వాల్మీకి రామాయణం 78 వ భాగం, అయోధ్య కాండ
Posted by adminMar 19
వాల్మీకి రామాయణం 78 వ భాగం, అయోధ్య కాండ
ఈ మాటలు విన్న భరతుడు కైకేయ వంక విచిత్రంగా చూసి ” అమ్మా! నువ్వు ఇటువంటి దారుణమైన పని చేస్తావని నేను ఎన్నడూ ఊహించలేదు. నేను నీతో మాట్లాడేటప్పుడు ఏనాడైనా నాకు రాజ్యం పట్ల కోరిక ఉందని కాని, రాముడు నాకు కంటకంగా మారుతాడని కాని నీతో చెప్పాన. నిన్ను ఎవరు అడగమన్నారు రాజ్యాన్ని, నీకు మించిన భారాన్ని నెత్తి మీద వేసుకున్నావు, ఇక్ష్వాకు వంశంలో కాళరాత్రి ప్రవేశించినట్టు ప్రవేశించావు, నువ్వు నాకు తల్లివి కావు, నేను నీకు కొడుకుని కాదు, నేను నిన్ను అమ్మగా విడిచిపెడుతున్నాను. ఇప్పుడే నా మొలకి ఉన్న కత్తి తీసి నీ కుత్తుక కత్తిరించాలి, కాని నిన్ను చంపేస్తే, తల్లిని చంపినవాడు భరతుడు అని రాముడు నాతో మాట్లాడడు. రాముడు మాట్లాడడన్న బెంగ చేత నిన్ను వదిలేస్తున్నాను. రాముడు కౌసల్యని ఎలా చూశాడో, నిన్ను అలానే చూశాడు. ఈ ఇక్ష్వాకు వంశంలో రాజ్యాన్ని ఎప్పుడూ పెద్దవాడు మాత్రమే అనుభవించాలి. నేను రాజ్యాన్ని అంగీకరిస్తానని ఎలా అనుకున్నావు. దశరథ మహారాజు కూడా రాముడి సహకారం తీసుకొని ఈ రాజ్యాన్ని పరిపాలించాడు. నువ్వు చేసిన ఈ పాపకృత్యానికి ఇవ్వాళ మూడు దుష్కరమైన విషయాలు జెరిగాయి, నా తండ్రి శరీరాన్ని విడిచిపెట్టాడు, ధర్మమూర్తి అయిన రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు, ఏ పాపం ఎరుగని నా మీద, భరతుడికి రాజకాంక్ష ఉందన్న అపవాదు పడింది. నేను ఎంతమందికి చెప్పుకుంటే నా మీద పడ్డ అపవాదు పోతుంది, నువ్వు తల్లివి కాదు, నాకు అపవాదు తెచ్చిన దౌర్భాగ్యురాలివి.
అమ్మా! నీకు ఒక విషయం చెప్తాను, ఒకానొకనాడు ఆకాశంలో కామధేనువైన సురభి వెళ్ళిపోతుండగా, భూమండలం మీద ఒక రైతు విపరీతమైన ఎండలో, శోషించిపోతున్న రెండు ఎద్దులని నాగలికి కట్టి, డొక్కలతో పొడుస్తూ సేద్యం చేయిస్తుంటే సురభి కన్నులవెంట నీరు కార్చింది (ఈ భూమండలం మీద ఉన్న ఆవులు, ఎద్దులు ఆ సురభి యొక్క సంతానమే). దేవేంద్రుడు ఐరావతం మీద వెళుతుండగా, ఆయన చేతి మీద సురభి కన్నీటి చుక్కలు పడ్డాయి. దివ్యపరిమళం కలిగిన కన్నీటి బిందువులు ఎవరివా అని ఇంద్రుడు పైకి చూసేసరికి, సురభి ఏడుస్తూ కనిపించింది. వెంటనే ఇంద్రుడు ఐరావతం దిగి అమ్మా! ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు, అప్పుడా సురభి ” నాకు కొన్ని కోట్ల మంది బిడ్డలు ఉండచ్చు, ఈ భూమండలంలో ఉన్న ఆవులు, ఎద్దులు నా శరీరం నుంచి వచ్చినవే. ఇంతమంది బిడ్డలు ఉన్నా, ఈ రెండు ఎద్దులని రైతు పొడుస్తూ, ఎండలో సేద్యం చేయిస్తుంటే, నా బిడ్డలని ఇంత కష్టపెడుతున్నాడని దుఖం ఆగక ఏడిచాను ” అని, కోట్ల మంది బిడ్డలు కలిగిన సురభి అనింది. మరి ఒక్కగానొక్క కుమారుడు అమ్మా కౌసల్యకి, లేకలేక పుట్టినవాడు, ధర్మాత్ముడు, అటువంటి వాడిని 14 సంవత్సరాలు అరణ్యాలకి పంపావె, కొడుకు పక్కన లేడని, భర్త మరణించాడని కౌసల్య ఎంత ఏడుస్తుందో ఆలోచించావ. నువ్వు చెప్తే రాజ్యాన్ని ఎలుతాననుకున్నావా, ఒక్కనాటికి అది జెరగదు. ఇక నువ్వు బతికుండడం అనవసరం. వెంటనే అంతఃపురానికి వెళ్ళి ఉరివేసుకో, అదొక్కటే నీకు ప్రాయశ్చిత్తం ” అని భరతుడు అన్నాడు.