Archive for January, 2018

వాల్మీకి రామాయణం 11 వ భాగం, బాలకాండ

మరుసటి రోజున రాముడు విశ్వామిత్రుడితొ……. మీరు నాకు ఇన్ని అస్త్రాలని ఉపదేశించారు, అలాగే వాటి ఉపసంహారాన్ని కూడా ఉపదేశించమన్నాడు. విశ్వామిత్రుడు రాముడికి ఉపసంహార మంత్రాలని చెప్పాక ఇంకొన్ని అస్త్రాలని కూడా ఉపదేశించాడు. అలా అన్ని అస్త్రాల ఉపదేశం అయ్యాక వాళ్ళు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. అలా వెళుతుండగా అక్కడొక ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమం ఎవరిదని రాముడు అడగగా, విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు ” ఒకప్పుడు విరోచనుడి కుమారుడైన బలి చక్రవర్తి తన ప్రరాక్రంతొ ఇంద్రుడిని నిర్బంధించాడు. అప్పుడు శ్రీమహా విష్ణువు వామన మూర్తిగా వచ్చి బలిని పాతాళానికి పంపారు. ఆ వామన మూర్తి తపస్సు చేసిన ఆశ్రమమే ఈ ఆశ్రమం, దీనిని సిద్ధాశ్రమం అంటారు. ఇక్కడే కశ్యప ప్రజాపతి తపస్సు చేశారు, ఇక్కడే విష్ణువు ఇంద్రుడికి తమ్ముడిగా, ఉపేంద్రుడిగా పుట్టారు. నేను యాగం చేస్తున్నది కూడా ఈ ఆశ్రమంలోనే ” అని చెప్పి అందరూ ఆ ఆశ్రమంలోకి వెళ్లారు.

ఆ సిద్ధాశ్రమంలొ యాగం ప్రారంభించారు, ఈ యాగం 6 రాత్రుళ్ళు 6 పగళ్ళు జెరుగుతుంది, కాబట్టి నువ్వు అన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి విశ్వామిత్రుడు మౌన దీక్షలోకి వెళ్ళిపోయాడు. 5 రోజులు యాగం చక్కగా జెరిగింది, 6 వ రోజున ఆ అగ్నిహొత్రం ఒక్కసారి భగ్గున పైకిలేచింది. వెంటనే రాముడు లక్ష్మణుడిని అప్రమత్తంగా ఉండమన్నాడు. అప్పుడే పైనుండి మారీచ సుబాహువులు కొన్ని వేల రాక్షసులతో వచ్చి ఆ అగ్నిహొత్రంలోకి రక్తం పోశారు. వెంటనే రాముడు మానవాస్త్రంతొ మారీచుడిని కొట్టాడు, ఆ దెబ్బకి వాడు 100 యోజనాల దూరం వెళ్లి పడ్డాడు. సుబాహువుడిని ఆగ్నేయాస్త్రం పెట్టి కొడితె, వాడు గుండెలు బద్దలై, నెత్తురు కక్కుతూ కిందపడి మరణించాడు. మిగతా రాక్షసులందరిని వాయువ్యాస్త్రంతో నిర్జించారు. యాగం పూర్తయ్యాక విశ్వామిత్రుడు లేచి రాముడిని ఆలింగనం చేసుకున్నాడు. ఆ రాత్రి అందరూ హాయిగా పడుకున్నారు.


మిథిలా నగరంలొ జనక మహారాజు ఒక గొప్ప యాగం చేస్తున్నారు, కావున మీరు కూడా నాతో ఆ నగరానికి రండి, అక్కడ చూడవలసినవి రెండు ఉన్నాయి అని విశ్వామిత్రుడు రాముడితొ చెప్పాడు. అందరూ ఆ మిథిలా నగరానికి బయలుదేరారు.

వాల్మీకి రామాయణం 10 వ భాగం, బాలకాండ

అలా వాళ్ళు వెళుతుంటె అక్కడున్న అరణ్యంలొ ఈల పక్షులు భయంకరమైన శబ్దాలు చేస్తున్నాయి, పులులు, సింహాలు, ఏనుగులు తిరుగుతున్నాయి. ఈ అరణ్యం ఇంత భయంకరంగా ఎందుకుందని రామలక్ష్మణులు విశ్వామిత్రుడిని అడగగా, ఆయన ఇలా చెప్పారు ” పూర్వము ఇక్కడ మలదము, కరూషము
అని రెండు జనపదాలు ఉండేవి. ఎంతో సంతోషంగా ఉండాల్సిన ఈ రెండు పట్టణాలు ఇవాళ అలా లేవు. దీనికంతటికి కారణం తాటక అనే ఒక స్త్రీ, ఆమె ఒక యక్ష కాంత, రాక్షసిగా మారి ఇక్కడున్న జానపదులందరినీ హింసించేది, అందుకనే ఇక్కడ ఎవరూ లేరు” అన్నాడు . అప్పుడు రాముడు, అసలు ఈ నగరాలు ఎలా ఏర్పడ్డాయి అని అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు ” ఒకప్పుడు ఇంద్రుడు వృత్తాసురుడనే రాక్షసుడిని సంహరించాడు, వృత్తాసురుడు బ్రాహ్మణుడు కావడం వల్ల ఆయనని చంపినందుకు ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం వచ్చింది. ఆ బ్రహ్మహత్యా పాతకం వల్ల ఇంద్రుడికి రెండు లక్షణాలు వచ్చాయి, ఆయనకి శరీరంలొ మలం పుట్టడం ప్రారంభమయ్యింది, అలాగె ఆకలి కూడా కలిగింది. అప్పుడు ఆయన ఋషులని ఆశ్రయిస్తే వాళ్ళు ఆ రెండు లక్షణాలని తొలగించారు. కాని ఆ రెండు భూమి మీద పడ్డాయి. అవి పడ్డ ప్రదేశాలని మలదము, కరూషము అనే రెండు జానపదములుగా వర్ధిల్లుతాయి, ఇక్కడున్న ప్రజలు సుఖసంతోషాలతొ ఆనందంగా ఉంటారని ఇంద్రుడు వరం ఇచ్చాడు.

