వాల్మీకి రామాయణం 83 వ భాగం, అయోధ్య కాండ

అందరూ రాముడిని చేరుకోవడం కోసమని అయోధ్య నుంచి బయలుదేరారు. కాని, అందరి కంటే ముందు కైకేయ బయలుదేరింది. తాను ఎవరికోసమైతే ఈ పని చేసిందో, ఆ భరతుడే తనని కాదన్నప్పుడు ఆమెను ఆవహించిన మొహం పోయింది. తన తప్పుని తెలుసుకుంది. అలా కొన్ని లక్షల సైన్యంతో బయలుదేరి వాళ్ళు గంగా నదిని చేరుకున్నారు. అప్పుడు ఆ నిషాద రాజైన గుహుడు వాళ్ళని చేసేసరికి, ఒక పెద్ద సముద్రము వచ్చినట్టు, కోవిదార వృక్షము చిహ్నముగా ఉన్నటువంటి  సైన్యం వచ్చి నిలబడింది.

అప్పుడు గుహుడు తన బంధువులని, సైన్యాన్ని, యువకులని పిలిచి ” భరతుడు ఇంత సైన్యంతో వచ్చాడంటే, కచ్చితంగా మనందరినీ చంపడం కోసమైనా వచ్చి ఉండాలి, లేదా 14 సంవత్సరాల తరువాత రాముడు తిరిగి వస్తే ఆయన పరాక్రమము ముంది నిలబడలేనని, ఇదే అదునుగా ఒక్కడె ఉన్న రాముడిని, లక్ష్మణుడిని సంహరించడం కోసమైనా వచ్చి ఉండాలి. రాముడు నాకు పరమ మిత్రుడు, ఆయనని మనం రక్షించుకోవాలి. ఇంత పెద్ద సైన్యాన్ని మనం ఎదిరించలేము, కాకపోతే మన సహాయం లేకుండా వీళ్ళు ఎవరు గంగని దాటలేరు. అందుకని 500 పడవలని ఈ సైన్యం అంతా వెళ్ళడానికి సిద్ధం చెయ్యండి. మీరందరూ కూడా ఒక్కొక్క పడవలో 100 మంది చొప్పున కవచాలు కట్టుకొని, ఆయుధాలు పట్టుకొని నిలబడండి. నేను ఏమి ఎరుగని వాడిలా భరతుడి దెగ్గరికి వెళ్ళి, నువ్వు రాముడిని కలుసుకోడానికి వెళుతున్నావ, రాముడిని సంహరించడానికి వెళుతున్నావ అని అడుగుతాను. ఒకవేళ రాముడిని సంహరించడానికే భరతుడు వచ్చి ఉంటె, పడవలలో గంగని దాటిస్తామని చెప్పి, పడవ ఎక్కించి, గంగ మధ్యలో ముంచేద్దాము. ఒకవేళ రాముడిని కలుసుకోవడానికే భరతుడు వచ్చి ఉంటె, రాముడు ఎక్కడున్నాడో చెప్పి, వాళ్ళతో నేను కూడా వెళతాను ” అన్నాడు.   

అప్పుడాయన కొంత మాంసము, పుష్పములు, ధాన్యములు, కందమూలములు, తేనె పట్టుకొని భరతుడు విడిది చేసిన గృహం దెగ్గరికి వెళ్ళాడు. గుహుడు రావడాన్ని చూసిన సుమంత్రుడు లోపలికి వెళ్ళి భరతుడితో ” భరతా! నువ్వు రాముడు ఎక్కడున్నాడో అని వెతుకుతున్నావు కదా, రాముడు ఎక్కడున్నాడో గుహుడికి తెలుస్తుంది. రాముడికి గుహుడి మీద అపారమైన ప్రేమ, అలాగే గుహుడికి రాముడి మీద అపారమైన భక్తి ” అని చెప్పగానే భరతుడు గుహుడిని లోపలికి ప్రవేశపెట్టమన్నాడు.