వాల్మీకి రామాయణం 71 వ భాగం, అయోధ్య కాండ
Posted by adminMar 12
వాల్మీకి రామాయణం 71 వ భాగం, అయోధ్య కాండ
తరువాత కౌసల్య దేవి దశరథుడిని తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టింది. అప్పుడాయన కౌసల్య, కౌసల్య అని కలవరించగా కౌసల్య, సుమిత్ర ఇద్దరూ వచ్చి ఆయన పక్కన కూర్చున్నాక దశరథుడు ” నేను ఎందుకింత బాధ పడుతున్నానో నాకు ఇప్పుడు అర్థమయ్యింది. పాలు తాగుతున్న పిల్లలకి, తల్లుల యొక్క స్తన్యములు కత్తి పెట్టి నరికేసుంటాను, అందుకని నేను ఇంత బాధ పడుతున్నాను అన్నావు కదా, నీది కాదు దోషం. నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది, నీకు ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా విను. నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఒకసారి వేటాడాలని అనిపించింది. అప్పుడు బాగా వర్షం పడి భూమి అంతా తడిగా ఉంది. ఇప్పుడు క్రూరమృగాలు తప్పకుండా నీళ్ళు తాగడానికి బయటకి వస్తాయని, ఆ రోజూ రాత్రంతా ధనుస్సుకి బాణాన్ని సంధించి కూర్చున్నాను. తెల్లవారే వరకు ఏ మృగము వచ్చినట్టు నాకు కనపడలేదు. తెల్లవారుతుండగా నాకు గుడగుడ శబ్దం వినిపించింది, కాని అప్పటికి ఇంకా చీకటిగానే ఉంది, ఏనుగు తొండంపెట్టి నీళ్ళు తాగుతుందని గ్రహించాను. నాకు శబ్దవేధీ విద్య తెలుసు. అందుకని శబ్దాన్ని బట్టి ఏనుగు యొక్క కుంభస్థలం మీద బాణ ప్రయోగం చెయ్యాలనుకొని చీకట్లో బాణ ప్రయోగం చేశాను. ఏనుగు యొక్క ఘీంకారం వినిపిస్తుందని అనుకున్నాను, కాని నాకు ఒక మనిషి ఆర్తనాదాలు వినపడ్డాయి. నేను భయపడి అక్కడికి వెళ్ళి చూసేసరికి, నేను విడిచిపెట్టిన బాణం గుండెల్లో గుచ్చుకొని ఒక ముని కుమారుడు ఆ నది ఒడ్డున పడి తన్నుకుంటున్నాడు. నేను భయపడుతూ అతని దెగ్గరికి వెళ్ళగా, అతను నేను ముని కుమారుడిని, తపస్సు చేసుకుంటున్నాను, తల్లిదండ్రులని పోషించుకుంటున్నాను. ఇటువంటి నన్ను నిష్కారణంగా బాణం పెట్టి ఎందుకు కొట్టావు అని అడిగాడు. అప్పుడు నేను, నిన్ను కొట్టాలని కొట్టలేదు, నీరు తాగుతున్న శబ్దానికి ఏనుగనుకుని బాణం విడిచిపెట్టాను. నా దురదృష్టం ఆ బాణం నీకు తగిలిందని భయపడుతూ నిలబడ్డాను.
అప్పుడా ముని కుమారుడు నన్ను చూసి, నువ్వు భయపడమాకు, నీకు బ్రహ్మహత్యా దోషం లేదు, ఎందుకంటే నా తండ్రి వైశ్యుడు, నా తల్లి శూద్ర స్త్రీ, కాబట్టి శపించే అధికారం నాకు లేదు. కాని నా తల్లిదండ్రులిద్దరూ అంధులు, అరణ్యంలో కూర్చుని ఉన్నారు. రోజూ నేను గ్రంధ పఠనం చేస్తే, అవి వింటూ ఉంటారు. నేనే వారికి ఆహారం, నీరు తీసుకెళుతుంటాను. ఇప్పుడు వాళ్ళు మహా దాహంతో ఉన్నారు, అందుకనే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు ఈ నీళ్ళు పట్టుకెళ్ళి నా తల్లిదండ్రులకు ఇవ్వు. ఈ బాణపు ములుకు నాలో ఉన్నందున నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను, కనుక నువ్వు ఈ బాణం తీసెయ్యి అన్నాడు.
తీసేస్తే అతను చనిపోతాడు, తీయకపోతే అతను ఆ బాధ తట్టుకోలేకపోతున్నాడు, అందుకని అతను బాధ పడడం ఇష్టం లేక బాణం తీసేసాను. ఆ పిల్లవాడు వెంటనే మరణించాడు. అప్పుడు నేను ఆ నీటి కుండ పట్టుకొని అతని తల్లిదండ్రుల దెగ్గరికి వెళ్ళాను. నా అడుగుల శబ్దం విన్న ఆ అంధులైన తల్లిదండ్రులు, నాయనా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు, మీ అమ్మ నీ కోసం బెంగ పెట్టుకుంది, అని ఆ ముని కుమారుడి తండ్రి అడిగితే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాను. నా వల్ల పొరపాటు జెరిగింది, మీ కుమారుడిని నేనే సంహరించాను అని చెప్పాను. అప్పుడాయన నన్ను తన కుమారుడి కళేబరాన్ని చూపించమన్నాడు. నేను వాళ్ళని అక్కడికి తీసుకువెళ్లగా వాళ్ళు తమ కుమారుడి శవం మీద పడి రోదించారు. తరవాత ఆ తండ్రి నావంక తిరిగి, నేను ఎలాగైతే ఇప్పుడు నా కుమారుడి మీద పడి ‘హా! కుమారా, హా! కుమారా’ అని పుత్రశోకంతో ప్రాణాలు విడిచిపెడుతున్నానో, నువ్వు కూడా అలాగే ఏడుస్తూ ‘హా! కుమారా’ అంటూ ప్రాణాలు విడిచిపెడతావు అని నన్ను శపించాడు.
ఈలోగ స్వర్గలోకం నుండి ఇంద్రుడు వచ్చి, నువ్వు తల్లిదండ్రులకి చేసిన సేవకి నిన్ను స్వర్గానికి తీసుకు వెళతానని, ఆ ముని కుమారుడిని తన రథంలొ తీసుకెళ్ళాడు. ఆ పిల్లవాడిని విడిచి ఉండలేక ఆ వృద్ధ దంపతులు ఇద్దరూ ప్రాణాలు విడిచిపెట్టారు. అప్పుడు నాకు తెలియలేదు కౌసల్య, ‘హా! కుమారా’ అంటూ మరణించడం ఎంత కష్టమో అని. నేను చేసిన పాపం నన్ను వెంటాడింది. నా చెవులు కూడా వినపడడంలేదు. నా కళ్ళు కనబడడం లేదు. నాకు జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంది. అంతా భ్రాంతిలాగ ఉంది. ఎవరో దూతలు వచ్చి నా ప్రాణాలని లాగేస్తున్నారు. రాముడిని చూసే అదృష్టం నాకు ఇంక లేదు. నేను ఏ తప్పు చెయ్యలేదు, నన్ను మన్నించు. కౌసల్యా, సుమిత్రా, రామా……రామా………” అని ఆ దశరథ మహారాజు ప్రాణాలు విడిచిపెట్టాడు.