అలాగే పూర్వ కాలంలొ సుకేతు అనే యక్షుడికి పిల్లలు లేకపోతె బ్రహ్మ గూర్చి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నేను నీకు కొడుకులని ఇవ్వను, ఒక కూతురుని ఇస్తాను, ఆమె కామరూపి, మహా అందగత్తె, ఆమెకి 1000 ఏనుగుల బలముంటుంది అని వరం ఇచ్చాడు. ఆమె పేరు తాటక. ఆమెకి యవ్వనం వచ్చాక సుందుడుకి ఇచ్చి వివాహం చేశారు. వాళ్ళకి మారీచుడు జన్మించాడు. 1000 ఏనుగుల బలం ఉండడం వలన, గర్వంతొ, అరణ్యంలొ ఇష్టమొచ్చినట్టు  తిరిగేవాళ్ళు. ఒకనాడు సుందుడు అగస్త్య మహర్షి మీద దాడికి దిగాడు. ఆయనకి ఆగ్రహం వచ్చి సుందుడిని సంహరించారు. ఇది గమనించిన తాటక తన కుమారుడితొ కలిసి అగస్త్య మహర్షి మీదకి వచ్చింది, అప్పుడాయన తాటకని, ‘ నీకు వికృతరూపంవచ్చుగాక ‘ అని, మారీచుడిని ‘ ఇవ్వాల్టినుంచి రాక్షసుడివి అవుతావని ‘ శపించారు. ఆ తాటక ఈ రెండు నగరాల్లో సంచరిస్తుంది, ఆమె నరమాంస భక్షనకి అలవాటుపడింది, అందుకే ఈ నగరాలలోని జనాలు ఊరు వదిలి వెళ్ళిపోయారు. కాబట్టి రామ, నువ్వు ఇప్పుడు ఆ తాటకని సంహరించాలి. నువ్వు చేసే పని దోషమే అయినా, ప్రజాకంటకులైన వాళ్ళని రాజు సంహరించి తీరాలి. పూర్వకాలంలొ మందర అనేటువంటి ఒక స్త్రీ భూమిని సంహరించడానికి ప్రయత్నిస్తే ఆమెని సంహరించారు, అలాగే భృగు మహర్షి భార్య ఇంద్రుడిని సంహరించడం కోసం తపస్సు ప్రారంభిస్తే శ్రీమహా విష్ణువు ఆమెని సంహరించారు. నువ్వు కూడా ఈ తాటకని సంహరించు ” అని విశ్వామిత్రుడు అన్నాడు.

అప్పుడు రాముడు…….
పితుర్ వచన నిర్దేశాత్ పితుర్ వచన గౌరవాత్ |
వచనం కౌశికస్య ఇతి కర్తవ్యం అవిశఙ్కయా ||
గో బ్రాహ్మణ హితార్థాయ దేశస్య చ హితాయ చ |
తవ చైవ అప్రమేయస్య వచనం కర్తుం ఉద్యతః ||

“మా తండ్రిగారు మీరు ఏది చెయ్యమంటె అది చెయ్యమన్నారు, గురువుగారైన మీరు చెప్పారు కనుక లోకాన్ని రక్షించడం కోసం, బ్రాహ్మణులను, గోవులను, ఇక్కడ ఉంటున్న అన్ని ప్రాణులను కాపాడడం కోసం సుక్షత్రియుడనైన నేను తాటకని తప్పక సంహరిస్తాను” అని రాముడు అని తన ధనుస్సు తీసుకొని ధనుష్టంకారం చేశాడు, ఆ ధ్వని విన్న తాటక అది ఎటువైపు నుంచి వస్తుందొ అటు వైపు బయలుదేరింది. తాటక రామలక్ష్మణులున్న ప్రదేశానికి వచ్చింది. తాటకని చూసిన రాముడు లక్ష్మణుడితొ, ఈ తాటకని ఓ మోస్తారు వాళ్ళు చూస్తే గుండె ఆగి చనిపోతారు లక్ష్మణా ” అన్నాడు.

ఆ తాటక ముందు బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడి మీదకి దూకింది, అప్పుడాయన ఒక హుంకారం చేసేసరికి అది స్తంభించిపోయి ఉన్న చోట నిలబడిపోయింది, వెంటనే తన మాయతొ రాళ్ల వర్షం కురిపించింది, ఆ తాటక రేపిన ధూళి అందరి కళ్ళల్లో పడింది. అప్పుడు విశ్వామిత్రుడు రాముడితొ ఇంక ఉపేక్షించి లాభం లేదు, తొందరగా ఆమెని సంహరించు అన్నాడు. ఎంతైనా ఆడది కదా, ముందు దీని గమన శక్తిని కొట్టేద్దాము, అప్పుడన్నా మారుతుందేమో చూద్దాము అని రాముడు కాళ్ళు, చేతులు, లక్ష్మణుడు ముక్కు, చెవులు నరికారు. అప్పుడు ఆ తాటక మాయారూపం పొంది మాయం అయిపోయింది. అదృశ్యమైన ఆ తాటక భారి శరీరంతొ రాముడి మీద పడబోతుంటే, రాముడు ఒక బాణం ప్రయోగించి ఆ తాటకని సంహరించగా, దాని రక్తం ఏరులై ప్రవహించింది. పైనుండి దేవతలు చూసి, హమ్మయ్య! తాటక సంహరింపబడింది అని ఆనందపడ్డారు. వెంటనే ఆ దేవతలు విశ్వామిత్రుడి దెగ్గరకి వచ్చి, ఇంత ధైర్యం ఉన్న వాడి దెగ్గర అన్ని అస్త్ర-శస్త్రాలు ఉండాలి, కాబట్టి నీకు తెలిసిన ధనుర్విద్యనంతా రామలక్ష్మణులకి ఉపదేశించు అన్నారు.

అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి హయశిరోనామం అనే అస్త్రాన్ని,  క్రౌంచ అస్త్రాన్ని మంత్రోపదేశం చేశాడు. అలాగే కంకాళం, ఘోరం, కాపాలం, కంకణం అనే నాలుగు ముసలముల వ మంత్రోపదేశం చేశాడు. అలాగే ఐంద్రాస్త్రం, బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరోనామకాస్త్రం, మానవాస్త్రం, వారుణాస్త్రం, ఇంద్రాస్త్రం, ఐషీకాస్త్రం, గాంధర్వాస్త్రం, నారాయణాస్త్రం, రకరకాల పిడుగులు మొదలైన సర్వాస్త్రాల మంత్రోపదేశం చేసి, రెండు అద్భుతమైన గధలని, నందనం అనే గొప్ప ఖడ్గాన్ని ఉపదేశించాడు. అప్పుడు ఈ అస్త్రాలన్నీ పురుష రూపం దాల్చి రాముడి పక్కన నిలబడి, మేము మీ కింకరులము, మమ్మల్ని ఏమి చెయ్యమంటారు అని అడిగాయి. మీరందరూ నా మనస్సులోకి వెళ్లి అక్కడ తిరుగాడుతూ ఉండండి, నేను పిలిచినప్పుడు బయటకి రండి అని ఆదేశించాడు. అవి అలాగే రాముడిలోకి ప్రవేశించాయి.

వాల్మీకి రామాయణం 9 వ భాగం, బాలకాండ

విశ్వామిత్రుడి వెనక రాముడు, లక్ష్మణుడు కోదండాలు పట్టుకుని వెళుతున్నారు. బ్రహ్మగారు అశ్విని దేవతలతొ వెళితె ఎలా ఉంటుందొ, స్థాణువైన శివుడి వెనకాల విశాఖుడు, స్కందుడు వెళితె ఎలా ఉంటుందొ, అలా విశ్వామిత్రుడి వెనకాల రామలక్ష్మణులు వెళుతున్నారని వాల్మీకి పోల్చారు. వాళ్ళు అలా సరయు నది దక్షిణ తీరంలొ కాలినడకన ఒకటిన్నర యోజనాలు ప్రయాణించాక చీకటి పడడం వల్ల ఒక ప్రాంతంలొ విశ్రమించారు.

