వాల్మీకి రామాయణం 85 వ భాగం, అయోధ్య కాండ
Posted by adminMar 26
వాల్మీకి రామాయణం 85 వ భాగం, అయోధ్య కాండ
ఆ రాత్రి భరతుడు రాముడి గురించి ఆలోచిస్తూ, తన వల్ల రాముడు ఇన్ని కష్టాలు పడుతున్నాడని బాధపడుతూ ఉండడం వలన నిద్రపట్టక గుహుడిని పిలిచి, నాకు రాముడి గురించి ఏదైనా చెప్పు అని అడిగాడు. అప్పుడా గుహుడు ” రాముడు ఇక్కడికి వచ్చి ఇంగుది వృక్షం కింద కూర్చున్నాడు. అప్పుడు నేను ఆయనకి అన్నము, కందమూలాలు, తేనె మొదలైనవి తీసుకువెళ్ళాను, అప్పుడు రాముడు ‘ నేను క్షత్రియుడిని, ఒకరికి మేము ఇవ్వాలి, ఇతరుల దెగ్గర మేము తీసుకోకూడదు, మా తండ్రిగారికి ఇష్టమైన ఆ గుర్రాలకి కొంచెం దాణ పెట్టు. ఆ గంగ నుంచి కొన్ని నీళ్ళు తీసుకురా, అవి తాగి పడుకుంటానయ్యా ‘ అన్నాడు. అప్పుడు నేను గంగ నుంచి కొన్ని నీళ్ళు తీసుకువచ్చి వాళ్ళకి ఇచ్చాను. సీతారాములు తాగగా మిగిలిన నీళ్ళని లక్ష్మణుడు కళ్ళకి అద్దుకొని తాగాడు. అప్పుడు నేను రాముడిని లోపల హంసతూలికా తల్పం మీద పడుకోమనగా, ఆయన, నేను ఇప్పుడు ఒక తాపసిలాగ బతకాలి అని చెప్పి, లక్ష్మణుడు తీసుకొచ్చిన దర్భగడ్డి మీద పడుకున్నాడు. రాముడు పడుకోయేముందు, లక్ష్మణుడు సీతారాముల పాదములు కడిగి, తడిగుడ్డతో తుడిచాడు. అప్పుడు సీతమ్మ రాముడి భుజాన్ని తలగడగా చేసుకొని పడుకుంది. నేను కాపలా కాస్తాను నువ్వు పడుకో లక్ష్మణా అంటె, ఆయన నన్ను, ఎలా పడుకోమంటావు గుహా ఇంత దారుణమైన దృశ్యం చూశాక, అని నీ తమ్ముడు లక్ష్మణుడు ఏడిచాడయ్యా. ఇదుగో ఈ గడ్డి మీదే సీతారాములు పడుకున్నారు ” అని గుహుడు సీతారాములు పడుకున్న గడ్డిని భరతుడికి చూపించాడు.
అప్పుడు భరతుడు, సీతారాములు పడుకున్న ఆ గడ్డి దెగ్గరికి వెళ్ళి చూడగా, ఒకవైపు గట్టిగా ఒత్తుకొని, గడ్డి భూమిలోకి నొక్కుకొని ఉంది. ఇది రాముడు పడుకున్న చోటని భరతుడు గ్రహించాడు.
మన్యే సాభరణా సుప్తా సీతా అస్మిన్ శయనే తదా |
తత్ర తత్ర హి దృశ్యంతే సక్తాః కనక బిందవః ||
అలాగే, సీతమ్మ పడుకున్న వైపు బంగారు రవ్వలు పడిఉన్నాయి. సీతమ్మ కట్టుకున్న పట్టుచీర కొంగు యొక్క దారములు ఆ గడ్డికి చుట్టుకొని ఉన్నాయి. ఎక్కడో రాజభవానాల్లో పడుకోవలసిన సీతారాములు, ఇంతమంది ఆటవికులు చూస్తుండగా గడ్డి మీద పడుకోవలసి వచ్చిందని, దీనికంతటికి తనే కారణమని భరతుడు నేలమీద పడి మూర్చపోయాడు.