వాల్మీకి రామాయణం 92 వ భాగం, అయోధ్య కాండ
Posted by adminApr 2
వాల్మీకి రామాయణం 92 వ భాగం, అయోధ్య కాండ
లక్ష్మణుడి మాటలను విన్న రాముడు ” లక్ష్మణా! ఎందుకు తీసుకురావాలి ధనస్సు. వాటితో భరతుడిని సంహరించాల? తండ్రిగారి కోరిక ప్రకారం నేను అరణ్యాలకి వచ్చాను, నన్ను చూడడానికి భరతుడు వస్తున్నాడు. ఇప్పుడు నేను భరతుడికి ఎదురెళ్ళి యుద్ధం చెయ్యనా?
ధర్మమర్థం చ కామం చ పృ్ఇథివీం చాపి లక్శణ |
ఇచ్చ్హామి భవతామర్థె ఎతత్ ప్రతిషృ్ఇణొమి తె ||
ధర్మము కాని, అర్థము కాని, కామము(కామము అనగా కోరిక) కాని, ఈ మూడిటిలో నేను ఏ ఒక్కదాన్ని అనుభవించాల్సి వచ్చినా, నా తోడపుట్టిన మిగిలిన తమ్ముళ్ళు అనుభవించని దానిని నేను అనుభవించను. వాళ్ళు ఆనందంగా ఉంటె, నేను ఆనందంగా ఉంటాను. అసలు ఎప్పుడైనా భరతుడు నీ పట్ల అపచారంతో, నువ్వు బాధ పడేటట్టు ప్రవర్తించాడ? మరి నీకు భరతుడి మీద ఎందుకు అనుమానము ” అని రాముడు చెప్పినా కాని, లక్ష్మణుడు ఆ చెట్టు మీద కూర్చుని భరతుడి మీద కోపంతో బుసలు కొడుతూ ఉండేసరికి ” నీకు రాజ్యం చెయ్యాలని ఉందేమో, నేను భరతుడితో చెప్పి రాజ్యాన్ని నీకు ఇమ్మంటాను, భరతుడు ఎటువంటి వాడో చూద్దువు కాని ” అని రాముడు అన్నాడు.
ఈ మాటలకి సిగ్గుపడిన లక్ష్మణుడు ” అన్నయ్యా! నిన్ను చూడడానికి దశరథ మహారాజు గారు వచ్చారేమో. వదిన ఇక్కడ అరణ్యాలలో బాధపడుతుందని, తనని తీసుకెళ్ళడానికి నాన్నగారు వచ్చుంటారు ” అన్నాడు.
అప్పటిదాకా కూర్చొని ఉన్న రాముడు ఒకసారి పైకిలేచి ఆ సైన్యం వైపు చూసి ” నాన్నగారు అధిరోహించేటటువంటి శత్రుంజయం అనే భద్రగజం కనిపిస్తుంది, ఆ భద్రగజం మీద తెల్లటి గొడుగు నీడలో నాన్నగారు వస్తుంటారు, కాని ఇవ్వాళ ఆ గజం మీద తెల్లటి గొడుగు నాకు కనపడడం లేదు లక్ష్మణా, నా మనసు ఏదో శంకింస్తుంది ” అన్నాడు.
ఇంతలో భరతుడు ” ఏనాడు నేను సీతమ్మ పక్కన కూర్చున్న లక్ష్మణ సహితుడైన రాముడిని చూస్తానో, ఆనాటి వరకు నా మనస్సుకి శాంతి లేదు. ఏనాడైతే నేను సీతారాముల పాదములను నా తల మీద పెట్టుకుంటానో, అప్పుడు నా తల మీద పడినటువంటి వారి పద రజస్సు వలన నాకు శాంతి కలుగుతుంది. ఏనాడైతే సీతారాములు బంగారు ఆసనం మీద కూర్చొని ఉంటారో, ఏనాడైతే రాముడికి పట్టాభిషేకం జెరుగుతుందో ఆనాటిదాకా నా మనస్సుకి శాంతి లేదు ” అని అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు.