వాల్మీకి రామాయణం 107 వ భాగం, అరణ్యకాండ

“రామ! నాకు తెలుసు నువ్వు వస్తున్నావని. నేను నా తపఃశక్తితో ఇంద్రలోకాన్ని, బ్రహ్మలోకాన్నిగెలిచాను, అందుకని నన్ను తీసుకెళ్ళడానికి ఇంద్రుడు స్వయంగా వచ్చి, నన్ను రమ్మన్నాడు. కాని నేను, నాకు ప్రియమైన అతిధి వచ్చాడు, అతనికి ఆతిధ్యం ఇచ్చాక వస్తాను అన్నాను. రామ! నేను నా తపఃశక్తితో గెలుచుకున్న లోకాలని నీకు ధారపోసేస్తాను, యధేచ్చగా సీతాలక్ష్మణులతో కలిసి విహరించు ” అని శరభంగుడు అన్నాడు.

ఈ మాటలు విన్న రాముడు ” మహానుభావ! మీరు తపస్సు చేసి నాకు ధారపొయ్యడమేమిటి. నాకు ఎక్కడ ఆశ్రమం కట్టుకోవాలో చెప్పండి చాలు, అక్కడ నేను తపస్సు చేసుకుంటాను ” అన్నాడు.

రాముడి మాటలకు సంతోషించిన శరభంగుడు ” ఇక్కడికి దెగ్గరలో సుతీక్ష్ణుడు అనే మహర్షి ఉన్నారు, నువ్వు ఆయనని దర్శించు. రామ! నీకు ఒక విచిత్రమైన కార్యం చూపిస్తాను, అలా నిలబడి చూడు. నా శరీరం జర్జరీభూతం( ముసలిదయిపోయి ముడతలు పడిపోయింది) అయిపోయింది, కనుక ఈ శరీరాన్ని అగ్నిలో కాలుస్తాను ” అని చెప్పి, ఆ అగ్నిహోత్రంలో నెయ్యి వేసి, తన శరీరాన్ని ఆ అగ్నిలో వేశాడు.

తస్య రోమాణి కేశాం చ తదా వహ్నిః మహాత్మనః |
జీర్ణం త్వచం తద్ అస్థీని యత్ చ మాంసం చ శోణితం ||
ఈ సన్నివేశాన్ని చూసిన సీతారామలక్ష్మణులు ఆశ్చర్యంతో అలా ఉండిపోయారు. ఆ అగ్నిలో శరభంగుడి వెంట్రుకలు, శరీరం, రక్తం, ఎముకలు కాలిపోయాయి. తరువాత ఆ శరభంగుడు ఆ అగ్ని నుండి కౌమారంతో ఉన్న శరీరంతో బయటకి వచ్చి ఋషులు, నిత్యాగ్నిహోత్రులు పొందే లోకాలని దాటి బ్రహ్మలోకంలోకి వెళ్ళిపోయాడు.

బ్రహ్మలోకంలో సింహాసనం మీద కూర్చుని ఉన్న బ్రహ్మగారు లేచి ” మహానుభావ! శరభంగ, స్వాగతం, సుస్వాగతం ” అన్నారు. అలా శరభంగుడు ఉత్కృష్టమైన ఆ బ్రహ్మ లోకాన్ని చేరుకున్నాడు.