వాల్మీకి రామాయణం 99 వ భాగం, అయోధ్య కాండ
Posted by adminApr 9
వాల్మీకి రామాయణం 99 వ భాగం, అయోధ్య కాండ
అప్పుడు వశిష్ఠుడు వచ్చి, బ్రహ్మగారి నుంచి ఇక్ష్వాకు వంశం ఎలా ఏర్పడిందో చెప్పి ” ఈ వంశంలో ఎప్పుడూ పెద్దవాడే రాజవుతున్నాడు. తండ్రి మాటని విని నేను అరణ్యాలకి వచ్చానంటున్నావు, తండ్రి సర్వకాలముల యందు పూజనీయుడు. తండ్రి ఎలా గొప్పవాడో, తల్లి కూడా అలా గొప్పది. ఇప్పుడు నీ ముగ్గురు తల్లులు వచ్చి నిన్ను వెనక్కి రమ్మంటున్నారు. తండ్రి వీర్యప్రదాత, తల్లి క్షేత్రాన్ని ఇస్తుంది. పిల్లవాడు బయటకి వచ్చాక తల్లిదండ్రులు ఇద్దరూ పెంచుతారు. కాని మళ్ళి ఈ శరీరంలోకి రాకుండా జ్ఞానం ఇచ్చేవాడు గురువు మాత్రమే. నేను నీకు, నీ తండ్రికి కూడా గురువుని. నేను చెప్తున్నాను, నువ్వు అరణ్యమునుంచి వెనక్కి వచ్చి రాజ్యాన్ని తీసుకుంటే ధర్మము తప్పిన వాడివి అవ్వవు, అందుకని వెనక్కి వచ్చి రాజ్యాన్ని తీసుకో ” అన్నాడు.
అప్పుడు రాముడు ” మా తండ్రిగారు నాతో ఒక మాట అన్నారు. రామ! నీ మీద నాకు నమ్మకం ఉంది, నేను కైకకి ఇచ్చిన వరం నిజం అవ్వడం నీ చేతిలో ఉందని చెప్పారు. అందుకని నేను అరణ్యవాసానికి వచ్చాను. మీరు అన్నట్టు, నేను వెనక్కి రావడం ధర్మంలో ఒక భాగం కావచ్చు. కాని, నేను ఇచ్చిన వరం ఎందుకూ పనికిరాకుండా పోయందని నా తండ్రిగారు బాధ పడడం నాకు ఇష్టం లేదు. అమ్మ శరీరంలోకి తండ్రి ప్రవేశపెట్టిన తేజస్సు వలన కదా శిశువు అనే వాడు బయటకి వచ్చేది, ఆ శిశువు పెరిగాక గురువు జ్ఞానం బోధిస్తాడు. ఆ శిశువు అనే వాడు రావడానికి మూలం తండ్రి. కావున ఆ తండ్రి మాట చెడిపోకూడదు, అందుకని నేను నా తండ్రి మాటని అతిక్రమించాలేను ” అన్నాడు.
అప్పుడు భరతుడు సుమంత్రుడిని పిలిచి ” దర్భలు తీసుకొచ్చి ఇక్కడ పరవండి, నేను ముఖం మీద బట్ట వేసుకొని, ఏది చూడకుండా, రాముడికి ఎదురుగా కూర్చుంటాను ” అన్నాడు (పూర్వకాలంలో రాజు తప్పుచేస్తే, ధర్మం తప్పితే, బ్రాహ్మణులు ఇలా ముఖం మీద గుడ్డ వేసుకొని రాజుకి ఎదురుగా కూర్చునేవారు, రాజుకి తన తప్పుని తెలియచెయ్యడం కోసమని). అప్పుడు వెంటనే సుమంత్రుడు దర్భలని పరిచేశాడు, వాటి మీద భరతుడు ముఖం మీద బట్ట వేసుకొని కూర్చున్నాడు.
” నువ్వు నన్ను ఇలా నిర్బందించచ్చా భరతా, నేను ఏ తప్పు చేసానని నువ్వు ఇలా దర్భల మీద కూర్చున్నావు. ఇలా బ్రాహ్మణుడు కూర్చుంటాడు, నువ్వు బ్రాహ్మణుడివి కాదు, క్షత్రియుడవి. క్షత్రియుడవైన నువ్వు ఇలా కూర్చోవడం నీ మొదటి తప్పు. నా యందు ఏ తప్పు లేకపోయినా నువ్వు ఇలా కూర్చోవడం నీ రెండవ తప్పు. కాబట్టి నువ్వు చేసిన ఈ దోషముల యొక్క పరిష్కారానికి లేచి ఆచమనం చెయ్యి, అలాగే ఒక ధార్మికుడిని ముట్టుకో ” అన్నాడు రాముడు.