్యను ‘ అని అడుగగా, రాముడు ఇలా అన్నాడు ” నువ్వు తిరిగి అయోధ్యకి వెళ్ళి మా తండ్రిగారికి, ముగ్గురు తల్లులకి నా నమస్కారములు చెప్పు, కౌసల్యని సర్వకాలములయందు దశరథుడిని సేవించమని చెప్పు. భరతుడిని కుశలమడిగానని చెప్పు, వృద్ధుడైన చక్రవర్తిని ఏ ఒక్క కారణం చేత బాధ పెట్టవద్దని చెప్పు, తండ్రి మనస్సుకి అనుగుణంగా పరిపాలించమని చెప్పు ” అన్నాడు.
అప్పుడు సుమంత్రుడు ” రామా! నేను మీతోనే వస్తాను, మీ సేవ చేసుకుంటాను, ఏ రథం మీద మిమ్మల్ని అరణ్యాలకి తీసుకువచ్చానో, ఆ రథం మీదే మిమ్మల్ని 14 సంవత్సరాల తరువాత అయోధ్యకి తీసుకువెళతాను ” అన్నాడు.
” నువ్వు నాతో వచేస్తే కైకమ్మకి అనుమానం వస్తుంది. రాముడు అరణ్యవాసం చెయ్యకుండా రథం మీద తిరుగుతున్నాడనుకుంటుంది. అందుకని నువ్వు ఖాళీ రథంతో వెనక్కి వెళ్ళి, రాముడు గంగని దాటి అరణ్యాలకి వెళ్ళాడని చెప్పాలి, అప్పుడు ఆమె సంతోషిస్తుంది. అందుకని నువ్వు బయలుదేరాలి ” అన్నాడు. వెంటనే సుమంత్రుడు అయోధ్యకి బయలుదేరాడు.
తత్ క్షీరం రాజ పుత్రాయ గుహః క్షిప్రం ఉపాహరత్ |
లక్ష్మణస్య ఆత్మనః చైవ రామః తేన అకరోజ్ జటాః ||
అప్పుడు రాముడు గుహుడిని పిలిచి ” గుహా! ఇకనుంచి నేను ఒక తపస్వి ఎలా బతుకుతాడో అలా బతకాలి. అందుకని నువ్వు నాకోసం మర్రి పాలు తీసుకురా ” అన్నాడు. అప్పుడు రాముడు గుహుడిని ఆ మర్రిపాలని తన తల మీద, లక్ష్మణుడి తల మీద పొయ్యమన్నాడు. మర్రిపాలు పోశాక జిగురుతో ఉన్న ఆ జుట్టుని జటల కింద కట్టేసుకున్నాడు. అక్కడున్న వాళ్ళందరూ రాముడి యొక్క ధర్మనిష్ఠకి ఆశ్చర్యపోయారు. అప్పుడు రాముడు ” నేను ఈ 14 సంవత్సరాలు నా క్షాత్ర ధర్మాన్ని పాటిస్తూ, బ్రహ్మచర్యంతో కూడిన అరణ్యవాసాన్ని చేస్తాను ” అన్నాడు.
తరువాత రాముడు లక్ష్మణుడిని పిలిచి ” ముందు మీ వదినని పడవ ఎక్కించి నువ్వు ఎక్కు ” అని చెప్పి, వాళ్ళు పడవ ఎక్కాక ఆయన కూడా పడవ ఎక్కాడు. అలా సీతారామలక్ష్మణులు గంగని దాటి ఆవలి ఒడ్డుకి వెళ్ళారు. అక్కడినుంచి అలా కొంత దూరం వెళ్ళాక చీకటి పడేసరికి వాళ్ళందరూ ఒక చెట్టు కింద విడిది చేశారు. అప్పుడు రామలక్ష్మణులు వెళ్ళి మూడు మృగాలని సంహరించి, వాటిని తీసుకొచ్చి అగ్నిలో బాగా కాల్చి, ఆ మాంసాన్ని ముగ్గురూ తిన్నారు. తరువాత అక్కడే పడి ఉన్న ఎండుటాకులమీద పడుకున్నారు.
అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి ” లక్ష్మణా! నాకు ఒక ఆలోచన వచ్చింది. భరతుడు యువరాజ పట్టాభిషేకం చేసుకున్నాక కౌసల్యని, సుమిత్రని బంధిస్తాడు. అందుకని నువ్వు బయలుదేరి అయోధ్యకి వెళ్ళిపో ” అన్నాడు.
రాముడి మాటలు విన్న లక్ష్మణుడు ఇలా చెప్పాడు ” అన్నయ్యా తప్పకుండా వెళ్ళిపోతాను, కాని ఈ మాట నాకు చెప్పినట్టు, నిద్రపోతున్న సీతమ్మకి కూడా చెప్పవే. సీతమ్మ నిన్ను విడిచిపెట్టి ఉండలేదు కనుక, ఆ విషయం నీకు తెలుసు కనుక సీతమ్మని వెనక్కి వెళ్ళి కౌసల్య సుమిత్ర దశరథుల సేవ చెయ్యమని నువ్వు ఆజ్ఞాపించవు. నిన్ను విడిచిపెట్టి వెళ్ళి నేను ఉండగలనని అనుకుంటున్నావు, అందుకు నన్ను వెళ్ళిపోమంటున్నావు.
న చ సీతా త్వయా హీనా న చ అహం అపి రాఘవ |
ముహూర్తం అపి జీవావో జలాన్ మత్స్యావ్ ఇవ ఉద్ధృతౌ ||
నీటిలో ఉన్న చేప పిల్లని పైకి తీసి ఒడ్డున పారేస్తే, తన ఒంటికి తడి ఉన్నంతవరకు ప్రాణములతో ఉండి, ఆ ఒంటి తడి ఆరిపోగానే ఎలా ప్రాణములని వదులుతుందో, అలా వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ, నిన్ను చూస్తూ, నువ్వు ఎంతసేపు కనపడతావో అంతసేపు ప్రాణములతో ఉండి, నువ్వు కనబడడం మానెయ్యగానే ఈ ప్రాణములను విదిచిపెట్టేస్తాను అన్నయ్యా ” అన్నాడు.
” లక్ష్మణా! 14 సంవత్సరాల అరణ్యవాసంలో మళ్ళి నిన్ను ఈ మాట అడగను, నువ్వు నాతోనే ఉండు ” అని రాముడు లక్ష్మణుడితో అన్నాడు.