అప్పుడు  విశ్వామిత్రుడు……
గృహాణ వత్స సలిలం మా భూత్ కాలస్య పర్యయః ||
మంత్ర గ్రామం గృహాణ త్వం బలాం అతిబలాం తథా ||

బ్రహ్మ దేవుని కుమార్తెలైన బల, అతిబల అనే రెండు మంత్రాలని రాముడికి ఉపదేశించాడు. ఈ రెండు విద్యల వల్ల ఆకలి వెయ్యదు, దప్పిక కలగదు, నువ్వు నిద్రపోతునప్పుడు కాని నిద్రపోనప్పుడు కాని రాక్షసులు నిన్ను ఏమి చెయ్యలేరు, దీనితో పాటు నీకు సమయస్పూర్తి, జ్ఞాపక శక్తి, బుద్ధి ప్రకాశిస్తాయి అని చెప్పి ఆ మంత్రోపదేశం చేశాడు. తరవాత రాముడు లక్ష్మణుడికి ఆ మంత్రాలని ఉపదేశించాడు. దర్భగడ్డి పరిచి ఇద్దరినీ దాని మీద పడుకోమన్నాడు. ఇద్దరు హాయిగా పడుకున్నారు.

విశ్వామిత్రుడు తెల్లవారగానే లేచి సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకొని పిల్లలిద్దరి దెగ్గరికి వచ్చి చూశాడు. వాళ్ళు నిద్రపోతున్నారు. ఆహా! ఏమి నా అదృష్టం అనుకొని……
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే |
ఉత్తిష్ఠ నర శార్దూల కర్తవ్యం దైవమాహ్నికం ||

కౌసల్య యొక్క కుమారుడైన రామ, తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తున్నాడు కనుక నువ్వు నిద్రలేచి ప్రొద్దున్న చేసే పూర్వ సంధ్యా వందనం చెయ్యాలి. రాక్షసులను సంహరించె నువ్వు నరులలొ శార్దూలం వంటివాడివి, దైవీ సంబంధమైన ఆహ్నికములను నెరవేర్చడానికి శుభప్రదమైన సమయం మించిపోకూడదు, అందుకని రామా నిద్రలే.

రామలక్ష్మణులిద్దరూ నిద్ర లేచి చెయ్యవలసిన కార్యక్రమాలు పూర్తి చేశారు. మళ్ళి బయలుదేరి గంగ-సరయు సంగమ స్థానం దాక వెళ్లారు. అక్కడ ఒక ఆశ్రమాన్ని చూసి, అది ఎవరిదని రాముడు అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు ” ఒకానొకప్పుడు పరమశివుడు ఇక్కడ తపస్సు చేస్తుండగా మన్మధుడు బాణ ప్రయోగం కచెయ్యబోతే, శివుడు తన మూడవ కంటితొ మన్మధుడిని భస్మం చేసిన ప్రదేశం ఇదే, మన్మధుడి అంగములన్ని కాలి బూడిదైన ఈ ప్రాంతాన్ని అంగదేశం అని పిలుస్తారు. ఆనాడు శంకరుడు తపస్సు చేసినప్పుడు ఆయనకి కొంతమంది శిష్యులున్నారు. శంకరుడితో ప్రత్యక్ష శిష్యరికం చేసినవాళ్ళ దెగ్గరినుంచి ఈనాటి వరకు ఉన్న వీళ్ళందరూ పాపము లేనివాళ్ళు. కాబట్టి రామ ఈ రాత్రికి వీళ్ళందరితో కలిసి పడుకొ ” అని చెప్పాడు.

మరుసటి రోజున ఆ ఆశ్రమంలొ ఉన్న మహర్షులు గంగా నదిని దాటడానికి విశ్వామిత్ర రామలక్ష్మనులకి పడవ ఏర్పాటు చేశారు. ముగ్గురూ ఆ పడవలొ ప్రయాణమయ్యారు. ఆ పడవ గంగా నదిలొ వెళుతుండగా ఒక చోట గట్టిగా ధ్వని వినిపించింది. అప్పుడు రాముడు అంత గట్టిగా ధ్వని ఎందుకు వినిపిస్తుంది అని విశ్వామిత్రుడిని అడిగాడు. అప్పుడు ఆయన ఇలా చెప్పాడు ” ఒకనాడు బ్రహ్మ గారు తన మనస్సుతో కైలాస పర్వత శిఖరాల మీద ఒక సరోవరాన్ని నిర్మించారు. ఆ సరస్సుకి మానస సరోవరం అని పేరు. ఆ సరోవరం నుంచి ప్రవహించినదె సరయు నది. పవిత్రమైన ఆ సరయు నది ఈ ప్రాంతంలొ గంగా నదితో సంగమిస్తుంది, కాబట్టి ఒకసారి ఆ నదీ సంగమానికి నమస్కరించమన్నాడు”. అవతలి ఒడ్డుకు చేరాక అందరూ పడవ దిగి అరణ్యంగుండా తమ ప్రయాణం కొనసాగించారు.

వాల్మీకి రామాయణం 8 వ భాగం, బాలకాండ

యాగం పూర్తయ్యాక, అక్కడికి వచ్చిన రాజులందరికీ బహుమానాలు ఇచ్చి సత్కారాలు చేసి పంపించారు. రుష్యశృంగుడికి సాష్టాంగ నమస్కారం చేసి, ఆయనని సత్కరించి శాంతా రుష్యశృంగులను అన్ని మర్యాదలు చేసి సాగనంపారు. ఆ యాగానికి వచ్చిన వాళ్ళందరిని తగిన విధంగా సత్కరించారు దశరథ మహారాజు.

కొంత కాలానికి దశరథ మహారజులోని తేజస్సు ఆయన భార్యలలోకి ప్రవేశించి వాళ్ళు గర్భవతులయ్యారు.

తతః చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ |
నక్క్షత్రే అదితి దైవత్యే స్వ ఉచ్ఛ సంస్థేషు పంచసు ||
గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతా ఇందునా సహ |
ప్రోద్యమానే జగన్నాథం సర్వ లోక నమస్కృతం ||

జగన్నాధుడైన వాడు, సర్వలోకాల చేత నమస్కారింపబడే వాడు 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి, చైత్ర మాసంలొ, నవమి తిథి నాడు, పునర్వసు నక్షత్రంలొ, కర్కాటక లగ్నంలొ రామచంద్రమూర్తి జన్మించారు. అదే సమయంలొ కైకేయకి పుష్యమి నక్షత్రంలొ, మీన లగ్నంలొ భరతుడు జన్మించాడు. తరువాత సుమిత్రకి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు.

తనకి నలుగురు కుమారులు పుట్టారని తెలిసి ఆ దశరథుడు చాలా ఆనందపడ్డాడు. కోసల దేశంలోని ప్రజలంతా సంబరాలు జెరుపుకున్నారు. అదే సమయంలొ బ్రహ్మ గారు దేవతలతొ ఒక సభ తీర్చారు……” శ్రీమహా విష్ణువు భూలోకంలొ రాముడిగా అవతరించారు, రావణసంహారంలొ రాముడికి సహాయం చెయ్యడానికి మీరు మీ అంశలతో కొంతమందిని సృష్టించండి. పార్వతీదేవి శాపం వల్ల మీకు మీ భార్యలవల్ల సంతానం కలగదు, కావున మీతో సమానమైన తేజస్సు, పరాక్రమము కలిగిన వానరాలని గంధర్వ, అప్సరస, కిన్నెర స్త్రీలందు కనండి” అని చెప్పారు. దేవతలందరూ రామకార్యం కోసం పుట్టడం మన అదృష్టమని ఆనందపడ్డారు.

