వాల్మీకి రామాయణం 80 వ భాగం, అయోధ్య కాండ
Posted by adminMar 21
వాల్మీకి రామాయణం 80 వ భాగం, అయోధ్య కాండ
అప్పుడు కౌసల్య ” నాయనా నువ్వు ఎటువంటివాడివో నాకు తెలుసు, కాని పుత్రుడు దూరంగా వెళ్ళిపోయాడన్న బాధతో అలా మాట్లాడను ” అని భరతుడిని తన ఒడిలో కుర్చోపెట్టుకుంది. ఆ రాత్రంతా భరతుడు ఏడుస్తూనే గడిపాడు.
తెల్లవారగానే వశిష్ఠుడు మొదలైన మహర్షులు వచ్చి ” నీ తండ్రి శరీరం తైల ద్రోణిలొ ఉండిపోయింది. ఆయనకి అంచేష్టి సంస్కారం చెయ్యకపోతే ఉత్తమగతులు కలగవు, కావున ఆ పనియందు దృష్టి పెట్టు ” అన్నారు.
అప్పుడా దశరథ మహారాజు పార్థివ శరీరాన్ని తైల ద్రోణి నుంచి పైకి తీసి బయట పెట్టారు. అందరూ వచ్చి చూశారు. అక్కడినుంచి ఆయనని శిబికలోకి పెట్టారు. తరువాత ఆ శిబికతో శరీరాన్ని చితి మీద పెట్టారు. భరతడు, శత్రుఘ్నుడు అగ్నిహోత్రం తీసుకొచ్చి వెలిగించారు. తరువాత అందరూ సరయు నదికి వెళ్ళి స్నానం చేశారు (ఆ కాలంలో ఇక్ష్వాకు వంశంలో ఆడవారు కూడా చితి దెగ్గరికి వచ్చేవారు). రెండు మూడు రోజుల తరువాత కొన్ని లక్షల గోవుల్ని, బంగారాన్ని దానం చేశారు. అందరికి భోజనాలు పెట్టారు, 13వ రోజున అసౌచం తీరిపోయాక మంత్రులందరూ కలిసి భరతుడి దెగ్గరికి వెళ్ళి సింహాసనం ఖాళీగా ఉండకూడదు, మీ తండ్రిగారి కోరిక ప్రకారం నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించు అన్నారు.
అప్పుడు భరతుడు పట్టాభిషేకానికి తీసుకువచ్చిన సంభారములన్నిటికి ఒకసారి ప్రదక్షిణం చేసి,
రామః పూర్వో హి నో భ్రాతా భవిష్యతి మహీ పతిః |
అహం తు అరణ్యే వత్స్యామి వర్షాణి నవ పంచ చ ||
” నాకు ముందు పుట్టిన రాముడు ఈ అభిషేక సంభారములతో యువరాజ పట్టాభిషేకం చేసుకోవాలి, సింహాసనం మీద కూర్చొని రాజ్యం పరిపాలించాలి, కాని మా నాన్నగారి ఆజ్ఞ ప్రకారం 14 సంవత్సరాలు దండకారణ్యంలో ఉన్నాడు. రాముడికి నాకు తేడా లేదు, రాముడి బదులు నేను 14 సంవత్సరములు అరణ్యవాసం చేస్తాను, రాముడు వచ్చి పట్టాభిషేకం చేసుకుంటాడు. అందుకని మీరందరూ వెళ్ళి మంచి వడ్రంగులని, శిల్పులని తీసుకువచ్చి, రాజ్యంనుంచి రాముడు దండకారణ్యంలో ఎక్కడున్నాడో అక్కడివరకు దారి చెయ్యండి. నాతో పాటు అయోధ్యా అంతా కదిలి వెళ్ళిపోవాలి, ఇంతమంది అడిగితే రాముడు కాదనలేడు. కావున ఇంతమంది వెళ్ళడానికి తగిన ఏర్పాట్లు చెయ్యండి ” అన్నాడు.
ఈ వార్త అయోధ్యలోని ప్రతివారికి చేరింది, అందరూ ఆ వార్త విని మురిసిపోయారు.