వాల్మీకి రామాయణం 97 వ భాగం, అయోధ్య కాండ
Posted by adminApr 7
వాల్మీకి రామాయణం 97 వ భాగం, అయోధ్య కాండ
అప్పుడు రాముడు ” ఒక మహాసముద్రంలో రెండు పుల్లలు కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి. అవి కొంత కాలం కలిసి నీళల్లో తేలుతూ వెళతాయి. అవే పుల్లలు ఆ ప్రవాహంలో ఏదో ఒక రోజు విడిపోక తప్పదు. మన జీవితాలు కూడా అంతే. మనం ఎందులోనుంచి ఒకడిగా వచ్చామో, మళ్ళి అందులోకి ఒక్కడిగానే వెళ్ళిపోతాము. తోడుగా వచ్చేవాళ్ళు ఎవరూ ఉండరు. ఇది తెలుసు కాబట్టే దశరథ మహారాజు యజ్ఞయాగాది క్రతువులు చేసి vపుణ్యాన్ని మూటకట్టుకొని స్వర్గానికి వెళ్ళిపోయారు. తండ్రిగారు ఒక మాట చెప్పి వెళ్ళిపోయారు, దాని ప్రకారం ఈ రాజ్యాన్ని నువ్వు తీసుకోవాలి ” అన్నాడు.
అప్పుడు భరతుడు ” అన్నయ్యా! నేను నా తల్లిని చంపుదాము అని అనుకున్నాను. అమ్మని చంపితే నువ్వు నాతో మాట్లాడవని నేను చంపలేదు. సభాముఖంగా నాన్నగారిని నేను ఎప్పుడూ నిందించలేదు. మరణకాలం దెగ్గర పడిపోతుంటే బుద్ధి విపరీతత్వాన్ని పొందుతుంది, బహుశా దశరథ మహారాజుకి కూడా అలా విపరీత బుద్ధి పుట్టడం వల్ల ఆయన ఒక పొరపాటు పని చేశారు. ఇక్ష్వాకు వంశం యొక్క సంప్రదాయం ప్రకారం పెద్దవాడు పరిపాలించవలసిన రాజ్యాన్ని ధర్మం తప్పి నాకు ఇచ్చారు. ఒకవేళ తండ్రిగారు ఏదన్నా చెయ్యరాని పని చేస్తే, కుమారుడు దానిని దిద్దాలి. అందుకని నువ్వు ఆ పొరపాటుని దిద్దాలి. అలాగే క్షత్రియుడికి రాజ్యపాలనం చెయ్యవలసిన ధర్మం ఉంది, కాని నువ్వు రాజ్యపాలనం మానేసి తాపసి వృత్తిని అవలంబించావు ” అన్నాడు.
రామభరతుల మధ్య జెరుగుతున్న ఈ ధర్మ సంభాషణని వినడానికి దేవతలు, మహర్షులు మొదలైన వారు వచ్చి నిలబడ్డారు.
ఈ మాటలు విన్న రాముడు ” దశరథ మహారాజు కైకేయని వివాహం చేసుకునే ముందు, మీ తాతగారైన కైకేయ రాజుకి ఒక మాట ఇచ్చారు. కైకేయ కడుపున ఎవరు పుడతారో వాళ్ళకి రాజ్యం ఇస్తానని నాన్నగారు ప్రమాణం చేశారు. ఈ విషయం వశిష్ఠుడికి, సుమంత్రుడికి తెలుసు. ఈ విషయం తెలిసిన కైకేయ రాజు, వశిష్ఠుడు, సుమంత్రుడు ఊరుకున్నారు. మీ అమ్మ రెండు వరాలు అడిగింది, మళ్ళి ఆ రెండు వారాలకి దశరథుడు బద్ధుడయ్యాడు. అందుకని ఎటునుంచి చూసినా రాజ్యం నీకే వస్తుంది, తండ్రిగారు చేసిన దానిలో పొరపాటు ఉంటె నేను దిద్దాలి, కాని అందులో పొరపాటు లేదు. మనం పుట్టక ముందే నాన్నగారు రాజ్యాన్ని నీకు ఇచ్చారు. కనుక నువ్వు రాజ్యాన్ని తీసుకోవాలి.
త్వం రాజా భవ భరత స్వయం నరాణాం |
వన్యానాం అహం అపి రాజ రాణ్ మృ్ఇగాణాం ||
నువ్వు అయోధ్యా పట్టణానికి వెళ్ళిపో, నరులకందరికి నువ్వు రాజుగా ఉండి శ్వేత ఛత్రం కింద కూర్చొని పరిపాలన చెయ్యి. నేను అరణ్యాలకి వెళ్ళి చెట్టుకింద కూర్చొని మృగాలని నేను పరిపాలిస్తాను. అందుకని, భరత నువ్వు వెళ్ళిపో ” అన్నాడు.