అప్పుడు బ్రహ్మ ” ఒకసారి నాకు ఆవలింతవచ్చింది, అప్పుడు నా నోట్లోనుంచి ఒకడు కిందపడ్డాడు, అతనే జాంబవంతుడు. ఇక మీరు సృష్టించండి” అని అన్నారు. ఇంద్రుడి అంశతొ వాలి జన్మించాడు, సూర్యుడి అంశతొ సుగ్రీవుడు జన్మించాడు, బృహస్పతి అంశతొ తారుడు జన్మించాడు, కుబేరుడి అంశతొ గంధమాదనుడు జన్మించాడు, అశ్విని దేవతల అంశతొ మైందుడు, ద్వివిదుడు జన్మించారు, అగ్ని అంశతొ నీలుడు జన్మించాడు, వాయువు అంశతొ హనుమంతుడు జన్మించాడు, పర్జన్యుడికి శరభుడు, వరుణుడికి సుషేణుడు జన్మించాడు. దేవతలు ఇలా సృష్టించడం చుసిన ఋషులు మేము కూడా సృష్టిస్తాం అని కొన్ని కోట్ల కోట్ల వానరాలని సృష్టించారు.

వాల్మీకి రామాయణం 7 వ భాగం, బాలకాండ

తతో దేవాః స గంధర్వాః సిద్ధాః చ పరమ ఋషయః |
భాగ ప్రతిగ్రహార్థం వై సమవేతా యథావిధి ||

ఆ యిష్టి జెరుతున్నప్పుడు, అందులో తమ తమ భాగాలని పుచ్చుకోడానికి దేవతలు, యక్షులు, గంధర్వులు, కింపురుషులు మొదలైనవారు అందరూ వచ్చి నిలబడ్డారు. అప్పుడు బ్రహ్మగారు కూడా అక్కడికి వచ్చారు. అందరూ ఆయన దెగ్గరికి వెళ్లి, ” పితామహ! మీరు ఆ రావణుడి తపస్సుకి మెచ్చి ఆయనకి అనేక వరములు ఇచ్చారు, మీరు ఇచ్చిన వరముల వలన గర్వంపొంది వాడు ఈనాడు…..

నైనం సూర్యః ప్రతపతి పార్శ్వే వాతి న మారుతః |
చలోర్మిమాలీ తం దృష్ట్వా సముద్రోపి న కంపతే ||

రావణుడికి భయపడి సూర్యుడు బాగా ప్రకాశించడం లేదు, సముద్రం తరంగాలు లేకుండా నిశ్చలంగా ఉంటుంది, వాయువు రావణుడి దెగ్గర అవసరంలేకపోయినా మెల్లగా వీస్తుంది,  ఈ రకంగా వాడు దిక్పాలకులని బాధపెడుతున్నాడు, ఎక్కడా యజ్ఞములు జెరగనివ్వడంలేదు, ఋషులని హింసిస్తున్నాడు, పర భార్యలని తన వారిగా అనుభవిస్తున్నాడు. ఇన్ని బాధలు పడుతున్న మాకు వాడిని సంహరించె మార్గం చెప్పవలసింది” అని ఆ దేవతలు బ్రహ్మదేవుడిని కోరారు. అప్పుడు బ్రహ్మగారు  ” నేనూ వాడి అకృత్యాలు వింటున్నాను, వాడు తపస్సుతో నన్ను మెప్పించి, రాక్షసుల చేత, దేవతల చేత, యక్షుల చేత, గంధర్వ కిన్నెర కింపురుషుల చేత మరణం లేకుండా వరం కోరుకున్నాడు, కాని వాడికి మనుషుల మీద ఉన్న చులకన భావం చేత మనుష్య వానరాలని అడగలేదు” అని అన్నారు. అక్కడున్న అందరూ ఒక మార్గం తెలిసిందని సంతోషపడ్డారు.

ఒకరు పిలిచారా లేదా అని చూడకుండా, అంతా నిండిపోయిన పరమాత్మ, ఎంతో దయాముర్తి అయిన శ్రీ మహావిష్ణువు ఆ సభ మధ్యలొ తనంతట తానుగా వచ్చారు….

ఏతస్మిన్ అనంతరే విష్ణుః ఉపయాతో మహాద్యుతిః |
శఙ్ఖ చక్ర గదా పాణిః పీత వాసా జగత్పతిః ||

ఒక్కసారి నల్లని మేఘం వస్తే ఎలా ఉంటుందొ,  అందమైన రూపంతొ, మెడలొ వైజయంతి మాలతొ, శంఖ చక్ర గధ పద్మాలని పట్టుకొని శ్రీమహా విష్ణువు ఒక ప్రతిజ్ఞ చేశారు……

హత్వా క్రూరం దురాధర్షం దేవ ఋషీణాం భయావహం |
దశ వర్ష సహస్రాణి దశ వర్ష శతాని చ ||
వత్స్యామి మానుషే లోకే పాలయన్ పృధ్వీం ఇమాం |
ఏవం దత్వా వరం దేవో దేవానాం విష్ణుః ఆత్మవాన్ ||

మీరెవరు కంగారు పడొద్దు, రావణుడు చేసే అక్రుత్యాలన్ని నాకు తెలుసు, వాడిని సంహరించడానికి నేనే మనుష్యుడిగా జన్మించాలని నిర్ణయం తీసుకున్నాను. నన్ను నమ్ముకున్న దేవతలని, ఋషులని క్రూరంగా బాధపెడుతున్నాడు, అందుకని వాడిని సంహరించి ఈ భూమండలం మీద పదకొండు వేల సంవత్సరాలు ఉండి ఈ పృథ్వి మండలాన్ని పరిపాలన చేస్తాను అని భగవానుడు అన్నాడు.

తతః పద్మ పలాశాక్షః కృత్వా ఆత్మానం చతుర్విధం |
పితరం రోచయామాస తదా దశరథం నృపం ||

నేనే నలుగురిగా ఈ దశరథ మహారాజుకి పుడతాను అని ప్రతిజ్ఞ చేశారు.

అక్కడ ఋష్యశృంగుడు చేయిస్తున్న పుత్రకామేష్టి యాగం పూర్తవబోతుంది. ఇంతలో ఆ యోగాగ్నిలో నుంచి ఒక దివ్య పురుషుడు నల్లని ఎర్రని వస్త్రములు ధరించి, చేతిలొ వెండి మూత కలిగిన ఒక బంగారు పాయస పాత్ర పట్టుకొని, సింహంలా నడుస్తూ బయటకి వచ్చి దశరథ మహారాజుని పిలిచాడు. దశరథుడు ఆయనకి నమస్కరించి నేను మీకు ఏమిచెయ్యగలను అన్నాడు. అప్పుడు ఆ పురుషుడు ఇలా అన్నాడు ” నాయనా దశరథా!  నన్నుప్రాజాపత్ర్య పురుషుడు అంటారు, నన్ను ప్రజాపతి పంపించారు, ఈ పాత్రలోని పాయసాన్ని దేవతలు నిర్మించారు. ఈ పాయసాన్ని నీ భార్యలు స్వీకరిస్తే నీకు సంతానం కలుగుతుంది. ఈ పాయసాన్ని స్వీకరించడం వల్ల నీ రాజ్యంలోని వాళ్ళు ధన ధాన్యాలతో తులతూగుతారు, ఆరోగ్యంతొ ఉంటారు” అని చెప్పి వెళ్ళిపోయాడు.

