వాల్మీకి రామాయణం 73 వ భాగం, అయోధ్య కాండ
Posted by adminMar 14
వాల్మీకి రామాయణం 73 వ భాగం, అయోధ్య కాండ
అప్పుడు వశిష్ఠుడు ” ఇందులో మీరు కాని నేను కాని ఆలోచించాల్సిన విషయం ఏమి లేదు. ఎందుకంటే, దశరథుడు వెళ్ళిపోతూ ఒక నిర్ణయం చేసి వెళ్ళిపోయాడు, భరతుడికి ఈ రాజ్యం దక్కాలని రాముడు అరణ్యవాసం చెయ్యాలని నిర్ణయించాడు. ఆ కారణం చేత భరతుడిని పిలిపించి ఈ సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చెయ్యాలి. కాని భరతుడు తన తాతగారైన కైకేయ రాజు దెగ్గర ఉన్నాడు, ఆ రాజ్యం చాలా దూరంలో ఉంది కనుక, చాలా వేగంగా అశ్వముల మీద వెళ్ళగలిగే దూతలని పంపుదాము ” అని అన్నడు.
తరువాత వశిష్ఠుడు సిద్ధార్థుడు, జయంతుడు, విజయుడు, అశోకుడు అనే నలుగురు దూతలని సిద్ధం చేసి కైకేయ రాజ్యానికి వెళ్ళి ఆ కైకేయ రాజుకి విశేషమైన ధనాన్ని బహుమతిగా ఇవ్వమన్నాడు. కాని అక్కడ మీరు రాముడు అరణ్యాలకి వెళ్లినట్టు కాని, దశరథ మహారాజు మరణించినట్టు కాని ఎవరికీ చెప్పవద్దు అన్నాడు. భరతుడిని నేను కుశలం అడిగానని చెప్పి, ఒక్క క్షణం ఆలస్యం కాకుండా అయోధ్యా నగరాన్ని చేరుకోవాలని నేను ఆజ్ఞాపించానని చెప్పి తీసుకురండి అన్నాడు. అప్పుడా దూతలు మార్గమధ్యంలో తినడానికి కావలసిన ఆహార సంభారములని సమకూర్చుకొని అడ్డదారిలో బయలుదేరారు. వాళ్ళు రాజభక్తి కలిగిన వారు కనుక, వెళ్ళే దారిలో కంటికి తృప్తినిచ్చే విషయాలు కనిపించినా ఆగకుండా వెళ్ళారు. అలా వారు అయోధ్య నుండి పడమటికి బయలుదేరి అపరతాలము అనే పర్వతాన్ని దాటి, మాలినీ నది తీరం గుండా ప్రయాణం చేసి, ప్రలంబ పర్వతానికి ఉత్తరం వైపు తిరిగి, అక్కడినుంచి పశ్చిమాభి ముఖంగా ప్రయాణం చేసి, హస్తిన నగరాన్ని సమీపించి, అక్కడ ప్రవహిస్తున్న గంగా నదిని దాటి, మళ్ళి పశ్చిమాభి ముఖంగా తిరిగి, అక్కడినుంచి కురు దేశంలో ఉండేటటువంటి జాఙ్గలం అనే గ్రామంలోకి వెళ్ళి, అక్కడినుంచి పాంచాల రాజ్యాన్ని చేరి, శరదండము అనే నదిని దాటి, పశ్చిమాభి ముఖంగా ప్రయాణం చేసి, నికూలవృక్షము అనే మహా వృక్షాన్ని చేరి, అక్కడినుంచి కులింగ పట్టణం చేరుకొని అక్కడినుంచి అభికాలము అనే గ్రామాన్ని చేరుకొని, తరువాత ఇక్షుమతి నదిని దాటి, బాహ్లిక దేశాన్ని చేరుకొని, దాని మధ్యలోనుంచి బయలుదేరి సుదామము అనే విష్ణు పధాన్ని చేరుకొని, అక్కడినుంచి విపాశా నదిని దాటి, శాల్మలీ వృక్షము అనే గొప్ప ప్రాంతాన్ని చేరుకొని, అక్కడినుంచి బయలుదేరి రాత్రికి గిరివ్రజాన్ని(గిరివ్రజం కైకేయ రాజ్యానికి రాజధాని) చేరుకున్నారు. తెల్లవారాక భరతుడి దర్శనం కోసం లోపలికి ప్రవేశించారు.