వాల్మీకి రామాయణం 156 వ భాగం, అరణ్యకాండ
Posted by adminJun 5
వాల్మీకి రామాయణం 156 వ భాగం, అరణ్యకాండ
ఏ ముఖాన్ని చూసి ఆ రావణుడు ఇలా హద్దులు మీరి మాట్లాడుతున్నాడో, ఆ ముఖాన్ని తన ఉత్తరీయంతో కప్పుకొని, సీతమ్మ తల్లి కళ్ళు ఒత్తుకుంటూ ఏడ్చింది.
ఏతౌ పాదౌ మయా స్నిగ్ధౌ శిరోభిః పరిపీడితౌ
ప్రసాదం కురు మే క్షిప్రం వశ్యో దాసో అహం అస్మి తే ||
ఏడుస్తూ ఉన్న సీతమ్మని చూసిన ఆ రావణుడు ” నీ పాదాలు పట్టుకుంటున్నాను సీతా, నా కోరిక తీర్చి నన్ను అనుగ్రహించు ” అన్నాడు. ( రావణుడు తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా, శిరస్సు వంచి సీతమ్మ పాదాలు పట్టుకున్నాడు కనుక, సీతమ్మని ఇన్ని మాటలు అన్నా కొంతకాలమైనా బతికాడు.)
అప్పుడు సీతమ్మ, తనకి రావణుడికి మధ్యలో ఒక గడ్డిపరకని పెట్టి ” రాముడు ధర్మాత్ముడు, దీర్ఘమైన బాహువులు ఉన్నవాడు, విశాలమైన కన్నులున్నవాడు, ఆయన నా భర్త, నా దైవం. ఇక్ష్వాకు కులంలో పుట్టి, సింహం వంటి మూపు ఉండి, లక్ష్మణుడిని తమ్ముడిగా కలిగిన రాముడి చేతిలో ప్రాణములు పోగొట్టుకోడానికి సిద్ధంగా ఉండు రావణా. నువ్వే కనుక రాముడి సన్నిధిలో నన్ను ఇలా అవమానించి ఉంటె, ఈ పాటికి నువ్వు ఖరుడి పక్కన పడుకొని ఉండేవాడివిరా. నీ ఆయువు అయిపోతుంది, నీ ఐశ్వర్యము పోతుంది, నీ ఓపిక అయిపోతుంది, నీ ఇంద్రియాలు కూడా పతనమయిపోతాయి, నీ లంకా పట్టణం విధవగా నిలబడడానికి సిద్ధంగా ఉంది, ఇవన్నీ నువ్వు చేసిన పని వల్ల భవిష్యత్తులో జెరగబోతున్నాయి. నీటి మీద పట్టే నాచుని తినే నీటికాకిని, నిరంతరం రాజహంసతో కలిసి క్రీడించడానికి అలవాటుపడిన హంస చూస్తుందా. రాముడిని చూసిన కన్నులతో నిన్ను నేను చూడనురా పాపి, అవతలకి పో ” అనింది.
ఈ మాటలకి ఆగ్రహించిన రావణుడు ” నీకు 12 నెలలు సమయం ఇస్తున్నాను. ఈలోగా నీ అంతట నువ్వు బుద్ధి మార్చుకొని నా పాన్పు చేరితే బతికిపోతావు. అలాకాకపోతే 12 నెలల తరువాత నిన్ను నాకు అల్పాహారంగా పెడతారు ” అని చెప్పి, భయంకరమైన స్వరూపం కలిగిన రాక్షస స్త్రీలని పిలిచి ” ఈమెని అశోక వనానికి తీసుకువెళ్ళండి. ఆమె చుట్టూ మీరు భయంకరమైన స్వరూపాలతో నిలబడి, బతికీ బతకడానికి కావలసిన ఆహారాన్ని, నీళ్ళని ఇస్తూ, శూలాలలాంటి మాటలతో ఈ సీతని భయపెట్టి నా దారికి తీసుకురండి. ఇక తీసుకువెళ్ళండి ” అన్నాడు.
వికృత నేత్రములు కలిగిన ఆ రాక్షస స్త్రీలు చుట్టూ నిలబడి భయపెడుతుంటే, అశోక వనంలో శోకంతో ఏడుస్తూ ఆ సీతమ్మ ఉంది.