వెంటనే దశరథుడు ఆ పాయసాన్ని తన ముగ్గురు పత్నులకి ఇద్దామని అంతఃపురానికి వెళ్ళాడు. ముగ్గురినీ పిలిచి, ఆ పాయసంలొ సగభాగం కౌసల్యకి ఇచ్చాడు, మిగిలిన సగంలోని సగభాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు, ఆ మిగిలిన భాగాన్ని సగం సగం చేసి, ఒక భాగాన్ని కైకేయకి మరొక భాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు.

వాల్మీకి రామాయణం 6 వ భాగం, బాలకాండ

ఆ యాగశాలని చాలా అద్భుతంగా నిర్మించారు, ఆ యాగశాలలొ 21 యూప స్తంభాలని పాతారు, మారేడు కర్రలతొ చేసినవి 6, మోదుగు కర్రలతొ చేసినవి 6, ఛండ్ర కర్రలతొ చేసినవి 6, దేవదారు కర్రలతొ చేసినవి 2 మరియు శ్లేష్మాతక కర్రతొ చేసినది ఒకటి ఉంటుంది. దశరథుడు శుక్ల యజుర్వేదానికి చెందిన వాడు కనుక, దానికి అనుగుణంగా ఆ యాగశాలని నిర్మించారు. ఎంతో శాస్త్రయుక్తంగా ఆ యాగం జెరుగుతుంది. చివర్లో ఆ యాగాశ్వాన్ని తీసుకొచ్చి ఆ యూప స్తంభానికి కట్టారు. పట్టమహిషి అయిన కౌసల్య మూడు కత్తులతొ ఆ యాగాశ్వాన్ని వధించింది. ఆ రోజు రాత్రి ఓ శాలలొ కౌసల్య ఆ గుర్రం పక్కన పడుకొని ఉండాలి.

మరుసటి రోజున ఈ యాగం చేయించిన ఋత్విక్కులకి, రాజు 4 భార్యలని దానం చెయ్యాల్సి ఉంటుంది. మొదట పట్టమహిషిని, ఉపేక్షిత భార్యని, ఉంపుడుగత్తెని, చివరిగా ఫాలాకలిని దానం చేస్తాడు. ఆ ఋత్విక్కులు ఆ నలుగురు భార్యలని తిరిగి రాజుకి ఇచ్చేస్తారు. అప్పుడు ఆ రాజు తన భార్యలను తీసుకొని ఆ ఋత్విక్కులకి ద్రవ్యాన్ని(ధనం) దానం ఇస్తాడు. ఇప్పుడు ఆ గుర్రం శరీరంలోనుంచి వప(జంతువుల కడుపులొ బొడ్డు కింద వుండే ఉల్లిపొర వంటి కొవ్వు) ని తీసి ఆ అగ్నిలొ వేశారు. ఆ వప అగ్నిలొ కాలుతున్నప్పుడు వచ్చే ధూమాన్ని రాజు పీల్చాలి, దీనినె అశ్వమేథయాగం అంటారు. అలా పీలిస్తే, తనకి సంతానం కలగకుండా ఏ పాపం అడ్డుపడుతుందొ, ఆ పాపం పోతుంది. చివరగా ఆ గుర్రం శరీరంలోని మిగతా భాగాలని ఆ హోమంలొ హవిస్సుగా సమర్పిస్తారు.

దశరథ మహారాజు తన రాజ్యాన్ని అశ్వమేథయాగం చేయించిన ఋత్విక్కులకి దానం చేశాడు, అప్పుడు వాళ్ళు మేము ఈ భూభారాన్ని వహించాలేము, నువ్వు రాజువి, నువ్వే పరిపాలించాలి అని ఆ రాజ్యాన్ని తిరిగి రాజుకే ఇస్తారు. దక్షిణలేని యాగం జెరగకూడదు కనుక, దశరథ మహారాజు ఆ ఋత్విక్కులకి 10 లక్షల గోవుల్ని, 100 కోట్ల బంగారు నాణాలని, 400 కోట్ల వెండి నాణాలని దానం చేశాడు. అక్కడికి వచ్చిన మిగతా బ్రాహ్మణులందరికీ ఒక కోటి బంగారు నాణాలని దానం చేశాడు. ఋష్యశృంగ  మహర్షి లేచి….ఓ రాజా! నీకు సంతానం కలగడం కోసం, నేను అధర్వ వేదంలో చెప్పబడిన ఒక బ్రహ్మాండమైన యిష్టిని చేయిస్తాను. అదే పుత్రకామేష్టి యాగం అని చెప్పి ఆ యిష్టి చెయ్యడం ప్రారంభించారు…….

వాల్మీకి రామాయణం 5 వ భాగం, బాలకాండ

కాబట్టి దశరథ మహారాజు ఆ రుష్యశృంగుడిని పిలవడానికి, అంగదేశానికి స్వయంగా వెళ్ళాడు. అక్కడ 8 రోజులున్నాక, వెళ్ళిపోతూ దశరథుడు రోమపాదుడితొ ఇలా అన్నాడు…మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యం ఉంది, కనుక నీ కూతుర్ని అల్లుడిని కూడా నాతో పంపిస్తావా, అని అడిగాడు. రోమపాదుడు ఆనందంగా పంపించాడు. దశరథుడు చాలా సంతోషించి, వాళ్ళని అయోధ్యకి తీసుకెళ్ళాడు.

అలా కొంత కాలం గడిచాక, ఒకనాడు దశరథ మహారాజు ఋష్యశృంగుడి దెగ్గరికి వచ్చి ఇలా అన్నాడు…….అయ్యా! నేను సంతానహీనుడిని, నాకు చాలా దిగులుగా ఉంది, నాకు సంతానం కలగకుండ ఏ పాపము ప్రతిబంధకంగా నిలబడుతోందొ, ఆ పాపాన్ని పరిహరించుకోడానికి వేదము చేత నిర్ణయింపబడిన అశ్వమేథ యాగాన్ని మీరు నాతొ చేయించాలి అని కాళ్ళు పట్టి ప్రార్ధించాడు. అప్పుడు ఋష్యశృంగుడు ఇలా అన్నాడు……యాగం చెయ్యాలనే ధార్మికమైన బుద్ధి నీకు ఎప్పుడైతే కలిగిందొ ఆనాడే నీకు మంచి జెరగడం మొదలయ్యింది. కావున నీకు శూరులు, లోకముచేత కీర్తింపబడే నలుగురు కుమారులు కలుగుతారని ఆశీర్వదించాడు.

చైత్ర మాసంలొ చిత్రా నక్షత్రంతొ వచ్చే పౌర్ణమి నాడు యాగాశ్వాన్ని తీసుకొచ్చి ఒక స్తంభానికి కట్టి, దానికి ప్రోక్షణ, స్నాపన, విమోచన చేశారు. ఇంకా కొన్ని ఇతరమైన క్రతువులు చేశాక ఆ యాగాశ్వాన్ని విడిచిపెట్టారు. అది అలా ఒక 12 నెలలు తిరుగుతుంది, దాని వెనకాల మహా శూరులైన వాళ్ళు వెళతారు. ఆ అశ్వం తిరిగొచ్చేలోపు అంటె ఫాల్గుణ మాసంలొ వచ్చె అమావాస్యకి రాజు యాగశాల ప్రవేశం చెయ్యాలి. కాబట్టి దశరథ మహారాజు ఋష్యశృంగుడిని, వశిష్ఠుడిని పిలిచి యాగం ప్రారంభించాల్సిందిగా కోరాడు. ఆ యాగానికి ఇతర దేశాల నుండి రాజులను, ప్రజలను, జానపదులను, వేద బ్రాహ్మణులను, విద్వాంసులను ఆహ్వానించాడు. వచ్చిన వాళ్ళందరికి భోజనాలు పెట్టారు. పల్లెటూర్లనుంచి వచ్చిన వాళ్ళని అశ్రద్ధగా చూడకండి, భోజనం పెట్టేటప్పుడు అందరికీ శ్రద్ధగా వడ్డించండి అని వశిష్ఠుడు చెప్పాడు.

సర్వే వర్ణా యథా పూజాం ప్రాప్నువంతి సుసత్కృతాః |
న చ అవజ్ఞా ప్రయోక్తవ్యా కామ క్రోధ వశాత్ అపి ||

పది మంది భోజనం చేసేటప్పుడు కొంతమంది కామక్రోధాలకిలోనై అనరాని మాటలు మాట్లాడితే, మీరు నవ్వి వచ్చెయ్యండి, పట్టించుకోమాకండి. భోజనం చెయ్యడానికి పంక్తిలొ కూర్చున్నవాడు అతిధి రూపంలొ ఉన్న సాక్షాత్తు భగవంతుడు, కాబట్టి మర్యాదలకి ఎటువంటి లోటు రాకూడదు అని వశిష్ఠుడు ఆజ్ఞాపించాడు. అలాగే జనక మహారాజు, కాశి రాజు, రోమపాద రాజు, కైకేయ రాజుని పిలవడానికి ఎవరినో కాకుండా స్వయంగా మంత్రులనే వెళ్ళమని చెప్పి, అందరికి విడిది ఏర్పాటుచెయ్యండి అని ఆదేశించాడు. అలా వచ్చిన వాళ్ళందరికి భోజనాలు పెడుతున్నారు….

వృద్ధాః చ వ్యాధితాః చ ఏవ స్త్రీ బాలాః తథా ఏవ చ |
అనిశం భుంజమానానాం న తృప్తిః ఉపలభ్యతే ||

అక్కడికి వచ్చినవాళ్ళల్లో వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, స్త్రీలు, చిన్ని చిన్ని పిల్లలు ఉన్నారు. భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళంతా, ఆహ! భోజనాలు ఏమి రుచిగా ఉన్నాయి అని అంటున్నారు. ఇంత రుచికరమైన భోజనాలు మళ్ళి ఎప్పుడు తింటామో అని అనుకుంటున్నారు. దశరథ మహారాజు వాళ్ళందరిని చూసి, ఇంకా తినండి, ఇంకా తినండి అంటున్నాడు. వచ్చిన వాళ్ళందరికి  ధనము, వస్త్రములు దానం చేశాడు దశరథుడు. వచ్చినవాళ్ళందరూ “ఆహ! ఎంతచక్కని భోజనం పెట్టావు రాజ, ఎంత గొప్ప వస్త్రాలు ఇచ్చావయ్య, నీ కోరిక తీరి, నీకు సుపుత్రులు కలిగి, నీ వంశము ఆచంద్ర తారార్కంగా వర్ధిల్లుతుందని ఆశీర్వదించి వెళ్లారు.

 

వాల్మీకి రామాయణం 4 వ భాగం, బాలకాండ

దశరథ మహారాజు దక్షిణ నాయకుడు, ఆయనకి 300 కి పైగా భార్యలున్నారు. కాని పత్నులు మాత్రం కౌసల్య, సుమిత్ర, కైకేయి. తను యాగం మొదలపెడుతున్నాడు కాబట్టి, తన పత్నులని దీక్ష స్వీకరించమన్నాడు. అంతఃపురంలోకి వెళుతున్న దశరథ మహారాజుతొ సుమంత్రుడు ఇలా అన్నాడు………..

సనత్కుమారో భగవాన్ పూర్వం కథితవాన్ కథాం |
ఋషీణాం సన్నిధౌ రాజన్ తవ పుత్రాగమం ప్రతి ||

పూర్వకాలంలొ ఒకసారి సనత్కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు…………ఇక్ష్వాకువంశములొ జన్మించిన దశరథ మహారాజుకి కుమారులు లేక అశ్వమేథ యాగం చేస్తాడు. ఆ యాగం వల్ల ఆయనకి నలుగురు కుమారులు కలుగుతారు. కాని అశ్వమేథ యాగంతొ పాటు పుత్రకామేష్టి యాగం కూడా చెయ్యాలి. ఈ రెండు యాగాలని చెయ్యగలిగినవాడు రుష్యశృంగుడు. ఆయన ఆ యాగాలని చేస్తేనే బిడ్డలు పుడతారని సనత్కుమారుడు చెప్తుంటే విన్నాను అని సుమంత్రుడు దశరథ మహారాజుతొ అన్నాడు.ఆ రుష్యశృంగుడు పక్కనే ఉన్న అంగదేశంలొ ఉన్నాడు, కాబట్టి మీరు వెళ్లి ఆయనని తీసుకొని రండి అన్నాడు.

అప్పుడు దశరథ మహారాజు, నాకు ఆ రుష్యశృంగుడు గురించి వివరంగా చెప్పు అంటె, సుమంత్రుడు ఇలా చెప్పసాగాడు………….పూర్వకాలంలొ విభణ్డక మహర్షి చాలాకాలం తపస్సు చేసి స్నానం చెయ్యడానికి ఒక సరస్సు దెగ్గరికి వెళ్ళగా, అక్కడ అలా వెళుతున్న ఊర్వశిని చేసేసరికి ఆయన రేతస్థానము నుంచి కదిలిన వీర్యం సరోవరంలొ పడింది. ఆ వీర్యాన్ని ఒక జింక తాగి, గర్భం దాల్చి, శిరస్సు మీద కొమ్ము ఉన్న ఒక పిల్లవాడికి జన్మనిచ్చింది. అలా శిరస్సు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయనకి రుష్యశృంగుడు అని పేరు పెట్టారు. ఆ విభణ్డక మహర్షి, రుష్యశృంగుడికి సమస్త వేదాలు, శాస్త్రాలు, యజ్ఞయాగాదులు అన్నీ చెప్పాడు. కాని ఆ రుష్యశృంగుడికి లోకం తెలీకుండా పెంచాడు, ఆయనకి అసలు ఈ సృష్టిలో స్త్రీ-పురుషులని ఇద్దరు ఉంటారని కూడా తెలీకుండా పెంచాడు. అంటె విషయసుఖాల వైపు వెళ్ళకుండా పెంచాడు. ఎప్పుడూ ఆ ఆశ్రమంలోనే, తండ్రి పక్కనే ఉండేవాడు. ఆ అంగరాజ్యాన్ని పరిపాలించే రోమపాదుడు ధర్మం తప్పడం వల్ల ఆ రాజ్యంలొ వర్షాలు పడడం మానేశాయి. దేశంలొ క్షామం వచ్చింది. రుష్యశృంగుడు కాని మన దేశంలొ అడుగుపెడితే వర్షాలు తప్పక కురుస్తాయని కొందరు మహర్షులు అన్నారు.


వెంటనే రాజు మంత్రుల్ని పిలిచి విషయం చెప్తే, రుష్యశృంగుడిని తీసుకురావడం మావల్ల కాదు, ఏమి కోరికలు లేని వాడు, మన రాజ్యానికి ఎందుకు వస్తాడు అన్నారు. ఎంతైనా మంత్రులు కనుక ఒక మాట అన్నారు….. ఇంద్రియార్థైః అభిమతైః నరచిత్త ప్రమాథిభి |. రుష్యశృంగుడికి కుడా ఇంద్రియాలు, మనస్సు ఉంటాయి. వాటికి ఇప్పటిదాకా రుచి తగలక, విషయసుఖాల వైపుకి రాలేదు. కాబట్టి అందంగా అలంకరించుకున్న కొంతమంది వేశ్యలని పంపిస్తే, విభణ్డకుడు లేని సమయంలో వీళ్ళు ఆ రుష్యశృంగుడి మనస్సుని ఆకర్షించి, ప్రలోభపెడతారు. అప్పుడు ఆయనే వాళ్ళ వెంట వస్తాడు, అని మంత్రులు సలహా ఇచ్చారు.

ఆ వేశ్యలకి విభణ్డకుడి మీద ఉన్న భయం వలన, వాళ్ళు ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు పాడడం, నాట్యం చెయ్యడం మొదలుపెట్టారు. ఒకరోజు విభణ్డకుడు లేని సమయంలో గానం విన్న రుష్యశృంగుడు, ఆ గానం వస్తున్న వైపు వెళ్ళాడు. అక్కడున్న ఆ వేశ్యలని చూసి, వాళ్ళు పురుషులే అనుకొని, మహాపురుషులార! మీరు మా ఆశ్రమానికి రండి, మిమ్మల్ని పూజిస్తాను అన్నాడు. అందరూ విభణ్డకుడి ఆశ్రమానికి వెళ్లారు. తరువాత ఆ వేశ్యలు ఆశ్రమంనుంచి వెళ్ళిపోతూ ఆ రుష్యశృంగుడిని గట్టిగ కౌగలించుకుని వెళ్ళిపోయారు. మరునాడు ఆ రుష్యశృంగుడికి మనసులో దిగులుగా అనిపించి, ఆ వేశ్యలని చూడాలనిపించి, వాళ్ళ దెగ్గరికి వెళ్ళాడు. ఈసారి వాళ్ళు ఆయనని కొంచెం దూరంలో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మన్నారు. సరే అని అందరూ బయలుదేరారు. ఆయన అలా అంగదేశంలో అడుగుపెట్టగానే……….

తత్ర చ ఆనీయమానే తు విప్రే తస్మిన్ మహాత్మని |
వవర్ష సహసా దేవో జగత్ ప్రహ్లాదయన్ తదా ||

ఆకాశం నుంచి బ్రహ్మాండమైన వర్షం కురిసింది. వెంటనే రోమపాదుడు రుష్యశృంగుడికి నమస్కారం చేసి, ప్రార్ధించి, అంతఃపురానికి తీసుకెళ్ళి తన కుమార్తె అయిన శాంతని ఇచ్చి వివాహం జెరిపించారు.

 

వాల్మీకి రామాయణం 3 వ భాగం, బాలకాండ

వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చోగ ఆయనకి బ్రహ్మ గారి వరం వల్ల జెరిగిన రామాయణం అంతా ఆయనకి కనబడసాగింది. ఆయన రామాయణం రచించడం ప్రారంబించారు. మొత్తం 24,000 శ్లోకాలు, 6 కాండలు, 6 కాండల మీద ఒక కాండ, 500 సర్గల రామాయణాన్ని రచించడం ప్రారంబించారు. తరవాత ఆయన ఈ రామాయణాన్ని ఎవరితో పాడిస్తే బాగుంటుందని చెప్పి అక్కడున్న లవకుశలతో పాడించారు. వాళ్ళు తరవాత ఆ రామాయణాన్ని రాముడి సమక్షంలో అయోధ్యలో పాడడం మొదలుపెట్టారు……..


కథ ప్రారంభం

రామాయణం ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి ఇలా అంటారు………….

పూర్వకాలంలొ కోసల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది. ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనువు తన సంకల్ప బలంతో నిర్మించాడు. ఆ నగరం 12 యోజనముల పొడువు, 3 యోజనముల వెడల్పు ఉండేది( యోజనం అంటె = 9 మైళ్ళు ). ఆ నగరం మధ్యలొ రాజ ప్రాసాదంలొ దశరథ మహారాజు నివాసముండేవారు. ఆ నగరంలొ రహదారులన్నీ విశాలంగా, ఎప్పుడూ సుగంధ ధూపాలతొ ఉండేవి. ధాన్యం, చెరుకు లాంటి పంటలన్నీ బాగా పండేవి ఆ రాజ్యంలొ. ఏ ఇంట్లోనుకుడా అనవసరంగా ఉన్న నేల లేదు. అయోధ్య నగరంలొ అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు, అందరూ ధర్మం తెలిసిన వాళ్ళే, ఎవడికి ఉన్నదానితొ వాడు తృప్తిగా ఉండేవాళ్ళు, అందరూ దానం చేసేవాళ్ళు, సత్యమే పలికేవాళ్ళు, అందరూ ఐశ్వర్యవంతులే, ఆవులు, గుర్రాలు, ఏనుగులతొ ఆ నగరం శోభిల్లేది. చెవులకి కుండలములు లేనివాడు, కిరీటం లేనివాడు, మెడలొ పూలహారం లేనివాడు, హస్తములకు ఆభరణములు లేనివాడు, దొంగతనం చేసేవాడు, నాస్తికుడైనవాడు ఆ అయోధ్య నగరంలొ లేడు.

దశరథ మహారాజుకి 8 ప్రధాన మంత్రులు ఎప్పుడూ సహాయం చేసేవారు, వాళ్ళు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలకుడు, సుమంత్రుడు. వశిష్ఠుడు, వామదేవుడు ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చె ఋత్విక్కులు. ఇతరమైన బ్రాహ్మణులూ, మంత్రులు కూడా ఉండేవారు. ఆ మంత్రులు అపారమైన విద్య కలిగిన వాళ్ళు, పని చెయ్యడం తెలిసినవాళ్లు, ఇంద్రియములను నిగ్రహించినవాళ్లు, శ్రీమంతులు, శాస్త్రము తెలిసిన వాళ్ళు, సావధాన చిత్తం కలిగినవాళ్ళు. ఆ కోసల దేశంలొ పరభార్య మీద వ్యామోహం ఉన్న వ్యక్తి ఒక్కడు కూడా లేడు.

ఇన్ని ఉన్నా ఆ దశరథ మహారాజుకి ఒక బాధ ఉండేది. వంశోద్దారకుడైన పుత్రుడు లేడనే బాధ ఉండేది. ఆయనకి అప్పటికి 60,000 సంవత్సరాలు నిండిపోయాయి. ఆయనకి అశ్వమేథ యాగం చెయ్యాలనే ఆలోచన వచ్చి, వెంటనే సుమంత్రుడిని పిలిచి, ఋత్విక్కులైన వశిష్ఠుడు, వామదేవుడు మరియు ఇతర పురోహితులని పిలవమని చెప్పాడు. అందరికీ తన ఆలోచన చెప్పాడు. అందరూ సరే అన్నారు. అశ్వమేథ యాగానికి కావాల్సిన సంభారములన్నీ తెప్పించి, సరయు నదికి ఉత్తర తీరంలొ యాగమంటపం నిర్మించారు.

వాల్మీకి రామాయణం 2 వ భాగం, బాలకాండ

తపస్స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం |
నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం ||

వాల్మీకి మహర్షి రామాయణంలొ రాసిన మొదటి శ్లోకం. దీని అర్ధం ఏంటంటె, తపస్వి, ముని, గొప్ప వాగ్విదాంవరుడైన నారద మహర్షిని పరిప్రశ్న చేయడానికి తపస్వియైన వాల్మీకి మహర్షి సిద్ధపడుతున్నారు అని. వాల్మీకి మహర్షి నారదుడిని ఏమడిగారంటె…………….

కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ |
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధృఢవ్రతః ||
చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః |
విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చ ఏక ప్రియదర్శనః ||
ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కః అనసూయకః |
కస్య బిభ్యతి దేవాః చ జాత రోషస్య సంయుగే ||

ఈ లోకంలొ ఇప్పుడే, ఇక్కడే ఉన్న గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞత భావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, ధృడమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్ధుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలొ మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుగోగలిగినవాడు ఉంటె నాకు చెప్పండి అని అడిగాడు.

నువ్వు చెప్పిన గుణాలన్నీ ఒకే మనిషిలొ ఉండడం కష్టమే, కాని ఒకడు ఉన్నాడు, నీకు ఇప్పుడు అతని గురించి చెప్తాను అని నారద మహర్షి ఇలా అన్నారు……..
ఇక్ష్వాకువంశములొ రాముడని పేరుగల ఒక వ్యక్తి జన్మించాడు. ఆయనకి నువ్వు అడిగిన 16 గుణాలు ఉన్నాయి అని చెప్పి ఒక 100 శ్లోకాలలో సంక్షిప్త రామాయణాన్ని వాల్మీకి మహర్షికి నారదుడు చెప్పాడు.

చెప్పిన తరవాత నారదుడు వెళ్ళిపోయాడు. విన్న వాల్మీకి మనస్సు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు మధ్యాన సమయంలొ సంధ్యావందనం చెయ్యడానికి తమసా నది తీరానికి భారద్వాజుడు అన్న శిష్యుడితో వెళ్లారు. అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకుంటున్న రెండు క్రౌంచ పక్షులని చూశారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాపనిశ్చయుడై మిధున లక్షణంతో ఉన్న ఆ మగ క్రౌంచ పక్షి గుండెల్లో బాణం పెట్టి కొట్టాడు. కిందపడిన ఆ మగ పక్షి చుట్టూ ఆడ పక్షి ఏడుస్తూ తిరుగుతుంది. అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటున్న వాల్మీకి మహర్షికి ఈ సంఘటన చూసి, బాధ కలిగి ఆయన నోటివెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది………..

మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః|
యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్||

ఓ దుర్మార్గుడైన బోయవాడా! మిధున లక్షణంతో ఉన్న రెండు క్రౌంచ పక్షులలొ ఒక క్రౌంచ పక్షిని కొట్టినవాడ, నీవు చేసిన పాపమువలన నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవుగాక, అని శపించాడు.

ఆయన స్నానం ముగించి ఆశ్రమానికి బయలుదేరారు, కాని ఆయన నోట్లో ఈ మాటలు తిరుగుతూనే ఉన్నాయి, మనసులో ఆ క్రౌంచ పక్షులే కనిపిస్తున్నాయి. అలా ఆయన శిష్యులు కూడా ఈ మాటలని ధారణ చేశారు, అలా అది శ్లోక రూపం దాల్చింది. ఇంతలో చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యపోయిన వాల్మీకి మహర్షి బ్రహ్మగారిని ఆశ్రమంలోకి తీసుకెళ్ళి కుర్చోపెట్టారు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు “ఓ బ్రాహ్మణుడా!  నీ నోటివెంట వచ్చిన ఆ శ్లోకమే రామాయణ కథ.” అన్నారు. ఆ శ్లోకానికి అర్ధం చూడండి……

“నిషాద” అంటె బోయవాడు అని ఒక అర్ధం, అలాగే సమస్త లోకములు తనయందున్న నారాయణుడు అని ఒక అర్ధం. “మా” అంటె లక్ష్మి దేవి. “మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః”, అంటె లక్ష్మిని తనదిగా కలిగిన ఓ శ్రీనివాసుడా నీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక. ” యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్”, కామము చేత పీడింపబడి, బ్రహ్మగారు ఇచ్చిన వరముల చేత అహంకారము పొంది, కామమే జీవితంగా జీవిస్తున్న రాక్షసుల జంట అయిన రావణ-మండోదరులలో, రావణుడు అనే క్రౌంచ పక్షిని నీ బాణంతో కొట్టి చంపిన ఓ రామ, నీకు మంగళం జెరుగుగాక, అని ఆ శ్లోక అర్ధం మారింది.

బ్రహ్మగారు అన్నారు, “నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహం చేత నువ్వు ఈ రోజు రామాయణాన్ని పలికావు. నాయనా, నేను నీకు వరం ఇస్తున్నాను ” నువ్వు కూర్చొని రామాయణం రాద్దామని మొదలెడితే, రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, రాక్షసులు మొదలైన వాళ్ళు మాట్లాడినదే కాదు, వాళ్ల మనస్సులో అనుకున్న విషయాలు కూడా తెలుస్తాయి. ఈ భూమి మీద నదులు, పర్వతాలు ఎంత కాలం ఉంటాయో అంత కాలం రామాయణం ఉంటుంది. ఇందులో ఒక్క మాట అబద్ధం కాని, కల్పితం కాని ఉండదు. నువ్వు ఇంక రామాయణం రాయడం మొదలపెట్టు” అని వరం ఇచ్చి వెళ్ళిపోయారు.