వాల్మీకి రామాయణం 84 వ భాగం, అయోధ్య కాండ

యదా తుష్టః తు భరతః రామస్య ఇహ భవిష్యతి |
సా ఇయం స్వస్తిమయీ సేనా గంగాం అద్య తరిష్యతి ||
లోపలికి వెళ్ళిన గుహుడు తాను తీసుకువచ్చిన వాటిని అక్కడ పెట్టి “నువ్వు ఈ రాజ్యాన్ని దశరథ మహారాజుగారి వల్ల పొందావు, ఇంకా నీ తృప్తి తీరక రాముడిని చంపుదామని వచ్చావ, లేకపోతే రాముడిని కలుసుకుందామని వచ్చావ, నాకు మనస్సులో శంకగా ఉంది. నిజం చెప్పు భరతా, ఎందుకు వచ్చావు ఇక్కడికి ” అని అడిగాడు.

అప్పుడు భరతుడు ” నువ్వు అన్నమాట వలన నాకు బాధ కలిగినా, నీ అమాయకత్వం నాకు తెలుస్తోంది. నేను ఈ గంగ దాటి భారద్వాజ ఆశ్రమానికి వెళ్ళి, ఆ ఆశ్రమం దెగ్గరలో ఉన్న రాముడిని కలుసుకోవాలని అనుకుంటున్నాను ” అన్నాడు.

” సరే నువ్వు రాముడిని కలుసుకోవాలని వచ్చావు, మరి నీ వెనకాల ఇంత సైన్యం ఎందుకు వచ్చింది ” అని గుహుడు భరతుడిని ప్రశ్నించాడు.

అప్పుడు భరతుడు ఆకాశమంత నిర్మలమైన మనసుతో ” ఒక తమ్ముడు ఒక అన్నగారిని రాజ్యం కోసం చంపేటటువంటి దురాలోచన ఎన్నడూ రాకుండుగాక, ఒక తమ్ముడు అన్నగారి గురించి ఎప్పుడన్నా ఆలోచిస్తే, అన్నగారి కాళ్ళుపట్టి నమస్కరించడానికి మాత్రమే ఆలోచించేటటువంటి సౌజన్యము నిలబడుగాక ” అన్నాడు.

ఈ మాటలు విన్న గుహుడు ” ఇక్ష్వాకు వంశంలో పుట్టిన నీకే చెల్లిందయ్యా ఈ మాట చెప్పడం. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఇద్దరూ కలిస్తే, చూసి మురిసిపోవాలని ఉంది, దెగ్గరుండి గంగని దాటించి నేను మీతో వస్తాను. రాముడు ఇక్కడే పడుకొని వెళ్ళాడు, నన్ను తన తల మీద మర్రి పాలు పోయమన్నాడు, జటలు ధరించి, నార చీరలు కట్టుకొని వెళ్ళాడయ్యా  రాముడు ” అని అన్నాడు.