వాల్మీకి రామాయణం 88 వ భాగం, అయోధ్య కాండ
Posted by adminMar 29
వాల్మీకి రామాయణం 88 వ భాగం, అయోధ్య కాండ
ఆహ్వయె విష్వ కర్మాణం అహం త్వష్టారం ఎవ చ |
ఆతిథ్యం కర్తుం ఇగ్చ్ఛామి తత్ర మె సంవిధీయతాం ||
ఆహ్వయె దెవ గంధర్వాన్ విష్వా వసు హహా హుహూన్ |
తథైవ అప్సరసొ దెవీర్ గంధర్వీహ్ చ అపి సర్వషహ్ ||
ఇహ మె భగవాన్ సొమొ విధత్తాం అన్నం ఉత్తమం |
భక్ష్యం భొజ్యం చ చొష్యం చ లెహ్యం చ వివిధం బహు ||
తత్ర రాజ ఆసనం దివ్యం వ్యజనం చత్రం ఎవ చ | భరతొ మంత్రిభిహ్ సార్ధం అభ్యవర్తత రాజవత్ ||
అప్పుడా భారద్వాజ మహర్షి ఆచమనం చేసి విశ్వకర్మని, త్వష్టని ప్రార్ధన చేసి ” ఇక్కడికి రాజకుమారులైన భరత శత్రుఘ్నులు వచ్చారు, వారి వెనకాల సేనాబలం వచ్చింది. పురోహితులు, మహర్షులు వచ్చారు. వీళ్ళల్లో ఎవరెవరు ఎటువంటి భవనములలో నివసిస్తారో అటువంటి భవనములను ఓ విశ్వకర్మ! నువ్వు నిర్మించెదవుగాక.” ( రాజులు నివసించేవాటిని హర్మ్యములు, బాగా డబ్బున్నవాళ్ళు ఉండేవాటిని ప్రాసాదములు అని అంటారు)
విశ్వకర్మ ఉత్తరక్షణంలో ఎవరికి కావలసిన భవనాన్ని వాళ్ళకి నిర్మించాడు .
తరవాత ఆయన కుబేరుడిని, బ్రహ్మగారిని ప్రార్ధన చేసి ” కుబేరా! నీ దెగ్గర ఉన్న వేలమంది అప్సరసలని పంపించు, ఓ బ్రహ్మదేవ!, నీ దెగ్గర ఉన్న అప్సరసలని కూడా పంపించాలి, వారితో పాటుగా నారదుడు, తుంబురుడు, హుహు అనే దేవగాయకులు రావాలి. అలాగే ఇక్కడ పాయసం ఏరులై ప్రవహించాలి. పులియ పెట్టిన పళ్ళనుంచి, పిండి నుంచి, బెల్లం నుంచి పుట్టిన కల్లు(సుర) ఇక్కడ నదులుగా ప్రవహించాలి. ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు తినడానికి కావలసిన ఆహారం గుట్టలు గుట్టలుగా పడిపోవాలి, పర్వతాలలా అన్నపురాసులు ఏర్పడాలి, వాటితో పాటు కూరలు, పచ్చళ్ళు, పులుసులు కావాలి. ఇవన్నీ తిన్నాక జీర్ణం అవ్వడానికి సొంఠి, లవంగం, ఇంగువ కలిగిన యవ్వనపు పెరుగు కావాలి. ఆకలి పుట్టించడానికి కొంచెం పుల్లగా ఉన్న పెరుగు కావాలి. అన్నంలో కలుపుకోడానికి కమ్మగా ఉన్న పెరుగు పుట్టాలి .
వీటితో పాటు అందరూ మొహం కడుక్కోవడానికి చూర్ణములు( powder & paste ) కావాలి, వంటికి, జుట్టుకి రాసుకునే ఆమలకం( ఉసిరికాయలతో చేసిన ముద్ద ), సున్నిపిండి, నూనె మొదలైనవి మంచి మంచి బంగారు పాత్రలలో కావాలి. కొన్ని వేల మంది అప్సరసలు వచ్చి, ఒక్కొక్క సైనికుడిని పీఠం మీద కూర్చోబెట్టి ఒళ్ళంతా నూనె రాసి, నలుగు పెట్టి స్నానం చేయించాలి. ఇక్కడున్న వాళ్ళలో బాగా గెడ్డాలు పెంచుకున్న ఋషులు, బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళు గెడ్డం దువ్వుకోడానికి మంచి దువ్వెనలు రావాలి. వీళ్ళు ఇవన్నీ తిన్నాక ఇంకా తినాలనిపిస్తే, తొందరగా జీర్ణం అవ్వడానికి ఔషదాలు కావాలి, అందుకని ఓ సోముడా!, చంద్రుడా! మీరు ఇవి సిద్ధం చెయ్యండి.
అప్సరసలు నాట్యం చెయ్యాలి, ఇప్పటికిప్పుడు ఇక్కడ పెద్ద పళ్ళతో వెలగ చెట్లు, పనస చెట్లు పుట్టాలి, ఎక్కడెక్కడినుంచో చిలుకలు రావాలి. కుబేరుడి రథమైన చైత్రరథం రావాలి, మామిడి చెట్లు పుట్టాలి, కుంకుడు చెట్లు పుట్టాలి, వీటితో పాటు ఎవరికి ఎంత వేడి కావాలో, అంత వేడితో నీళ్ళు పుట్టాలి, అందరికి కట్టుకోవడానికి బట్టలు, తొడుక్కోవడానికి చెప్పులు కావాలి. భరతుడి కోసం ఒక బ్రహ్మాండమైన హర్మ్యం ఏర్పడాలి ” అని ప్రార్ధించాడు.